ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు దర్శిస్తున్న దేవాలయం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పూజిస్తారు. అది తిరుమల ఐనా, చిలుకూరు ఐనా మరే ఇతర ప్రదేశంలోని దేవాలయమైనా కాని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ప్రదేశంలోను శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. అలా అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వేంకటరమణ స్వామి వారి గుడి కూడా ఒకటి.
ఈ ఆలయంలోని ప్రతిమ పూర్వం ఒక చింత చెట్టులో లభించడం వల్ల ఈ గుడిని చింతల వేంకటరమణ స్వామిగా పిలుస్తున్నారు. ఈ గుడిని మొదట 1509 - 1530 మధ్య తాడిపత్రిలోని తిమ్మనాయుడు అనే స్థానిక నాయకులు నిర్మించారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో మొదట చెప్పుకోవాల్సినది సూర్యుని వెలుగు కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవలసినది శిల్ప సౌందర్యం. రామాయణం, మహాభారతం, శ్రీ మహా విష్ణువు అవతారాలతో కూడిన మొదలైన ఘట్టాలను చూపిస్తూ శిల్పాలు అత్యంత సౌందర్యంగా, జీవం ఉన్న ట్టుగా దర్శనమిస్తాయి.
ఈ ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం శ్రీ కృష్ణదేవరాయుల కాలంలో తిమ్మనాయుడు తాడిపత్రి మండలం బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఈ ప్రాంతంలోని ఒక చింతచెట్టు భయంకరమైన శబ్ధంతో మధ్యకు విరిగింది, అప్పుడు ఆ చెట్టు నుండి వేంకటేశ్వర స్వామి ప్రతిమ బయటకు వచ్చిందట. ఆ తర్వత వేంకటేశ్వర స్వామి తిమ్మనాయుడికి కలలో కనిపించి ప్రతిమను ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారట. తిమ్మనాయుడు శ్రీ కృష్ణదేవరాయుల వారి ప్రోత్సాహంతో ఈ ఆలయాన్ని రమణీయమైన శిల్ప సౌందర్యంతో నిర్మించారట. ఇదే గుడిలో పన్నిద్దరాల్ వారి మందిరం, ఆంజనేయస్వామి వారి మందిరం, ఆనంద వల్లి, లక్ష్మి చెన్నకేశవ స్వామి మొదలైన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.