అభివృద్ది జరుగుతున్న కొద్ది జనాల అభిరుచులలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.. ఆ మార్పుకూడా "జీవంతో ముడిపడి ఉండడం" నిజంగా ఓ మంచి పరిణామం. పూర్వం ఇంటిలో నిజమైన మొక్కలను పెంచేవారు కాని తర్వాతి తరం వారు ఓపిక, స్థలం లాంటి రకరకాల కారణాల వల్ల పరిమళం వెదజల్లలేని ప్లాస్టిక్ పూలు, ఆక్సిజన్ అందించలేని ప్లాస్టిక్ మొక్కలను ఇంట్లో అమర్చేవారు. కాని పరిస్థితులు ఎప్పుడూ ఒకేరకంగా ఉంటాయా.. మళ్ళి పూర్వం రోజులు వచ్చేస్తున్నాయి కొద్ది మార్పులతో. నాడు భారీ వృక్షాలు పెంచితే నేడు చిన్నగా కనిపించే భారీ వృక్షాలను పెంచుతున్నాము. ఈ బోన్సాయి మొక్కలు కొంచెం ఖర్చు ఎక్కువే. కొనడం కన్నా మనమే పెంచితే అంత ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు ఈ బోన్సాయి మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచవచ్చు అని వీర్ చౌదరి బోన్సాయ్ మొక్కలను పెంచుతూ తనకు తెలిసిన ఆ కళనే అందరికి అందిస్తున్నారు.
వీర్ చౌదరిది కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వెళంగి ప్రాంతం. ఎం.సి.ఏ పూర్తిచేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం కూడా చేశారు. "ఇది నా జీవితం కాదు, నా జీవితాన్ని నేను గడపడం లేదు" అని తెలుసుకున్నాక ఖచ్చితంగా మన ప్రపంచంలో పెనుమార్పులు సంభవిస్తాయి. అలా వీర్ సాఫ్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికొచ్చేసి తనకెంతో ఇష్టమైన బోన్సాయ్ మొక్కలను పెంచడం మొదలుపెట్టారు.
చైనాలో పుట్టిన ఈ బోన్సాయ్ మొక్కలను పెంచడానికి వీర్ చౌదరికి ఎటువంటి నైపుణ్యం లేదు, కేవలం ఇంటర్నెట్ లో చూసి మాత్రమే నేర్చుకున్నారు. మామూలు మొక్కను బోన్సాయ్ మొక్కగా వృద్ధి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది. కత్తిరింపు దగ్గరినుండి ఎదుగుదల వరకు దీనిని ఒక పద్దతి ప్రకారం, జగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వీర్ కు మొదట కాస్త ఇబ్బందిగా అనిపించింది కాని పూర్తి సమయాన్ని వీటి మీద కేంద్రీకరించడం వల్ల బోన్సాయ్ మొక్కల పెంపకంలో ఆరితేరిపోయారు. తన సొంత ప్రాంతంలో బోన్సాయ్ మొక్కలను చూసిన బంధువులు, స్నేహితులు ఎంతగానో ముచ్చట పడిపోయేవారు. వారి ఇష్టాన్ని గమనించిన వీర్ ప్రేమగా పెంచిన మొక్కలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా పంపిణీ చేసేవారు.
ఈ మధ్య కాలంలో బోన్సాయ్ మొక్కలు విరివిగా దోరుకుతున్నాయి కాని వీటిని ఎలా పెంచాలి.? అనే పద్దతులపై కోచింగ్ ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఆ రహస్యం తెలిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుంది అని వ్యాపారులు అనుకున్నా కాని మన వీర్ మాత్రం తెలుగు రాష్ట్రాల నుండి మొదలుకొని ముంబాయ్, డిల్లీ, బెంగళూర్ లాంటి ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ ప్రయాణంలో వీర్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. వడోదరలో వీర్ ప్రదర్శించిన మర్రిజాతి బోన్సాయ్ "ఫైకస్ రూబిగనోసా" అనే మొక్కకు దేశంలోనే రెండో అత్యుత్తమ అవార్డు వరించింది. మైసూర్‌లో జరిగిన ఓ కాంపిటేషన్ లో ఒక మొక్కను అప్పటికప్పుడు బోన్సాయ్‌గా మలిచి మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. ఇలా ఎన్నోసార్లు రకరకాల అవార్డులను తన ప్రతిభ ద్వారా అందుకున్నారు.
మొదట గమ్యం తెలియకుండ మొదలైన తన ప్రయాణం ఇప్పుడు అసలైన జీవన మార్గంలో సాగుతుంది. మనల్ని మనం తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణించడం కంటే జీవితంలో సాధించేది ఏముంటుంది.?