Contributed by: భరద్వాజ్ గొడవర్తి.
సమయం: '96 సినిమా' మొదలై సుమారు '29 నిమిషాలు' కావొస్తోంది.(2nd Time) సందర్భం: '96 సినిమా' మధ్యలో 'కే.రామచంద్రన్' నేనై అనుకుంటున్న మాటలు! "ఎట్లా మరువగలను ఆ క్షణాన్ని, అక్షరాలుగా నిర్వచించలేని ఆ భావాన్ని, నిశబ్ధపు శబ్ధాలలో, నా కోసం నీ చూపులు రచించి ఆ ప్రేమ కావ్యాలను, నిర్వచించలేని సంతోషాన్ని, కట్టడి చేయలేని నా గుండె తపనని! ఆకాశానైతే బావుండును, ఆ క్షణం నువ్వు పంచిన జ్ఞాపకాల భారాన్ని మోయడానికి" తను: హలో శ్రీవారు, ఏమాలోచిస్తున్నారు? కొంపతీసి మీరు 'కే. రామచంద్రన్' అయిపోయారా? అనుభూతనో, భావోద్వేగమనో ఈ పాటికి రాసేసుండాలే? నేను: కాదు, అంటే ఈ మూవీలో ఒక తెలియని magic ఉంది. "Do you know why this movie is so special"?
"కే.రామచంద్రన్, జాను" మధ్య ఉన్న ప్రేమను, '96' అనే ఒక 'సినిమా కధగా' మనం పరిగణించలేం! ఎందుకంటే, 'కధ' అనే పదానికి ఎప్పుడూ ఒక 'Life Time' ఉంటుంది. ఎక్కడో అక్కడ, ఏదో విధంగా ముగించాల్సిందే. కానీ 'జాను, కే.రామచంద్రన్లకు' ఒకరిపై మరొకరికి ఉన్న ఆ నిస్వార్థమైన ప్రేమకి ఒక ముగింపు అంటూ ఉండదు! ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, కే.రామచంద్రన్ తన ప్రేమని ప్రతి రోజు 'కొత్తగా, నిస్వార్ధంగా, ఒకే emotional consistencyతో'' జానుకు వ్యక్త పరచకలగడం. అది 22ఏళ్ల తరువాతైనా! బహుశ తను 'జానుతో' అలా అన్నేళ్లయినా ఉండడానికి కారణం, తను జానుతో ఉన్న ప్రతి క్షణంలో జీవితానికి సరిపడా ఆనందాన్ని వెతుకోవడమేమో. అలా ఎంత మంది ఉండగలరు?? "ఇలా ఇద్దరం సంభాషిస్తూ ఉండగా, ఈ కథలోనే పక్కనే కూర్చోని ఉన్న మా 'నాన్న', నా మాటలతో సంబంధం లేకుండా ఎక్కడో ఆలోచిస్తున్నారు? నిమిషానికి ఒకసారి ఏదో వెతుకుతున్నారు?" నేను: నాన్న, ఏంటి! తెగ వెతికేస్తున్నారు? నాన్న: లేదు, అమ్మ 'వాచి' ఒకటి కనిపించట్లేదు! ఇందాక ఎందుకో జ్ఞాపకం వచ్చింది! ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాను? నేను: అవునా, ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది నాన్న! తరవాత వెతుకోవచ్చు, ముందు కాసేపు సినిమా చూడండి. నాన్న: లేదు, మీరు సినిమా చూడండి! చివరిసారిగా మరోసారి వెతుకుతా! ఆ వాచ్ అంటే అమ్మకి చాలా ఇష్టం! "నాన్న ఎప్పుడూ అంతే! రెండు గదులు,నాలుగు అరలు, ఉన్న ఇంట్లో 'అమ్మ జ్ఞాపకాలను' రోజు అక్కడే వెతుకుతుంటారు. అదేంటో వెతికిన ప్రతిసారి ఆయనకి ఏదో కొత్త జ్ఞాపకం దొరుకుతూనే ఉంటుంది". "ఇలా, మళ్ళీ ఆలోచనలోకి జారుకున్న నాకు, నాన్న నా వైపు రావడం గమినించాను" నాన్న: వాచ్ దొరకలేదురా, కానీ ఇది చూడు 500 నోటు, అమ్మ దాచుకుంది! ఒక్కప్పుడు నెలసరి సరుకులకిచ్చిన డబ్బులు ఏమైనా మిగిలితే ఇలా ఏ పోపు సామాన్లలోనో దాచుకునేది. నేను: ఏంటీ, అమ్మ దాచుకున్న నోటా, మీకు భలే దొరుకుతాయి నాన్న. కానీ ఇది చెల్లదు కదా ఇప్పుడు. నాన్న: అవును, ఇప్పుడు ఇది చెల్లదు! మీ అమ్మ లేని 'నాలా'!! "అప్పుడు, అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కథలో పాత్రలకి ప్రాణంపొసే పనిలో, జీవితంలో పాత్రలను కథలుగా మర్చిపోతున్నాం అని" "ఇందాక ప్రేమ గురించి అంతగా మాట్లాడుతున్నప్పుడు నాన్న స్పందించకపోడానికి కారణం, తనకి సినిమా మీద ఉన్న చులకనభావం అనుకున్నాను! కానీ ఇప్పుడు అర్ధమయింది ప్రేమ అనే పదం పలకగానే నాన్న అమ్మ జ్ఞాపకాలను వెతకడం మొదలు పెట్టారని" "నాలాంటి వాడికి ఆ 500 నోటు విలువ కేవలం ఒక చెల్లని కాగితం, కానీ ప్రాణంగా చూసుకున్న మనిషి, ఊపిరితో లేనప్పుడు, ఊపిరి లేని ఆ వస్తువులే మన ఊపిరి అవుతాయి" "ఏ ఇద్దరు అయితే ప్రతి క్షణాన్ని అర్ధంచేసుకుంటూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ముందుకు సాగుతారో వాళ్ళ బంధం అంతే గట్టిగా ముందుకు సాగుతూ ఉంటుంది. బహుశ అందుకే కాబోలు అమ్మ తనని వదిలి వెళ్లినా ఇంకా నాన్న అమ్మ వదిలి వెళ్ళిన అనుభూతులను పూర్తిగా అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, అందుకే ఇంకా ఒంటరితనం అంటూ లేని ఎడబాటుని ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉన్నారు." తను: ఇంతకీ మామయ్య, మీ పెళ్లి ఎప్పుడు అయింది నాన్న: 1986 యాధృచికం కాబోలు, 29 నిమిషాల దగ్గర సినిమాను విశ్లేషించడం మొదలుపెట్టాను, ఆ విశ్లేషణలో 29 ఏళ్ళ ప్రయాణం తాలూకు గాఢతను మళ్ళీ తెలుసుకున్నాను.