Contributed by Yashwanth Aluru
చివరకు మిగిలేది
ఒక మనిషిని కదిలించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. ఆ శక్తి ఇచ్చిన ఉత్తేజం జీవితంలో అనుక్షణం వెన్నంటే ఉంటుంది. ఈ నవలను నా మిత్రుడు 2009లో సిఫార్సు చేశాడు. నేను “చివరకు మిగిలేది” అనే పేరు చూసి ఇదేదో వైరాగ్యపు శిఖరానికి చేరుకున్నాక చదవాల్సినదేమో అనుకున్నాను. రచయిత పేరు “బుచ్చిబాబు” (ఆ పేరు అప్పుడే మొదటిసారి వినడం) అని చూడగానే “శ్రీశ్రీ” అంత బలమైన పేరులా అనిపించకపోవడంతో స్నేహితుడి సిఫార్సుని పూర్తిగా విస్మరించాను. అయితే వాడు మాత్రం తరచుగా దీని గురించి నాతో చర్చించేవాడు. నేను విని ఊరుకునేవాడిని. నేను ఎప్పటికైనా చదవాల్సిందేనని తన వద్ద శిథిలావస్థలో ఉన్న కాపీని 2012లో నాకిచ్చాడు. ఏమైందనడిగితే “ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తులేదు. అందుకే అలా తయారయింది. నాకోసమైనా దీన్ని నువ్వు చదవాలి” అన్నాడు.ఎట్టకేలకు, నేను దాన్ని 2013లో చదవడం ప్రారంభించాను. మొదటి అధ్యాయంలోని అతిశయోక్తి వర్ణనలు నన్ను కూర్చోబెట్టలేకపోయాయి. అప్పుడప్పుడు ఓ పేజీ తిరగేస్తూ ఎలాగో రెండో అధ్యాయానికి చేరుకున్నాను. అదే “అనుభవానికి హద్దుల్లేవు”. దాంతో మొదలు, ఈ పుస్తకం పంచిన అనుభవాలకూ హద్దుల్లేవు. పైపైన అలలను చూసి మోకాళ్ళలోతు మాత్రమే ఉంటుందని భ్రమపడ్డాను మొదట్లో. ఆ అధ్యాయంతో తెలిసింది అదొక మహాసముద్రమని. దాని లోతెంతో తెలుసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. అంతు చిక్కలేదు. చూడాలన్న నా తాపత్రయమూ ఆగలేదు. చదవడం “మెదలుపెట్టడానికి” నాలుగేళ్ళు తీసుకున్న నేను, చదవాలనే ఆసక్తి కలిగాక “వారం”లో పుస్తకాన్ని ముగించాను. అంతలా కట్టిపడేసిన ఈ పుస్తకం అక్కడితో నన్ను వదల్లేదు. చేతులు పుస్తకాన్ని మూసేసినా మనసు మాత్రం నిరంతరం పేజీలను తిరగేస్తూనే ఉండేది. పాత్రలు, వాటి ఔచిత్యాలు, సంభాషణలు, సంఘర్షణలు మనసులో అలజడి సృష్టించేవి.
నా స్నేహితుడిచ్చిన పుస్తకాన్ని వాడికి తిరిగిచ్చేసి కొత్తగా మాయిద్దరికి మరో రెండు కాపీలు కొన్నాను. అప్పటినుండి గుర్తొచ్చినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా ఇదే పుస్తకం చదివేవాడిని. ఆ తరువాత అర్థమైంది నా స్నేహితుడిచ్చిన కాపీ ఎందుకు శిథిలావస్థకు చేరుకుందో!
జీవితానికి అర్థం తెలుసుకోవాలని దయానిధి అనే పాత్ర చేసే ప్రయాణంలో రచయిత చూపించిన జీవితమెంతో ఉంటుంది. దయానిధితో ప్రయాణం మొదలుపెట్టిన పాఠకుడు ఒకానొక సమయంలో తనే దయానిధిగా మారిపోతాడన్నది అతిశయోక్తి కాదు. ఆ గమనంలో తారసపడే పాత్రలెన్నో, అవి మిగిల్చే అనుభవాలెన్నో. ముఖ్యంగా “కోమలి”, “అమృతం”, “రాజభూషణం” పాత్రలు జీవితం పట్ల, మానవ సంబంధాల పట్ల తమకున్న దృక్పథాలతో మనసులో చెరగని ముద్రను వేస్తాయి. వ్యక్తిగత ఆలోచనలకి, సమాజ ధర్మానికి మధ్య జరిగే నిరంతర సంఘర్షణను రచయిత పొందుపరిచిన తీరు అమోఘం.
పాత్రలు, సంభాషణలు ఎంత సహజంగా ఉంటాయో కథనంలో డ్రామా కుడా అంతే ఉంటుంది. దయానిధి తన మాష్టారుని “జీవితానికి అర్థమేమిటి?” అని కథ మొదట్లో అడిగిన ప్రశ్నకు చివర్లో మాష్టారిచ్చే సమాధానం గుండెని పట్టి కుదిపేస్తుంది. అప్పటివరకూ జరిగిన కథనానికి అదనంగా అదిచ్చే “డ్రామాటిక్ హై” అంతా ఇంతా కాదు.
“చివరకు మిగిలేది” అనే పేరుని ఏ ముహూర్తాన అనుకున్నాడో మహానుభావుడు, ఇది చివరకు పుస్తకంలా కాక జీవితంలో మరచిపోలేని, జీవితాన్ని ఎప్పటికీ విడువని ఓ అనుభవంలా మిగిలిపోయింది నాకు. మరో విషయమేమిటంటే, ఈ పుస్తకం చదివిన తరువాత నేను ఐదేళ్ళు మరో పుస్తకాన్ని చదవలేదన్నది వాస్తవం. ఎన్నో పుస్తకాలను చదివిన అనుభవాన్ని, తృప్తిని ఇదొక్కటే ఇచ్చేసింది నాకు. దీని తరువాత చదివే ఏ పుస్తకమైన దీనికంటే గొప్పదైవుండాలనే ఉద్దేశ్యంతో “మహాభారతం”ని చదవడం మొదలుపెట్టాను. అంతలా మనసులోకి చొచ్చుకొనిపోయిందీ పుస్తకం.
రచయితకు పేరులో కన్నా రాతలో బలముండాలన్న కనువిప్పు కలిగించింది. “నీ అభిమాన రచయితెవరు?” అని ఎవరైనా అడిగితే “బుచ్చిబాబు” అని ఎప్పటికీ చెప్పేలా ఈ పుస్తకమే నాతో చివరకు మిగిలేది.
ఈ నవలను ఏ దర్శకుడూ సినిమాగా తీసే ప్రయత్నమెందుకు చేయలేదో తెలియదు. ఇన్నేళ్ళల్లో “అవసరాల శ్రీనివాస్” ఒక్కడే తన “జ్యో అచ్యుతానంద”లో ఈ పుస్తకాన్ని రెఫర్ చేయడమే కాక కథనంలో దానికి ప్రాముఖ్యతను కూడా ఇచ్చినట్టు కనిపించాడు.
బుచ్చిబాబు గారు దర్శకుడు బాపుకి పెదనాన్న. 70ల్లో బాపుగారే “శోభన్ బాబు” హీరోగా దీన్ని తీసుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. ఎంతోమంది రచయితలు, సాహిత్యాభిమానులు ఈ పుస్తకాన్ని తమ అభిమాన పుస్తకంగా చెబుతారు. త్రివిక్రమ్ మాటలోనూ, సీతారామశాస్త్రి పాటలోనూ ఈ పుస్తక ప్రభావం కనిపిస్తుంది. మొన్నామధ్య “త్రివిక్రమ్” ఓ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చదవాల్సిన ఐదు పుస్తకాల్లో ఇదొకటిగా సిఫార్సు చేశారు.
తెలుగు సాహిత్య చరిత్రలో ఎప్పటికీ వన్నె తరగని ఓ వజ్రం “చివరకు మిగిలేది”
రచయిత గురించి... బుచ్చిబాబు గారి అసలు పేరు “శివరాజు వేంకట సుబ్బారావు”. 1916లో ఏలూరులో జన్మించారు. ఎం.ఏ ఇంగ్లీషులో మాస్టర్స్ చేసిన ఈయన అనంతపూరు మరియు విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరరుగా పనిచేశారు. 1945లో “ఆల్ ఇండియా రేడియోలో” చేరి 1967లో ఆయన పరమపదించే వరకూ అక్కడే పనిచేశారు. “చివరకు మిగిలేది” 1946-47లో “నవోదయ” తెలుగు మ్యాగజైనులో సీరియల్లా వచ్చి 1952లో మొదటిసారి పుస్తకంగా ప్రచురింపబడినది. 1957లో “ఆదర్శ గ్రంథ మండలి” ఆధ్వర్యంలో ప్రచురితమై “బెస్ట్ సెల్లర్”గా నిలిచింది. ఇప్పుడు “విశాలాంధ్ర” వారు ప్రచురిస్తున్నారు. ఇవే కాక ఆయన అనేక రేడియో నాటికలు, రంగస్థల నాటకాలు రచించారు. ఆయన రచించిన “ఆత్మ వంచన” అనే నాటకంలో “సావిత్రి” గారు కూడా నటించారు. ఆయన షేక్స్పియరు సాహిత్యం మీద వ్రాసిన “షేక్స్పియరు సాహితీ పరామర్శ” అనే విమర్శకు “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ” అవార్డు వచ్చింది. బుచ్చిబాబు గారు మంచి పెయింటరు కూడా. 1940-60 లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆయన పెయింటింగ్సుండేవట. చివరకు మిగిలేది కాక తప్పక చదవాల్సినది “బుచ్చిబాబు కథలు”. ఇది రెండు సంపుటాల కథల సంకలనం. అందులో “నన్ను గురించి కథ వ్రాయవూ?” అత్యుత్తమమైన కథ.