ఒక్క ఇసుక రేణువు మాత్రమే అందరినీ మోయ్యగలదా.? భూమి మీద ఒక్కో ఇసుక రేణువు సమిష్టిగా కలిసి ఉంటూ ప్రాణుల్ని మోస్తున్నాయి. ఏ ఒక్కరు ఒక్కరి వల్ల ఉన్నతంగా ఎదగలేరు, ఒక్కరి వల్ల పతనమవ్వలేరు, అదొక సమిష్టి కృషి, ప్రణాళిక. మనం ఇలాంటి స్థానంలో ఉన్నామంటే దానికి కారణం అమ్మ నాన్నలు, గురువులతో పాటు మన కన్నా ముందు నుండి ఉన్న ఈ సమాజం, మనతో కలిసి బ్రతుకున్న ఈ సమాజం కూడా. ఇదే వారి నమ్మకం, మా అందరి ఉన్నతికి కారణమయ్యిన ఈ సమాజానికి తమ వంతుగా సేవ చెయ్యాలని తొమ్మిది మంది మిత్రులు చెయ్యి చెయ్యి కలిపి "కేరింగ్ హాండ్స్ టుగెదర్" గా ఒక బలగమై చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు చేరుకుని మేం ఉన్నామని పలుకరిస్తున్నారు.
నాన్నగారి ప్రభావం:
రాజ్ కుమార్ స్కూల్ కు వెళ్ళేరోజుల్లో అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చే వ్యక్తులను గమనించేవాడు. "అయ్యో పర్వాలేదండి, ముందు ఈ కొంత డబ్బు తీసుకుని అమ్మాయి ఫీజు కట్టండి" అని నాన్న వారితో ఆత్మీయంగా మాట్లాడే మాటలు పెద్దయ్యాక ఒక బాధ్యతలను తీసుకువచ్చింది. నాన్న శారీరక వికాలంగుడైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సహాయం పొందిన వారు కృతజ్ఞత పూర్వకంగా పడే ఆనందం ముందు మిగిలిన ఆనందాలన్ని రాజ్ కుమార్ గారికి అల్పంగా కనిపించాయి. పది సంవత్సరాల క్రితం ఉద్యోగం మొదలుపెట్టినపుడు రాజ్ కుమార్ గారి నెల జీతం "మూడు వేల రూపాయలు." అప్పటి నుండే ఖర్చులను తగ్గించుకుని తన జీతంలో కొంత కుటుంబానికి ఇచ్చినట్టుగా తనను కలిసినవారిని ఆదుకునేవారు. చెన్నై వరదలు ఇతర ప్రమాదాలు వాటిల్లినప్పుడు స్వయంగా తనే ఆపన్నులను వెతుక్కుంటూ వెళ్ళేవారు. కాలాలు మారుతున్న కొద్దీ సహాయాన్ని మరింత విస్తరించాలి, మరింతమందికి సహాయం చెయ్యాలని అనుకున్నారు. తనలాంటి ఆలోచనలు ఒకే విధంగా ఉండే మిత్రులు అజిత్ అట్లూరి, వినయ్ కుమార్ వలుపదాస్, లోహిత్ కృష్ణ, రఘు మందాటి, సతీష్ మామిల్లపెల్లి, రామ్ నెల్లూరు, రాజేష్ వెలిశెట్టి, మరియు ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవన సహచరి ప్రవల్లిక కలిసి కేరింగ్ హాండ్స్ ద్వారా 2016 నుండి వీరి చేతులు ఎన్నో సహాయాలు చేస్తున్నాయి.
CHT ప్రారంభమయిన నాటి నుండి ఓల్డ్ ఏజ్ హోమ్, అనాథ ఆశ్రమంలోని పెద్దలకు, పిల్లలకు ఆహారమివ్వడం, వారికి అవసరం అయ్యే దుస్తులివ్వడం, ప్రకృతి పరంగా ఏ నష్టం కలిగిన అక్కడికి చేరుకుని మందులు, ఆహారమివ్వడం, అలాగే వివిధ హాస్పిటల్స్ లో ఉండే పేషేంట్స్ ను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడుతూ సహాయం అందిస్తున్నారు. ఇవన్నీ ఒక యెత్తు, పాఠశాలలను దత్తత తీసుకోవడం మరొకెత్తు. కేరింగ్ హాండ్స్ టుగెదర్ మరింత మంది హృదయాలను చేరుకోగలింది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడం వల్ల.
శిథిలావస్థ నుండి దృఢమైన నిర్మాణం వరకు:
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్. అక్కడ కాటవరం లోని గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి మరింత జాలి కలిగిస్తుంటుంది. పగలు పిల్లలు భయం భయంగా శిదిలావస్థలో ఉన్న బిల్డింగ్ కింద చదువుకునేవారు, రాత్రికి తాగుబోతులు సిట్టింగ్ వేసి స్కూల్ పవిత్రతను దిగజార్చడము జరిగేది. సరైన వసతులు, టీచర్స్ లేక ఇలాంటి స్కూల్ మరే ఊరిలో ఉండకూడదనే ఉదాహరణగా నిలిచేది. స్కూల్ అనారోగ్యాన్ని గ్రామస్థులు కేరింగ్ హాండ్స్ కు వివరించారు. కాటవరం ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాక ఒక్కో సమస్యను కూకటి వేళ్ళతో పెకిలించారు. "స్కూల్ పటిష్ట మరమ్మత్తులు, టాయిలెట్స్ నిర్మాణం, ప్రొజెక్టర్, కంప్యూటర్స్ తో డిజిటల్ క్లాస్ రూమ్ లు, ఆట వస్తువులు, డ్రాయింగ్ రూమ్ కోసం స్కెచ్, మరియు ఇతర సామాగ్రి, విద్యార్థుల నిండు జీవితానికి అవసరమయ్యే పుస్తకాలతో కూడిన లైబ్రెరీ, పిల్లలకు స్కూల్ బ్యాగులను కూడా అందించి వారి ఎదుగుదలకు ప్రత్యక్షంగా సహాయపడ్డారు.
దాదాపు రెండు సంవత్సరాలలో ఇలాంటి మార్పులను కేరింగ్ హాండ్స్ ఇప్పటికి 7 స్కూల్స్ లో తీసుకువచ్చింది. "మధ్యాహ్న భోజన పథకం, పిల్లల హాజర్, పాస్ పర్సెంటేజ్ చూస్తున్నారు తప్ప విద్యార్థులలో స్కిల్ డెవలెప్మెంట్ అంతగా దృష్టిపెట్టడం లేదని వీరి పర్యవేక్షణలో తేలింది." "నాలుగు గోడల మధ్య ఒత్తిడి నీడలో చదువు" కాకుండా పిల్లలకు నచ్చే ఆటగా కొన్ని మార్పులు తీసుకువస్తున్నారు. టీచింగ్ మెటీరియల్, ఎక్స్ట్రా కరిక్యులమ్, ప్రత్యేకంగా కేరింగ్ హాండ్స్ తరుపున ప్రిన్సిపాల్ గారి సహాయంతో వలంటరీ టీచర్లను నియమించడం, వారికి శాలరీ ఇవ్వడం, చిన్నతనం నుండే ఐఐటీ కోచింగ్ కూడా కేరింగ్ హాండ్స్ తరుపున కొన్ని పాఠశాలలో ప్రారంభించారు.
కేరింగ్ హాండ్స్ పిల్లలకు ఇచ్చే స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం కూడా పదిమందికి ఉపయోగపడుతుంది. వరంగల్ లో కొంతమంది వ్యక్తులు నడిపిస్తున్న కుటీర పరిశ్రమ నుండి వీటిని కొనుగోలు చేస్తుంటారు. కేరింగ్ హాండ్స్ ఎంత విజయవంతంగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలుసుకోవాలంటే పిల్లల సంఖ్య, పాస్ పర్సెంటేజ్ తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో కొత్త విద్యార్థులు చేరడం, 30% శాతం పాస్ పర్సెంటేజ్ పెరగడం వీరి సక్సెస్ కు ఉదాహరణలు.
You Can Reach Them Here: CaringHandsTogether
Raj Kumar, 9390108049