గౌతమ బుద్దుడు మరియు అతని శిష్యబృందం ధర్మప్రచారం కోసం, విశ్వశాంతికై వివిధ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఇదే పర్యటనలో ఒకరోజు ఒక ఊరికి వెళ్ళారు. బుద్దుని రాకని గమనించిన స్థానికులు అతని సూక్తులు వినడానికి అక్కడొక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దాదాపు ఆ ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకున్నారు. బుద్దుడు కూడా ఆ సమావేశానికి చేరుకుని తన ఆలోచనత్మక సూక్తులు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు కాని ఆయన చూపు ఇంకొకరి కోసం వెతుకుతుంది. బుద్దుడు వెతుకుతున్న ఆ వ్యక్తి ఒక 13సంవత్సరాల పాప.. బుద్దుడు ఆ ఊరిలోనికి వచ్చేముందే ఆ పాప బుద్దుడుని కలుసుకుని "మీకోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఇదిగో నా చేతిలో ఉన్న ఆహారాన్ని మా నాన్న గారికి ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను ఖచ్చితంగా మీ సూక్తులు వినడానికి వస్తాను ఒకవేళ కాస్త ఆలస్యమైన దయచేసి నాకోసం వేచి ఉండండి." అని చెప్పింది ఆ ఆలోచనలు అలా బుద్దుని మదిలో మెదులుతున్నప్పుడు ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా "స్వామి మీరు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు.. ఇక్కడ అందరూ ఉన్నారు మీరు ఇక జ్ఞానబోధ ప్రారంభించవచ్చు."
బుద్దుడు: తప్పకుండా ప్రారంభిస్తాను, కాని నా సూక్తులు వినడానికి అమితమైన ప్రేమతో ఒక బాలిక వస్తానని చెప్పింది.. తన కోసమే ఎదురు చూస్తున్నాను.. ఇలా మాట్లాడుతుండగానే ఆ పాప పరుగున వచ్చేసింది. బాలిక బుద్దునితో: నాకు కాస్త ఆలస్యమైన మీరు వేచి ఉన్నారు మీరిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి లేండి ఎందుకంటే నేను మీకోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నాను. నాకు ఇంకా గుర్తుంది 4 సంవత్సరాల వయసులో మీ పేరు విన్నా.. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మీకోసం ఎదురుచూస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి.. బుద్దుడు: బహుశా నువ్వు నా మీద ఏర్పరుచుకున్న ప్రేమ, నీ బలమైన కాంక్షనే నన్ను ఈ ఊరికి నడిపించింది. నువ్వు నన్ను భౌతికంగా కలవకపోయినా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను.
సమావేశం ప్రారంభించారు.. ముగించారు. ఆ తర్వాత బుద్దుడు ధ్యానం(Meditation) చేయడానికి ఆ ఊరి ప్రజలను ఆహ్వానించారు కాని ఏ ఒక్కరూ కూడా రాలేదు ఆ ఒక్క పాప తప్ప. ఈ పరిస్థితి చూసి ఆ రోజు గౌతమ బుద్దుని శిష్యుడు ఆనందుడు బుద్దుడిని ఓ ప్రశ్న అడిగాడు.. మీరు ఈ సమావేశంలో ఎవరినైనా ప్రభావితం చేయగలిగారా..? అని..
దానికి బుద్దుడు.. నీ అనుమానంలో అర్ధం ఉంది.. ఎవరైతే దాహంగా ఉన్నారో వారి దాహాన్ని తీర్చడం కోసమే నా ప్రయాణం సాగుతుంది. ఎవరికి ఎంత అవసరమో అంతే నా వద్ద నుండి తీసుకుంటారు.. ఎవరైతే అన్ని రకాలుగా బాగున్నారో వారు నా వద్దకు రాకపోవచ్చు కాని ఎవరికైతే నా అవసరం ఉంటుందో నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్తాను. ఒక గురువు శిష్యుని కోసం వెళితే ఒక శిష్యుడు గురువు కోసం వెలతాడు. కాస్త ఆలస్యమైన కాని వారిద్దరు తప్పకుండా కలుస్తారు. వారిద్దరి బంధం భౌతికంగా ఉండదు ఆత్మతో ముడిపడి ఉంటుంది. వారిద్దరూ ఒకే చోట ఉన్నా లేకపోయినా వారిద్దరూ కలిసే ఉంటారు. నువ్వు ఒకేసారి రెండు దీపాలను ఒకే చోట పెడితే చూడటానికి అవి రెండు వేరువేరుగా ఉన్న కూడా ఆ దీపపు కాంతి ఒకేలా ఉంటుంది. గురు శిష్యల శరీరాలు వేరయినా వారిద్దరి ఆత్మ ఒక్కటే..
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.