నేనిప్పుడు వివరించబోయేది ఒక స్వర్గం గురుంచి..
ఇక్కడ 100% ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది..
ఇక్కడ సరదాగా ఈత కొట్టుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ లో కాదు, చెరువులో..
ఇక్కడి ప్రాంతమంతా చల్లగా ఉంటుంది, ఏసీ వల్ల కాదు ప్రకృతి ఇచ్చిన చెట్లవల్ల..
ఇక్కడ నివాసముంటున్న వారందరు పాకెట్ పాలు తాగరు. స్వచ్ఛమైన ఆవు పాలు తాగుతారు. ఇందుకోసం 32 దేశీ ఆవులున్నాయి..
చికెన్ కోసం నాటుకోడి, ఫిష్ కోసం అక్కడే చెరువులో పెంచుతున్న చేపలు..
ఇక్కడ కరెంట్ బిల్లులు ఉండవు, ఎందుకంటే 100% సోలార్ పవర్ నే ఉత్పత్తి చేస్తున్నారు..
ఈ భూమి ఒక భూతల స్వర్గం.. ఒక మనిషి ఎక్కడా ఎలా ఉంటే బాగుంటుందని కలలుకంటాడో అదిగో అలాంటి ప్రదేశమండి ఇది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ విలేజ్ ను సహజంగా ఫౌంటెన్ హెడ్ డిజైన్స్ నిర్మాత నగేష్ గారు ఇంకా అతని టీం నిర్మించారు.
10 ఎకరాలలో వ్యవసాయం:
చక్రం మళ్ళీ వెనక్కి తిరుగుతుంది.. అభివృద్ధి అంటే ఆర్టిఫిషియల్ అని అనుకున్నది కాస్త సహజంగా ఉండడమే నిజమైన అభివృద్ధి అని తెలుసుకుంటున్నాము. "ఆర్గానో నాంది" 36.5 ఎకరాలలో నిర్మించిన 73 ఇళ్ల గృహ సముదాయం. పట్టణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం, అన్నిరకాల సౌకర్యాలు సహజంగా ఉండాలనే తలంపుతో దీనిని నిర్మించారు. 36 ఎకరాల భూమిలో 10 ఎకరాలు వ్యవసాయానికి కేటాయించారు. 73 ఇళ్లల్లో నివాసముంటున్న ప్రజలందరూ ప్రకృతి ఆహారాన్ని వాళ్లే పండించుకుంటారు.
ఇతర ఆహారం ఇక్కడనే:
"భారతదేశం పాలు పారిన భాగ్యసీమ అని రాయప్రోలు వారంటారు" అలాంటి దేశం ఇప్పుడు ఇలా అలమటించడం బాధాకరం. ఇక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా పాలకోసం 30కి పైగా ఆవులను మేపుతున్నారు. శ్రేష్టమైన విత్తనాల కోసం సీడ్ బ్యాంక్, అసలైన రుచికరమైన చికెన్ కోసం దేశవాళీ నాటుకోళ్లు పెంచుతున్నారు. ఇక్కడ ఉదయం కోడి కూతతోనే మొదలవుతుంది. చెరువులోనే రకరకాల చేపలను కూడా పెంచుతున్నారు. 93 రకాల ఔషధ మొక్కలు ఉండడం వల్ల వాతావరణం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఈ మొక్కలను ఉపయోగించుకుంటున్నారు.
సోలార్ పవర్, 12 కోట్ల లీటర్ల నీరు పొదుపు:
ఇదొక సమిష్టి అభివృద్ధి అన్ని రంగాల్లోనూ సహజమైన అభివృద్ధి. ఇక్కడ కురిసే 12 కోట్ల వాన నీటిని 30 లక్షల సామర్ధ్యం గల 5 ఇంకుడు గుంతలలో నిల్వచేస్తున్నారు. రివర్స్ ఆస్మోసిస్ పద్దతిలో నీటిని ఫ్యూరీఫై చేసి ఇంటి అవసరాల కోసం అందిస్తున్నారు. మరికొంత నీటిని చెరువుకోసం, స్విమ్మింగ్ పూల్ కై వినియోగం జరుగుతుంది. నదుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయినట్టుగా సూర్యుని ఎండను పూర్తిగా ఇంతవరకు గ్రహించుకోలేకపోయాము. ఈ విలేజ్ లో ప్రతి ఇంటిపై 10కిలోవాట్ల సామర్ధ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. ప్రతి ఇంటికి నెలకు అవసరమయ్యే 25వేల యూనిట్ల విద్యుత్ ఇస్తున్నారు, మిగిలితే గనుక వేరొక గ్రిడ్ వారికి అమ్ముతున్నారు.
ఇక్కడ ఏసీలు ఉండవ్వండి.. ఎందుకంటే ఏసీల అవసరం ఉంటేనే కదా ఏసీలు కావాల్సింది. ఇప్పటికి కాస్త ఎండగా ఉంటే బిల్డింగ్ నీడ కన్నా చెట్టు నీడ వైపే పరిగెడుతాం. 93 రకాల ఔషధ మొక్కలు, కూరగాయలు పండ్ల మొక్కలు, థర్మల్ కాకుండా సోలార్ పవర్ వినియోగం, మొదలైన చెట్ల మూలంగా ఇక్కడ వాతావరణం చల్లగా మునుపటి భారతదేశంలా ఉంటుంది. రెగ్యులర్ గ్యాస్ సిలెండర్ స్థానంలో ఆవుపేడతో బయోగ్యాస్ ఉత్పత్తిచేస్తున్నారు(ప్లాంట్ నిర్మించారు). పూర్తిగా వెదురుతో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద క్లబ్ హౌస్, రకరకాల శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్, ఆడిటోరియం.. ఇలా ఒక్కటేమిటి ఒక మనిషికి అవసరం అయ్యే ప్రతి ఒక్కటీ ఇందులో పొందుపరిచారు. ఇది వేల ఏళ్ల క్రితం నిర్మించిన విలేజ్ కాదు కొన్ని సంవత్సరాల క్రితం వేల ఏళ్లనాటి ప్రమాణాలతో సహజంగా నిర్మించిన విలేజ్. అందుకే దీనిని భూతల స్వర్గం అని సంభోదించేది.
Article info Source: Eeandu