"2016 జూన్" "కృష్ణా జిల్లా, పెడన" ఒక వ్యక్తి కూతురు ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదు.. ఆ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని సహాయం కోసం అర్ధిస్తున్నారు. ఎక్కడా లాభం లేదు. కంట్లో నీరు ఇంకిపోతున్నట్టుగా ఆ పాప మీద ఆశలు వదులుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఐతే అంత వరకు వారు కలిసిన వ్యక్తులు వేరు, ఆ తర్వాత వారు కలవబోతున్న వ్యక్తి వేరు.
ఒక సుదీర్ఘ లక్ష్యం కోసం "ఈ సంఘటన" చక్రధర్ ను చేరుకుంది. అతని దగ్గర కూడా అంత పెద్ద మొత్తం లేదు.. చుట్టూ చూశాడు మనుషులు మాత్రం విపరీతంగా ఉన్నారు. కొంతమంది స్నేహితులను అడుగుతూ, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.. అంతే కొద్ది కాలంలోనే ఆ పాప అవసరం అయ్యే సహాయం పొందింది.
చెట్టు మీదున్న ఆపిల్ ఎప్పటి లానే భూమి మీద పడితే అందరూ పట్టించుకోలేదు ఒక్క ఐజాక్ న్యూటన్ తప్ప, ఈ సంఘటన కూడా చక్రధర్ ఆలోచనలో పెను మార్పులు తీసుకువచ్చింది. 2016 లో చక్రధర్ తనకిష్టమైన చిరంజీవి గారితో Chiranjeevi Helping Hands ( 9985854001 )పేరుతో NGO ను మొదలు పెడితే ఇప్పటికి రెండు సంవత్సరాలలో 14 లక్షలు వరకు పోగు చేసి "మూడు వివాహాలు, ఒక సొంత ఇల్లు, 80 మందికి అనారోగ్య సమస్యలకు ఆర్ధిక సహాయాలు,23 కుటుంబాలకు షాపులు పెట్టించి వారి జీవితాలను సెటిల్ చేశారు. ఇలా మొత్తం 105 మందికి ప్రత్యక్షంగా అవసరాలను తీర్చి సాక్షాత్తు చిరంజీవి గారితో అభినందనలు అందుకున్న నిజమైన అభిమాని చక్రధర్.
కృష్ణా జిల్లా పెడన కు చెందిన చక్రధర్ నాన్న స్థాపించిన హోటల్ నే నడిపిస్తున్నారు. చిరంజీవి గారంటే విపరీతమైన అభిమానం. అందరిలానే థియేటర్ ముందు బ్యానర్ లు కట్టడం, కటౌట్ కు దండలు వేయడం చేశారు. కాని ఒక వయసు వచ్చాక మాత్రం "దీని వల్ల కాస్త సంతోషమే ఉంటుంది, అదే అన్నయ్య పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తే అభిమానంలో ఉన్న ఆ శక్తి మరింత ప్రయోజనకరంగా మారుతుందనే నిజం తెలుసుకున్నారు. అలా Chiranjeevi Helping Hands 10 మందితో మొదలైతే ఇప్పుడు దాదాపు 500 మందికి చేరుకుంది. సంస్థ పనితనం, నిజాయితీ నచ్చి ఇందులో సుమారు 70 మంది మహేష్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్, ప్రభాస్, వై.ఎస్.జగన్, బాలకృష్ణ ఇలా మొదలైన వేరే అభిమానులు కూడా ఇందులో మెంబర్ షిప్ తీసుకున్నారు.
CHF ప్రారంభమైన మొదట్లో డబ్బు రూపంలో మాత్రమే సహాయం చేసేవారు. డబ్బు చేతికి ఇస్తే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అదే స్థితికి వచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాదు శాశ్వితంగా పరిష్కారం ఇవ్వాలి, ఇప్పుడు అడిగిన వాళ్ళు భవిషత్తులో కూడా మనదగ్గరికి ఆర్ధిక సమస్యతో రాకూడదని వారికి షాప్స్ పెట్టించి జీవితాలను సుస్థిరం చేస్తున్నారు..
ఒళ్ళు దాచుకోవడానికి కూడా ఇల్లు లేదు:
అతను గోల్డ్ షాప్ లో పనిచేస్తారు. జీతం నెలకు 6 వేల రూపాయలు. ఆ జీతంతోనే అమ్మ, భార్య, అమ్మాయి, అబ్బాయి బ్రతకాలి. వారికున్న 2 సెంట్ల స్థలంలో చీరలు, ట్రామ్పోలిన్ కట్టుకుని బ్రతుకున్నారు. చక్రధర్ కు వారి బాధను చెప్పుకున్నారు. ఒక ఇంటిని నిర్మించేంతటి డబ్బు కలెక్ట్ చెయ్యగలమా అనే అనుమానంతోనే విరాళాలను పోగుచెయ్యడం మొదలుపెట్టారు. కేవలం ఒకే ఒక్క నెలలో 85,000 రూపాయాలు పోగు చేశారు. వారి పాలిట ఒక స్వర్గాన్ని నిర్మించి ఇచ్చారు.
అమ్మ నాన్నలు లేని అమ్మాయికి పెళ్లి:
కరిష్మా బేగం గారిది మరో బాధకార జీవితం. చిన్నతనంలోనే అమ్మ నాన్నలు చనిపోయారు. పెద్దమ్మ పెద్ద మనసుతో పని మనిషిగా పనిచేస్తూ పెంచి పెద్ద చేశారు. పెళ్లీడుకొచ్చిన కరిష్మా గారికి పెళ్లి చేసేంత స్థోమత తనకు లేదు. పెళ్ళికోసం కనీసం 10వేల రూపాయలు కూడా వెచ్చించలేని వారి ఆశను చక్రధర్ గారు మోశారు. వారి మతంలోనే ఒక మంచి అబ్బాయిని చూసి, అతను ఎలాంటి వాడు.?ఎలాంటి అలవాట్లు ఉన్నాయి.? లాంటి ఎంక్వయిరీ పెద్దమ్మ ఆశీస్సులతో పెళ్లి జరిపించారు. 20 వేల రూపాయలు పెళ్లి ఖర్చుల కోసం, మరో 60 వేల రూపాయలు పుట్టింటి సారె గా కొత్త కాపురం కోసం అవసరం అయ్యే వస్తువులు కొనిచ్చారు.
20 సంవత్సరాల నుండి చెట్టు కింద షాపు:
కర్రి ఏసుబాబు గారు వికలాంగుడు. వారిది ఎక్కడో మారుమూల గ్రామం. సిటీలో అతనికంటూ ఒక చిన్న మెకానిక్ షాపు ఉంది. 20 సంవత్సరాలుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఒక చెట్టు నీడలో బైక్ రిపేర్లు, పంచర్లు చేస్తున్నాడు కాని అతని జీవన చక్రానికి పడ్డ పంచర్ ను ఎవ్వరూ చెయ్యలేదు. 20 సంవత్సరాలలో నలుగురు ఎమ్. ఎల్. ఏ లు, ఎంతో మంది నాయకులను కలిశారు. ఫలితం శూన్యం. ఏ అధికారి కాని చక్రధర్ అక్కడికి వచ్చి 35 వేల రూపాయలతో వారింటి సోదరిడిలా చెయ్యాల్సిన పనులు చేసి పెట్టారు.
తనని వెండితెర మీద కనిపించినప్పుడు అభిమానులు వేసే ఈలలు, కేకల కన్నా వెయ్యి రెట్ల ఆనందం ఇదిగో ఇలాంటి పనులను చేసే అభిమానుల వల్ల హీరోలకు కలుగుతుంది. ఒకరి అభిమాన హీరోలను మరొకరు హేళన చెయ్యడం, విమర్శించడం వల్ల విలువైన సమయం వృధా అవ్వడం తప్పా ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. చక్రధర్ అందరి లానే ఇతర ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకోవడం, విమర్శించడం లాంటివి చేసి ఉంటే చిరంజీవి గారు ఇలా ప్రత్యేకంగా పిలుచుకుని అభినందించేవారా.? కాదు కదా!! ఇదిగో ఇలాంటి పనులు చెయ్యడం వల్లనే అభిమానులకు కూడా అభిమానులు పుడతారు. Their Facebook page : CLICK HERE