ఒకరోజు ఇద్దరు యువకులు ఒక గురువు దగ్గరికి వచ్చి తమని కూడా శిష్యులుగా స్వీకరించాలని అభ్యర్ధించారు. కాని ఆ గురువు మిగిలిన వారిలా కాదు తన వద్దకు విద్య కోసం వచ్చే వాళ్ళలో ఎవరినిపడితే వారిని తీసుకోరు.. అందుకోసం ఒక ప్రత్యేకమైన పరీక్షను నిర్వహిస్తారు.. ఆ పరీక్షలో నెగ్గినవారిని మాత్రమే శిష్యునిగా స్వీకరిస్తారు. ఆ ఇద్దరి యువకులకు కూడా ఒక పరీక్ష పెట్టారు. వారిద్దరికి ఒక్కో పావురాన్ని ఇచ్చి "వీటిని ఏ ఒక్కరు చూడని ప్రదేశంలో, ఏ ఒక్కరు లేని ప్రదేశానికి తీసుకువెళ్ళి చంపి రండి". అని అన్నారు. అందులో ఒకడు '"ఓస్ ఇంతే కదా అని అనుకున్నాడు", కాని రెండవ వ్యక్తి దీర్ఘంగ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఆ గురువు గారి దగ్గరి నుండి పావురాలు తీసుకున్నారు.. ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు..
అందులో మొదటివాడు వెంటనే తన ఇంటికి చేరుకుని.. ఇంటి వెనక్కి వెళ్ళి చుట్టు పక్కల ఎవ్వరు చూడటం లేదు అని నిశ్చయించుకుని ఆ పావురాన్ని చంపేసి వెంటనే గురువు గారి దగ్గరికి వచ్చి పావురాన్ని ఎవరు లేనప్పుడు, ఎవ్వరూ చూడనప్పుడు చంపేశాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని అన్నాడు. దానికి గురువు గారు.. "కాసేపు వేచి ఉండు నీతో పాటు వచ్చిన ఆ "రెండవ వ్యక్తి" కూడా వచ్చాక ఒక నిర్ణయం తీసుకుంటాను" అని చెప్పారు.
రెండవ వ్యక్తి వెళ్ళిపోయి రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. మూడు సంవత్సరాల తర్వాత ఆ రెండవ వ్యక్తి తిరిగివచ్చాడు. ఒంటరిగా మాత్రం కాదు బ్రతికున్న పావురంతో..
రెండవ వ్యక్తి ఇలా అన్నాడు.. "మీ పావురాన్ని తీసుకోండి.. మీరు పెట్టిన ఈ పరీక్ష దాదాపు అసాధ్యం, కాని ఏదో చిన్న ఆశతో ఒప్పుకున్నా. దీనిని నెరవేర్చడానికి నేను తిరగని ప్రదేశం అంటూ లేదు. కొండలు ఎక్కాను.. దట్టమైన అడవికి వెళ్ళాను.. పాడుబడిన గుహలోనికి వెళ్ళాను.. కాని మీరు పెట్టిన షరతులతో పావురాన్ని చంపడం అసాధ్యం".
గురవు: ఎందుకు అసాధ్యం..? (తనకు ఇంకా స్పష్టమైన సమాధానం రావాలని ఎదురుచూస్తూ)
ఆ వ్యక్తి: పావురం ఒంటరిగా ఉన్నప్పుడు చంపమన్నారు.. నేను ఉండగా అది ఒంటరి ఎలా అవుతుంది?, ఇంకోసారి ఆ పావురానికి మత్తుమందు ఇచ్చి చంపుదామనుకున్నా అనుకున్నట్టే మందు ఇచ్చాను. కత్తి ఎత్తి నరకబోతుండగా నాకు గుర్తొచ్చింది "నన్ను ఎవరు చూడటం లేదనుకున్నా కాని అసలు నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నా.. నన్ను భగవంతుడు చూస్తున్నాడు కదా పావురం కళ్ళు మూసుకున్నంత మాత్రాన భగవంతుడు చూడడం ఆపేస్తాడా ? అనే విషయం గుర్తువచ్చింది. కాని ఈ పరీక్షలో నెగ్గాలి అది కూడా మీరు పెట్టిన షరతులను అమలుపరిచి నిజాయితిగా గెలవాలనుకున్నా.. అందుకోసమే ఈ మూడు సంవత్సరాల పాటు శ్రమించా. నాకు అర్ధం అయ్యింది ఎవ్వరు చూడకుండా ఎవ్వరులేని ప్రదేశంలో దీనిని చంపడం అసాధ్యం అని.. నేను ఓడిపోయాను, మీ పావురాన్ని స్వీకరించండి". అని అన్నాడు.
ఆ గురువు ఆనందంతో చెమర్చిన కళ్ళతో ఆ వ్యక్తిని తన గుండెలకు హత్తుకుని "నువ్వు ఓడిపోలేదు నాయన గెలిచావు నేను ఏ గెలుపు కోసం ఎదురుచూస్తున్నానో ఆ గెలుపును నువ్వు చేరుకున్నావు ఇక నుండి నువ్వే నా శిష్యుడివి నీకు సకల విద్యలు నేర్పిస్తాను అని భుజం తట్టాడు.
ఓషో వర్ణించిన ఈ కథలో ఒక గొప్ప నీతి దాగి ఉందండి. కొంతమంది ఉంటారు.. ఎన్నో తప్పులు చేస్తుంటారు.. ఎంతోమందిని నమ్మించి మోసం చేస్తుంటారు. గవర్నమెంట్ కు సరిగ్గా పన్ను కట్టకుండా డబ్బు దాచుకుని ఆ పాపం పరిహారానికి హుండిలో డబ్బులు సమర్పించుకుంటారు.. భగవంతుడు కూడా వీళ్ళలాగే లంచగొండి అనుకుంటున్నారా? లేదంటే డబ్బులిస్తే ఇక్కడ ఏ పని ఐన జరిగినట్టే హుండిలో చిల్లరవేసి దేవుడిని కూడా కొందామని అనుకుంటున్నారా..? అది అసాధ్యం.. నీటిలో ఉన్న చేపకు నీరు కనపడదు, చుట్టు గాలితో ఉన్న మనకు గాలి కనపడదు, అలాగే భగవంతునిలో ఉన్న మనకు భగవంతుడు భౌతికంగా కనపడడు. అంతమాత్రం చేత భగవంతుడు చూడడం లేదనుకోవడం అవివేకం.