అప్పుడు దేవసేన గారు జి.హెచ్.ఎమ్.సి కమీషనర్ గా పనిచేస్తున్న రోజులు. రాష్ట్ర రాజధానిలో పది సంవత్సరాలు కూడా నిండని బాలికను అత్యంత కిరాతకంగా మానభంగం చేశారు. ఆ హృదయ విధారకమైన సందర్భంలోనే దేవసేన గారు తనే ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స అందించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు.. ఆరు సంవత్సరాల పాపపై మరో రాక్షసుడు తన పశువాంఛను తీర్చుకున్నాడు. పశువులా చేసిన ఆ దాడి వల్ల అంత చిన్న వయసులోనే ఆ చిట్టితల్లి గర్భసంచిని కూడా తీయాల్సివచ్చింది. పిరికివాళ్ళు కష్టాల వల్ల మరింత భయపెడితే వీరులకు మాత్రం తమలోని మరింత శక్తి విడుదలవుతుంది అన్నట్టు, ఈ రెండు సంఘటనలు తన లక్ష్యానికి ఒక మార్గాన్ని సూచించాయి. ఆ లక్ష్యంలో భాగంగానే జనగామ కలెక్టర్ గారు మహిళలను తమకు తామే రక్షకులుగా ఉండేలా తగిన శిక్షణ అందిస్తున్నారు.
గిన్నీస్ రికార్డ్: పురుషులలో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ఉంటే మహిళలలో రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి లాంటి పోరాటయోధులు ఉన్నారు. మహిళలు ఏ రంగంలోను వెనకడుగు వేయకూడదు అని జనగామ జిల్లాలో ఉన్న 153 గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధునులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందించారు. 13,863 విద్యార్ధునలతో ఇచ్చిన ప్రదర్శన ద్వారా గిన్నీస్ బుక్ లో స్థానం కూడా సాధించారు.
చిన్నప్పటి నుండి.. ఇప్పుడంటే కలెక్టర్ గా అధికారాలు ఉన్నాయని కాదు దేవసేన గారికి చిన్నతనం నుండే ధైర్యం ఎక్కువగా ఉండేది. తన సోదరిని ఎవరైనా ఏమైనా అంటే మిగిలిన వారి సహాయం లేకుండా దేవసేన గారే తెగింపుతో సమస్యను తనదైన శైళిలో పరిష్కరించేవారు. ఒక మహిళకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉంటే మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండగలుగుతారని బహుశా ఆరోజుల్లోనే ఒక నిర్ణయానికి వచ్చారు కాబోలు.
ఓసారి సినిమా టికెట్ కోసం క్యూ లైన్లో నిలబడినప్పుడు స్టూడెంట్ తనతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు. దేవసేన గారు కొంచెం ధీటుగానే బదులిచ్చేశారు. ఆ వ్యక్తి వెంటనే ఏకంగా 40మందిని తీసుకువచ్చి చుట్టు ముట్టారు. ఐనా గాని దేవసేన బెదరక అటుగా వచ్చిన పెట్రోలింగ్ వ్యాన్ పోలీసులకు అప్పగించారు(స్టూడెంట్స్ కెరీర్ కు ఇబ్బంది ఉంటుందని ఆ తర్వాత కేసు పెట్టకుండా వదిలేశారు.) ఇలా మాత్రమే కాదండి దేవసేన గారు జిల్లాలోని ప్రతి ఊరిలో 50,000 సీడ్ బాల్స్ చొప్పున జిల్లా అంతట కోటి సీడ్ బాల్స్ నాటించి ఒక యుద్ధంలా హరితహారంలో పాల్గొన్నారు. ఇలా తను చేస్తున్న ఎన్నో ఘన కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవించింది.