Here's An Article That'll Clear The Misconceptions & Myths About Baba Saheb Ambedkar!

Updated on
Here's An Article That'll Clear The Misconceptions & Myths About Baba Saheb Ambedkar!

బి ఆర్ అంబేద్కర్ .....సామాజిక మాద్యమాలలో కాని ,కాలేజీలలో లేదా మన పని ప్రదేశాలలో జరిగే చర్చల్లో ఎప్పుడు ఈ పేరు ప్రస్తావనకి వచ్చినా కొంతమంది అంబేద్కర్ పై అయిష్టతని వ్యక్తం చేస్తుంటారు,అంబేద్కర్ పై అగౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు .దానికి వారు చెప్పే కారణం, నేడు ఉన్న రిజర్వేషన్ వ్యవస్థకి ఆయనే కారణం, ఆయన వల్లే ఎంతో మంది ప్రతిభ ఉన్నా ఇక్కడ ఉద్యోగం దొరకని యువత విదేశాలకి తరలిపోతున్నారు. అర్హులకి కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే దేశం నేడు ఇలా ఉన్నది అనేది వారి వాదన. ఇలాంటి ఎంతో మంది అనుమానాలను నివృత్తి చేయడానికి,వారి సందేహాలను పటాపంచలు చేయడానికి,అంబేద్కర్ అంటే కేవలం కుల నాయకుడు అనుకునే వారిని ఆ భ్రమలో నుండి బయటకి తీసుకువచ్చి అంబేద్కర్ గొప్పదనాన్ని తెలిపే ఓ చిన్న ప్రయత్నం ఈ ఆర్టికల్ ..

1.అంబేడ్కర్ వల్లనే రిజర్వేషన్లు – నేటి అసమానతలకి ఆయనే కారణం ?? ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకునే ముందు అసలు రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారో తెలుసుకోవాలి,అంటే 20వ శతాబ్దిలో ఉన్న ఆనాటి కుల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఆనాడు కుల వివక్ష గురించి చెబితే నేటి యువత ఆశ్చర్యానికి గురికాక తప్పదు. తక్కువజాతి అని ఒక కొన్ని కులాలకి ముద్ర వేసి,వారిని ఊరికి దూరంగా వెలివాడల్లో ఉంచి కనీసం మనుషులుగా కూడా చూడని సమాజం ఆరోజుల్లో ఉండేది. వారు అందరితో కలిసి కూర్చోకూడదు,అగ్ర కులాల వారికి ఎదురు నడవకూడదు,చెరువుల్లో నీళ్ళు తాగకూడదు,దేవుని కోవేలలోకి ప్రవేశించకూడదు,అగ్ర కులాల వారు వారిని చూడకుండా ఉండేందుకు రోడ్లపై నడిస్తే వారి మెడకి ఒక గంట వేసుకొని అది కొడుతూ రావాలి వారోస్తున్నారు అని తెలియడానికి,వారి నడుముకు పెద్ద తాటాకు లేదా చీపురు కట్టుకోవాలి,వాళ్ళు నడిచిన దారి శుభ్రం అవ్వడానికి.......ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో .... అంటరానితనం అనేది పతాక స్థాయిలో ఉండేది .అవమానాలతో అన్యాయాలతో నిరాదరణకి ,వివక్షకి గురై సమాజంలో కనీసం మనుషులుగా కూడా గుర్తింపబడలేదు ఎంతో మంది అణగారిన వర్గాల వాళ్ళు. మరి ఇలా వివక్షకి గురైన వారు సమాజంలో సమానులుగా ఎప్పుడు గుర్తింపబడతారు?? వారికి ఎంతో కొంత తోడ్పాటుని అందిస్తే తప్ప అది సాద్యం కాదు.విద్య,ఉద్యోగంతో పాటు రాజ్యాదికారంలో కూడా వారికి తగిన సహకారం అందిస్తే అప్పుడు వాళ్ళు కూడా సమానులుగా భావింపబాడతారు,అందుకు రిజర్వేషన్ అనేది ఒక సాధనం. అందుకే స్వాతంత్రానికి ముందు నుండే వారికి ప్రత్యేక సదుపాయాల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేసారు, గాంధితో సైతం సిద్దాంత పరంగా విభేదించారు.ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కడో కొండ కోనల్లో నివసించే గిరిపుత్రులు సైతం అందరితో కలిసి సమానంగా ఎదిగే అవకాశం కలుగుతుంది. అందరూ సమానులుగా పరిగణింపబడతారు.వ్యవస్థలో వేల్లోనుకుపోయిన కుల వివక్ష నశిస్తుంది,అంటరానితనం అనే దురాచారం దూరం అవుతుంది.సమ సమాజం ఏర్పడుతుంది అనే అత్యున్నతమైన లక్ష్యం తో ఆనాడు రిజర్వేషన్లని ప్రతిపాదించారు. వాటి వల్ల ఎన్నో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నిండాయి....ఇది ఎవరూ కాదనలేని నిజం....

అసమానతలను నిర్మూలించి అందరూ సమానులుగా ఉండే సమాజం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ. కాల క్రమేణా రాజకీయ నాయకులకి ఓటు ని సంపాదించే అస్త్రం లా మారాయి. నేడు అసమానలతకి కారణం అవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇబ్బడి ముబ్బడిగా రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతూ నేడు ఈ స్థితికి తీసుకువచ్చారు...వీళ్ళు చేసిన తప్పుకి అంబేద్కర్ ని నిందించడం ఎంత వరకు సబబు???

2. అంబేడ్కర్ హిందూ అగ్ర కుల వ్యతిరేకి -??? “నేను ఏ కులానికీ వ్యతిరేకం కాదు,కుల వ్యవస్థలో ఉన్న సాంఘిక దురాచారాలకి వ్యతిరేకిని.కుల వివక్షకి వ్యతిరేకిని”. ఇది స్వయంగా అంబేద్కర్ చెప్పిన మాటలు.కులం అనేది పూర్తిగా నశించి అందరం మనుషులము అనే ఒకే భావన ఉండాలని,అలాంటి సమాజమే సమసమజంగా వర్ధిల్లుతుందని అంబేద్కర్ భావన.సామాజిక ఐకమత్యం,సాంఘిక సోదరత్వం ఆయన లక్ష్యం. కుల వ్యవస్థ పూర్తిగా నశించాలంటే సహపంక్తి భోజనాలు,కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఆనాడే ఆయన చెప్పారు .

అంబేద్కర్ కేవలం స్వాతంత్రోద్యమకారుడు మాత్రమే కాదు,సాంఘీకోద్యమకారుడు.సమాజంలో ఉన్న సతీ సహగమనం,బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించాడు,వితంతు వివాహాలను ,స్త్రీ ఉద్యమాలను ప్రోత్సహించాడు.స్త్రీ హక్కుల కోసం పాటు పడ్డాడు. అంబేద్కర్ హిందూ వ్యతిరేకి అనే వాదన ఒకటి ఉంది. వర్ణాశ్రమ ధర్మాలు పేరుతో సమాజాన్ని విడగోడుతూ విచ్చినం చేస్తుందనే కారణంతో ఆయన బహిరంగంగా మనుస్మ్రుతిని దహనం చేసాడు.కులాల పేరుతో హిందూ మతం కొన్ని వర్గాల వారిని అంటరాని వారిగా,పంచములుగా పరిగణిస్తూ వారిని నిరాదరణకి గురి చేస్తుందని అసలు ఏ కులమూ లేని భౌద్ద మతం స్వీకరించారు అంబేద్కర్ మరో నాలుగు లక్షల మందితో కలిసి . ఇక్కడ హిందూ మతంలో జరుగుతున్న వివక్షని ఎండగడుతూ లోపాలను ఎత్తిచూపి వ్యతిరేకించాడే తప్ప ఆయన ఏ కులానికీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు.

3.అంబేద్కర్ కొందరివాడా??? నిజంగానే అంబేద్కర్ కొందరి వాడా?? కాదు ముమ్మాటికీ కాదు. ఆయన తాడిత,పీడిత,బడుగు బలహీన వర్గాల పక్షపాతి ,ఇది నిజమే.వారి కోసమే తన చదువు,జ్ఞానం,జీవితం అంతా ఖర్చు చేసాడు. చివరి శ్వాస వరకు కూడా వారి బాగు కోసమే పాటు పడ్డాడు ..ఇదీ నిజమే....మరి ఆయన కొందరి వాడే కదా?? కాదు....పీడిత వర్గాలు అంటే ఎవరో తెలుసా.....పదేళ్ళకే మెట్టినింట అడుగు పెట్టి,పదిహేనేళ్ళకే వితంతువులుగా మారే బాలికలు,వారి కోసమే హిందూ కోడ్ బిల్ రూపొందించి వారికి మరో జీవితం కల్పించాలని ఆరాటపడ్డాడు....వివక్షకి నిరాదరణకి గురైన కొన్ని కోట్ల మంది బడుగు వర్గాల వారికి సమాజంలో సముచిత స్థానం కలిగేలా చేసారు.....ఒకప్పుడు ఓటు హక్కు కేవలం విద్యావంతులకి, ధనికులకి,జమిన్దారాలకి మాత్రమే ఉండేది. కానీ అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అని సిద్దాంతాన్ని నమ్మినవాడు కాబట్టి పేదా,ధనిక,కుల,మత,ప్రాంత,వర్ణ,వర్గ,భాష,లింగాది భేదాలేవీ లేకుండా అందరికీ సమాన ఓటు హక్కు కల్పించారు.....యావద్ భారతానికి పవిత్ర గ్రంధమైన భారత రాజ్యాంగాన్ని రచించారు....మరి ఇన్ని చేసిన అంబేద్కర్ కొందరివాడెలా అవుతాడు????

4.దేశ ప్రజలకి అంబేద్కర్ బహుమతి – రాజ్యాంగం రేపు మనము ఎలా ఉంటామో మనకి తెలియదు,ఎల్లుండి ఎం జరుగుతుందో మనం ఊహించలేము,కానీ ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం రాసిన ఒక గ్రంధం ఇప్పటికీ ప్రామాణికంగా ఉంది,ఇప్పుడు పుట్టుకొస్తున్న ఎన్నో సమస్యలకి పరిష్కారాలను చూపుతుంది.ఎన్నో చిక్కు ముడులకి జవాబు చెబుతున్నది.ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశ గతిని నిర్దేశిస్తున్నది....అదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం.....ఆరు పదుల వయసులో,ప్రపంచంలోని అన్ని దేశాలా రాజ్యాంగాలను సమగ్రంగా పరిశీలించి, పరిశోధించి మన దేశ రాజకీయ,ఆర్దిక,సామాజిక పరిస్థితులకి సరిపోయేలా ఒక నూతన రాజ్యాంగాన్ని రాయడం మామూలు విషయం కాదు.వర్తమానంలో ఉన్న ఏ సమస్యని అయినా తీసుకోండి దానికి పరిష్కారం రాజ్యాంగంలో ఉంటుంది,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కానివ్వండి,పౌర హక్కులు అవ్వనివ్వండి,నదీ జలాల పంపిణీ కానివ్వండి సమస్య ఎంతటి జటిలమైనది అయినా పరిష్కారం కోసం రాజ్యాంగం చూడాల్సిందే. ఒక్కో అధికరణం ఒక్కో సబ్ – క్లాజ్ లలో వివరంగా విశదీకరించి,సమగ్రంగా రాసిన వైనం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది .....అంబేద్కర్ మన దేశానికి,రాబోయే ఎన్నో తరాలకి అందించిన అతి గొప్ప బహుమతి రాజ్యాంగం ..అందుకే ఆయన్ని Father of Indian Constitution అని అంటారు.

అంబేద్కర్ ప్రపంచ మేధావులలో ఒకరు.ఆయనకున్నని డిగ్రీ పట్టాలు(11 డిగ్రీలు) ఆరోజుల్లో ఎవరికీ లేవు.ఆయన చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదివి ఉండరు.న్యాయశాస్త్ర పారంగతుడు. కుల వ్యవస్థలో కూరుకుపోయి అంధకారంలో మగ్గుతున్నవారికి అంబేద్కర్ ఆశాజ్యోతి.స్వాతంత్రోద్యంతో పాటు సాంఘీకొద్యమాన్ని నడిపిన విప్లవాత్మక సంఘ సంస్కర్త. వ్యవస్తలో భాగమైపోయిన కుల జాడ్యాలను నిర్ద్వందంగా వ్యతిరేకించిన తిరుగుబాటుదారుడు. భారత రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ కేవలం ఒక కుల నాయకుడు కాదు, బాబా సాహెబ్ అంబేద్కర్ విశ్వ మానవుడు .