Contributed By Jayanth Deepala
"బీ.టెక్ ఆ..." అన్నాడు ఒక గౌరవమైన ఆశ్చర్యం తో, నేను ఏమి చదువుకున్నాను అని తను నన్ను అడిగినప్పుడు నా సమాధానానికి అతని బదులు అది. అతని పేరు అర్షనల్లా యస్.యస్.ఎల్.సి. ( మన దగ్గర యస్.యస్.సి) పాస్ అయ్యి కూడా కుటుంబ పరిస్థితుల వల్ల తన కల అయిన మిలిటరీ కి ప్రయత్నాలు వొదులుకుని వాళ్ళ నాన్న కోరిక మేరకు ఐ.టీ.ఐ చేయడానికి సిద్ధం అవుతున్న ఒక కార్ వాషింగ్ సెంటర్ లో బాయ్. ఈ రోజు నా కార్ మురికిని కడుగుతూ తన జీవితంలో జనాలకు కనిపించే మురికి గురించి, తన ఆశయం గురించి చాలా చక్కగా స్వచ్చమైన మనసు తో చెప్పాడు.
జీవితం తన మీద ఇంటి బాధ్యత పదిహేనవ ఏటే వేసేసింది. పెయింటర్ పని చేసి ఇల్లు అప్పటిదాకా నడిపిన నాన్నకి జబ్బు చేసి మంచాన పడ్డారు. భవితకు దారి చూపాల్సిన అన్న ఏమో తను చేసిన డిప్లొమా కి సరైన ఉద్యోగం దొరకక ఒక ఏడాది గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.బెంగళూర్ లో ఉన్న పోష్ సంస్కృతికి, ఈ మధ్య అమ్మాయిలు చేస్తున్న టిక్ టోక్ వీడియోల్లో చూసిన ఘోరాలకి భయపడి ఇంటర్మీడియట్ ( బెంగళూర్ లో పి.యు.సి) పూర్తి అయినా అక్క పైచదువులకి అమ్మ నాన్న స్వస్తి చెప్పించి తనకు పెళ్లి సంబంధాలు వచ్చేదాకా వారి ఆచారం ప్రకారం కురాన్ ని బోధనకు మసీద్ కి పంపిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దే అమ్మ , నాన్న అనారోగ్యం వల్ల బీడీలు చుట్టి డబ్బులు కూడబెట్టే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ ఇలా తనపై భారమైన సరే మొహం మీద చిరునవ్వు తగ్గకుండా కార్లన్ని తళతళా మెరిపిస్తాడు.
దైవం అంటే నమ్మకం, చదువంటే ఇష్టం, దేశం అంటే పిచ్చి. రెండు సంవత్సరాల్లో ఏడు సార్లు కురాన్ పూర్తి చేసేంత నమ్మకం,దాన్ని మానవాళి మనుగడకి మార్గం లా చూసే తత్వం, వేరే మతాలను గౌరవించే సంస్కారం ఉన్నవాడు.చదువు కోసం రోజూ పన్నెండు మైళ్ళు ప్రయాణించినా తరగని ఓపిక, ఆసక్తి. తన మతస్తులను ఈ దేశపు వారు కాదని బయట జరుగుతున్న ఘర్షణలు ఏవి పట్టించుకోకుండా తన దేశాన్ని ప్రేమిస్తూ దేశ సేవ చేసుకోవాలని మొండి పట్టుదల తనది. తన కలని చేరుకోవాలనే తపనతో రోజూ ఏదో విధంగా వాటికి దగ్గరగా ఉండాలని యూట్యూబ్ లో మిలటరీ ట్రైనింగ్ వీడియోస్ చూడటం, లేదా షేడ్ కి ఎవరైనా మిలటరీ కి సంబంధించిన వారు వస్తే వారితో వాకాబు, అదీ కుదరకపోతే నా లాంటి వారితో ఒక ముచ్చట వేస్తాడు. నచ్చని పని చేసుకుంటూ నచ్చే పని కోసం తను చేసే నిరీక్షణ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.
బీ.టెక్ ని ఒక ఉన్నతమైన చదువులా చూడడం మానేసి జోకులు, సెటైర్లు కోసం వాడుకుంటున్న ఈ రోజుల్లో తను ఐ.టీ.ఐ కి మాత్రమే పరిమితం అయినందుకు రోజు చాలా కుంగిపోతుంటాదంట.ఇవన్నీ చెప్పుకుంటూ తన మనసులో భారాన్ని వెల్లగక్కాడు. ఇలాంటి వారిని చూసినప్పుడే అసలైన కష్టాలు అంటే ఏంటో అర్థం అవుతాయి.
దైవాన్ని నమ్మండి. మత భేదాలు విడిచి దేశాన్ని ప్రేమించండి. మీ కుటుంబానికి అండగా నిలవండి. మీ చదువుకి విలువని ఇవ్వండి. మీ జీవితం ఎంత సౌఖ్యమో తెలిసి మసులుకొండి.
ఈ నాలుగు మాటలు నాకు చెప్పకనే చెప్పాడు అర్షనల్లా.అవి నాకు ఎక్కే లోగా కార్ వాష్ అయిపోయి తాళం నా చేతిలో పెట్టాడు. నేనూ ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఈ కథని మనసు నిండా నింపుకొని బయలుదేరాను. ముప్పై నిమిషాల్లో నన్ను ఇంతలా కుదిపేసిన అతను తన ఆశయన్ని ఇంకాస్త త్వరగా చేరుకోవాలని కోరుకుంటాను.