ఏవేవో అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలి అని కాని మనం అనుకున్నట్టు చాలాసార్లు ఏమి జరగవు.. ఇదేంట్రా బాబు నా బతుకు ఇలా తగలడింది, ఆ బ్రహ్మ నా తలరాత ఇలా రాసి ఆడుకుంటున్నాడు అని బ్రహ్మను చాలా సార్లు తిట్టుకుంటాం. పాపం ఏ దైవుడినైనా భయంతో, భక్తితో వేడుకుంటాం కాని బ్రహ్మను మాత్రం కోపంగా కొప్పడతాం.. అమ్మ నాన్నల మీద కోప్పడితే వారి మీద ప్రేమ లేనట్టా..? ఐనా దేవుడున్నాడు అని నమ్మబట్టే కదా ఆయన మీద కోప్పడేది. 'అలా కొప్పడితే ఐనా మనకోసం ఏదైనా మంచి చేస్తాడేమోనని చిన్న ఆశ' అని మళ్ళి మనమే సర్ధిచెప్పేసుకుంటాం..

బ్రహ్మతో పాటు త్రిమూర్తులైన శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరునికి ప్రతి ఊరిలో, ప్రతి కాలనీలో దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీరాముని గుడిలో శివుని ప్రతిమ, వేంకటేశ్వరుని దేవాలయంలో వినాయకుని ప్రతిమ, ఇలా ప్రతి ఒక్క గుడిలో అందరి దేవతలు కొలువై ఉంటారు, అందరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.. కాని మన తలరాతను రాసే బ్రహ్మకు మాత్రం అస్సలు పూజించరు.. ఆయన దేవలయాలు కూడా అంతగా లేవు. మన ఇంట్లో కూడా బ్రహ్మను పూజించము.. ఆకరికి నిన్న మొన్న వచ్చిన స్వాములను పూజిస్తాము కాని ఆ సృష్టికర్తను మాత్రం అస్సలు పూజించము..

దీనికి ప్రధాన కారణం బ్రహ్మదేవుడు చేసిన తప్పుల మూలంగా పరమేశ్వరుడు, భృగు మహర్షి శాపం విధిస్తారు.. 'నీకు ఈ భూ మండలంలో దేవాలయాలు, పూజలు ఉండవు' అని శపిస్తారు. కాని శపించిన ఆ శివుడే బ్రహ్మకు చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామిగా తనలో భాగం కల్పిస్తారు ఆ మహిమాన్విత పుణ్యక్షేత్రమే ఈ గుంటూరు జిల్లా చెబ్రోలు ఉన్న గుడి. ఈ దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని చోళులు, కాకతీయులు లాంటి గొప్పరాజుల కాలంలో ఇక్కడ గొప్పగా పూజలు జరిగేవని స్థల పురాణం చెబుతుంది. బ్రహ్మదేవునికి మనదేశంలో చాలా తక్కువ గుడులు ఉన్నాయి ఉన్నవాటిలో కాశి, పుష్కర్ మరికొన్ని గుడుల తర్వాత ఈ చెబ్రోలులోని కోవెల పవిత్రమైనదిగా పరిగనిస్తారు. అందువల్లనే కాబోలు ఈ కోవెలను "చిన్న కాశి" అని కూడా పిలుస్తారు.

ఎక్కడా లేనట్టుగా కొలును మధ్యలో నిర్మించబడిన అత్యంత పురాతన దేవాలయం ఇది. చుట్టూ చెట్లు, చల్లని గాలి, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం నిర్మితమైనది. శివలింగంలో బ్రహ్మదేవుడు నాలుగు శిరస్సులతో ఉండటం వల్ల చతుర్ముఖ లింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఒకప్పుడు రాజుల కాలంలో పండుగలాంటి వాతావరణం ఉండేది కాని ఇప్పుడు చారిత్రక నేపద్యం ఉన్న ఈ కట్టడాలు శిధిలావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం ముందుకు వచ్చి తగిన విధంగా చర్యలు తీసుకుంటే మన సంస్కృతిని కాపాడుకోగలుగుతాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.