సూర్యుడు, చంద్రుడు ఎలా ఒక్కరో అలాగే భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు బలంగా నమ్ముతారు. ఈ భూమి మీద శివుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని అందరిలోను శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. శివునికి మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి. వాటిలో వేటికదే ప్రత్యేకమైనది, ప్రత్యేక చరిత్ర కలిగినది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అనంతపురం తాడిపత్రి లోని బుగ్గా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కూడా అత్యంత మహిమాన్వితమైనది.
భక్తులు పూజలందుకుంటున్న రామ లింగేశ్వరుడి ప్రతిమ త్రేతయుగం కాలం నాటిది. బ్రహ్మణుడైన రావణుడిని చంపడం వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివ లింగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టించిన శివ లింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారుల కథనం. విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి హయాంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామ లింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అందమైన శిల్పాలతో నిర్మించారు. భక్తులు గర్భగుడిలోని శివుడిని దర్శించినపుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న శిల్పాలకు అంతే ముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయ శిల్పులతో సంవత్సరాల తరబడి కష్టపడి జాగ్రత్తగా ఈ ఆలయాన్ని నిర్మించారు.
శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివ లింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడి శివ లింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంటుంది. అలాగే ప్రతి క్షణం లింగం కింది భాగం నుండి నీరు వస్తుండడం గొప్ప విశేషం. పేరుకు పరమశివుని దేవాలయమైనా కాని ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువు తీరి ఉన్నారు. ఈ గుడిలోనే కోదండరామ స్వామి, వీరభద్ర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉప ఆలయాలున్నాయి.