ఈ మధ్య చాలామంది గ్రామాలను మాత్రమే కాదు ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకుని ప్రైవేట్ స్కూల్స్ లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామం కాని ఇలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరగాలని ఎదురుచూసుకుంటూ కూర్చుంటే విలువైన సమయం వృధా అవుతుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా మన స్కూల్ సమస్యలను మనమే పరిష్కరించుకుందామనే బలమైన ఆకాంక్షతో మొదలయ్యిందే ఈ "టీ విత్ హెడ్ మాస్టార్".
ఈ పద్దతి మొదట అమెరికాలో స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ అయ్యింది. ఇది గొప్ప ఆలోచన, దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల గతి మారిపోతుందని భావించి అమెరికాలోనే జాబ్ చేస్తున్న జలగం సుధీర్ గారు మొదట తన సొంతవూరు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకటరామా పురం పాఠశాలలో ప్రారంభించారు. ఈ మీటింగ్ లో విద్యార్ధుల తల్లిదండ్రులతో ఒక సమావేశం ఏర్పాటుచేసి స్కూల్ లో ఉన్న సమస్యలను వివరిస్తారు. ఉదాహరణకు స్కూల్ లో టైయిలెట్ సౌకర్యం లేకుంటే తల్లిదండ్రులలో ఎవరైనా తాపీ పనిచేసే వారుంటే టాయిలెట్స్ ను నిర్మించడానికి ఉచితంగా పాల్గొంటారు.
అలా స్కూల్ కు సున్నం వేయడం దగ్గరి నుండి, కరెంట్ సమస్యలు, చెత్త సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలను తల్లిదండ్రులతో హెడ్ మాస్టర్ చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ పద్దతి చాలా అద్బుతమైన ఫలితాలను అందిస్తున్నది. ఇప్పటికి మన తెలంగాణలో 20స్కూల్స్ లో అమలు జరుగుతున్నా గాని త్వరలో దీనిని రెండు రాష్ట్రాలలో అమలుచేసేందుకు వీలుగా ప్రణాళికలు జరుగుతున్నాయి.