దానికి కారణం నేను కూడా: ఒక వ్యక్తి ఆకలికి బాధపడుతున్నాడంటే దానికి ప్రతి ఒక్కరం కూడా కారణం అని దీప్తి గారు భావిస్తారు. లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది, సీఎం గారి దగ్గరినుండి లోకల్ పండ్లు అమ్మేవారి దగ్గర వరకు సిట్రస్ ఫ్రూట్స్ తినండి, ఇమ్యూనిటి పెంచుకోండని అంటున్నారు. హైదరాబాద్ మణికొండలో నివాసముంటున్న దీప్తి గారు ఒకరోజు తన ఇద్దరి పిల్లల కోసం నిమ్మ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తీసుకొచ్చారు. కానీ వాటిని తన పిల్లలకు ఇవ్వాలంటే 100% మనసు సహకరించడం లేదు, వారి ఇంటికి దగ్గర్లో పేద పిల్లలు ఉండడం దీనికి గల ప్రధాన కారణం. ఇంకో ఆలోచన లేకుండా తన పిల్లలకోసం తీసుకొచ్చిన పండ్లను దగ్గర్లోని పేద పిల్లలకు అందించారు. నేను మాత్రమే కాదు ప్రజలను ఇందులో భాగం చెయ్యాలి, దాని ద్వారా చాలామంది పేదలకు ఉపయోగపడుతుందని 'సిట్రస్500' ను మొదలుపెట్టారు.

రైతులకూ లాభం: పేదలకు పంచె పండ్లు 100% నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసిన చిన్న సన్నకారు రైతుల దగ్గర మాత్రమే కొనుగోలు చేయడం మూలంగా ఇటు రైతులకూ కూడా ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇది పంట కోతకు వచ్చే కాలం, మన తెలంగాణాలో అధిక సంఖ్యలో నిమ్మ, బత్తాయి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. మొక్క దగ్గరి నుండి వాటిని కంటికి రెప్పలా కాపాడుకొని ఈసారి గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడితే అనుకోని ఉపద్రవం లాక్ డౌన్ రూపంగా ఎదురయ్యింది. దీప్తి గారు కలుసుకునే ప్రతి రైతు కళ్ళల్లో చూసే ఆనందం, తన పట్ల గల కృతజ్ఞతా భావం వర్ణించలేనిదని అంటుంటారు.


నిమ్మ బత్తాయి తో పాటుగా ద్రాక్ష, సపోటా పండ్లను ప్రస్తుతం ఇస్తున్నారు, రానున్న రోజుల్లో మామిడి, జమకాయ, క్యారెట్ కూడా ఇవ్వబోతున్నారు. పెద్దమొత్తంలో రైతుల దగ్గర నుండి తీసుకొచ్చిన పండ్లను 250 కేజీలుగా విభజించి సిటీలో ఉన్న రకరకాల NGO లకు పంపిణీ చేస్తారు, ఆ NGO వారు రెండు కేజీల చొప్పున ప్యాక్ చేసి ఒక్కో కుటుంబానికి అందజేస్తారు. అటు రైతులకు ఇటు పేదలకు ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే ఇక్కడ సంప్రదించండి:80085 15615

