Suggested By: Vijay Kumar
భగవంతుడికి ఏ విధంగా పూజలు జరిపిస్తున్నారో భక్తునికి అదే స్థాయిలో పూజలు, గౌరవం దక్కడం బాహుశా అంజనేయస్వామి వారికే దక్కింది కాబోలు. పిరికితనంలో ధ్యైర్యం కావాలన్న, లక్ష్యం కోసం పోరాడే శక్తి కావాలన్న మనం వీరంజనేయుడినే ప్రార్ధిస్తాం. ఆంజనేయ స్వామి వారికి మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న అతి మహిమాన్విత దేవాలయాలలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చాకరిమెట్ల హనుమాన్ ఆలయం కూడా ప్రధానమైనది. హైదరాబాద్ నుండి సుమారు 50కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం నిర్మింపబడి ఉన్నది.


ఈ పవిత్రమైన దేవాలయాన్ని ప్రతిరోజు భక్తులు దర్శించుకుంటారు కాని వారంలో శనివారం, మంగళవారంలో మాత్రం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఒక్క శనివారం రోజే 10,000 మంది భక్తులు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంటారు.. పూర్వం ఆంజనేయ స్వామి వారు ఇదే ప్రాంతంలో స్వయంభూ గా వెలిశారని నమ్మకం. తర్వాత సుమారు 60 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి వారి మహాభక్తుడైన సీతారామశర్మ గారు స్వామి వారి ప్రతిమను ఇక్కడి దట్టమైన అడవిలో గుర్తించి 41 రోజులపాటు మాల ధరించి ప్రతిష్టించారట. ఆ తర్వాతి కాలంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడంతో భక్తులు రోజురోజుకు పెరగడంతో ఈ దేవాలయానికి విశేష గుర్తింపు లభించింది.


ప్రతి సంవత్సరం కార్తీకమాసం, శ్రావణమాసాలలో ఇక్కడికి పెద్దయెత్తున భక్తులు, కొత్తగా వివాహం జరిగిన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతారు.. ఒకేసారి ఎక్కువమంది వ్రతాలలో పాల్గొనేలా ఇక్కడ ఆలయ ప్రాంగణం నిర్మింపబడి ఉండడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగదు.. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో ఇక్కడ పూజలు, పండుగలు, వ్రతాలు వైభవంగా జరుగుతాయి. కేవలం మెదక్ జిల్లా నుండి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శనానినై తరలివస్తారు.


