ఒక్కోసారి బాపు గారి మీద అనీర్వచనీయమైన గౌరవంతో అనిపిస్తుంటుంది "బాపు గారికి ముందే తెలుగుతనం అప్పటివారికి తెలిసిందా.? లేదంటే బాపు గారు పుట్టాకా తెలుగుతనం తెలుగువారికి తెలిసిందా" అని.. ఆయన సినిమా తీసినా, బొమ్మలు గీసినా, మరే ఇతర రచనలు చేసినా ఒక బలమైన తెలుగుతనం కనిపిస్తుంది.. నిజానికి బాపు గారు బయట వ్యక్తి కాదు ప్రతి తెలుగువానికి రక్త సంబంధం లేని బంధువు. ఆయన ప్రతి సినిమాలో, బొమ్మలో ఒక వెలుగు నిండిన పండుగ కనిపిస్తుంది అది ఎన్నటికి మరుపురాదు.. అది ఎన్నటికి బోర్ కొట్టదు. బాపు గారి గురించి ప్రత్యేకంగా గొప్పగా వర్ణించనవసరం లేదు, బాపు గారి బొమ్మలా ప్రతి తెలుగువాని మదిలో ఆయన రూపం, పనితనం అందంగా ముద్రపడిపోయింది. బాపు గారు, జంద్యాల గారు ఒక పక్క జీవితాన్ని వివరిస్తూనే అందులో నుండి స్వచ్ఛమైన హాస్యాన్ని చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్న కార్టూన్లలో కూడా డబల్ మీనింగ్ ఉంటుంది కాని ఈ డబల్ మీనింగ్ మాత్రం చాలా శుభ్రంగా ఉంటుంది.