అశోకవనం అంటే శోకమే లేనటువంటి ప్రాంతం. ఆ ప్రదేశంలో సీత తీరని దు:ఖంతో తొలగని వేదనతో కృంగిపోతున్నది. మాయచేసి సీతను అపహరించిన రావణుడు చివరికి తనదైన పద్దతిలో సీతను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒకానొక సమయంలో.
రావణుడు: సీతా.. నువ్వున్నది మామూలు చోటు కాదు బహుశా ఇలాంటి ప్రదేశాన్ని అయోద్యలోను చూసి ఉండవు. బంగారు, వెండి, రత్నాలతో నిర్మింపబడిన సుందర సామ్రాజ్యం నాది. జలతారులు, పాన్పులు, విలాసగృహాలు, క్రీడా గిరి, వినోద గృహాలు, భేరి మృదంగాలు, శంఖ ధ్వనులతో విశ్వకర్మ సైతం విస్మయానికి గురిచేసే మహా సముద్రంలాంటి సామ్రాజ్యంలో ఉన్నావు.
అదిగో చూడు ఆ సూర్యుడిని నా రాజ్యంలోనే మేరు పర్వత కాంతులతో స్వర్ణ భాస్కరుడిగా దర్శనమిస్తాడు. ఇదిగో చూడు వేలమంది సుందరీమనులు వివాహితులు నా ఛాతి దమ్ము చూసి, నా వీరత్వానికి పరవశించి వచ్చిన అప్సరసలు.. ఇదిగో ఇటు చూడు జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయుడు, ధూమ్రాక్ష, సంపాతి, విద్యుద్రూప, విఘన, యుద్దోన్మత్త, మదోన్మత్త, ద్వజగ్రీవుడు మొదలైన భయంకర రాక్షసులు నిత్యం నా ఆజ్ఞ కోసం తపిస్తూ ఉంటారు. మహాబలులు, దీర్ఘకాయులు, మధపు శ్వేత ఐరావతాలు నా సైన్యంలో భాగం.. తమ భుజ బలం ముందు సాటిరాగల వారు ఇక ఎవరూ లేరే అని చింతించే యోధులు, పాముల వలె బుసలు కొట్టే విరాధి వీరులను చూడు. ఇదిగో ఇదే నా పుష్పక విమానం నీవు ఎప్పుడు తిలకించని స్వర్ణ వృక్షాలను చూడు.. నువ్వు ఒక్కసారి "ఊ" అను ఇవన్నీ నీ సొంతమవుతాయి..
ఇక నా బలం గురించి చెప్పమంటవా.. "జనులు నిత్యం భయపడుతూ మొక్కే నవగ్రహాలు నాకు బానిసలు, నా సేవకులు. వందల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప దర్శనమివ్వని శివుడు నా పేగులతో రుద్రవీణ వాయిస్తే ప్రత్యక్షమవుతాడు. అష్టదిక్పాలురు, దేవేంద్రాదులు నా చేతుల్లో ఉండేవాళ్ళు. నన్ను కాదని సూర్యచంద్రులు లంకలో అస్తమించరు. దేవాసురులు, ఇంద్రా అంటే చేతులు కట్టుకుని పరిగెత్తుకుంటు వస్తాడు. ఇందరిని ప్రియురాండ్రలను వెనక్కినెట్టి నీకై తపిస్తున్నాను సీతా అర్ధం చేసుకో.. వలపు ఒలికిస్తున్న ఇందరి అంతపుర స్త్రీలు నీ పాద దాసులవుతారు. నువ్వు "ఊ" అంటే ఈ సామ్రాజ్యం నీదవుతుంది. సకల ప్రాణావళి, దేవతలు సైతం భయపడే ఈ వీర రావణుడు నీకు సొంతమవుతాడు. వలచి వచ్చినప్పుడే ఆనందం.. అంతేకాని అంతేకాని అత్యాచారం చేయను. ఇంకా ఆ రాముడి గురించే ఆలోచిస్తున్నావా.? రాముడు ఎందులోను నాకు సాటిరాడు. వాడు ఒట్టి అమాయకుడు, నీ జాడ ఇప్పటికి తెలియక ఒకవేళ తెలిసినా నాపై యుద్ధం చేసే దమ్ము లేక ఎక్కడో తిరుగుతుంటాడు అడవిలో ఏ సింహమో వాడిని తినేసి ఉంటుంది లేదంటే వాడే ఆత్మహత్య చేసుకుని చచ్చుంటాడు. సీతా.!! ఇప్పటికే పది నెలలు గడిచిపోయాయి. మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నది. ఈలోపు నిన్ను నువ్వు మార్చుకుని నా కౌగిలిలో ఒదిగిపో లేదంటే ఉదయం ఉపాహారంలో నిన్ను నంజుకు తింటా.!!!
రావణుడి వదరు మాటలకు సీత కోపం చెలరేగింది. రావణుడు అంతలా వదరిన మాటలకు సమాదానం ఇవ్వాలని పరాయి మగవానితో సరాసరి మాట్లాడడం ధర్మం కాదని "ఒక గడ్డి పరకను తీసుకుని దానిని చూస్తు హెచ్చరించడం మొదలుపెట్టింది".
"గడ్డి పరకతో నువ్వు సమానమురా" నీ భార్యలపై ఎవరైనా కన్ను వేస్తే సహించగలవా.? నా రాముడు లేని సమయాన దొంగతనంగా తీసుకువచ్చిన నీవు అసలు వీరుడవే కాదు. మహా శివభక్తుడివి, పండితుడివి అయిన నీవు నన్ను తీసుకువచ్చి ఘోర పాపం ముటగట్టుకున్నావు. రాజు తప్పు చేస్తే ఆ రాజు మాత్రమే కాదు ప్రజలు నాశనమవుతారు. ఈ దారుణానికి నువ్వే కారణం అవుతావా.!!
నా రాముడు శీల గుణ సంపన్నుడు, మూర్తీ భవించిన మానవతావాది, క్షమాణుణ సంపన్నుడు, కరుణ హృదయుడు. నన్ను వెంటనే రామునికి అర్ఫించు ఆ క్షమా హృదయుడు నిన్ను కరుణిస్తాడు. నీ శక్తి నిర్వీర్యం, లంక నాశనం జరగదు. కాదంటే రాముడు ఇక్కడికి రానవసరం లేదు అక్కడ వేసిన బాణమే అగ్నిగా మారి మిమ్మల్ని భస్మీ పటలం చేస్తుంది. బ్రహ్మాది దేవతలే శ్రీరామ రక్ష అని ప్రార్ధిస్తారు. రామ బాణం నుండి ఈ పదునాలుగు లోకాలలో నిన్ను రక్షించేవారుండరు సత్యం తెలుసుకో. రావాణా నిన్ను రక్షించే వారు కాదు కదా ఓదర్చే వారు కూడా మిగలరు.
కుక్క దూరం నుండి రెండు పులులను చూస్తుంది కాని దాని దగ్గరికి వెళ్ళలేదు. అలాగే నీవు కూడా పురుష సింహాలైన రామ లక్ష్మణులకు ఎదురు నిలవలేవు. రామ లక్ష్మణులు బాణం విడిచారో లంకలో బుడిద తప్ప ఇంకేమి మిగలదు. గరుత్మంతుడు పాములను పసిగట్టి చంపినట్టు శ్రీరామ లక్ష్మణుల బాణాలు నిన్ను నీ రాక్షసులను వెదికి వెదికి మరి చంపుతాయి.. సూర్యకాంతి వేడి కొంత నీటిని ఇంకించగలదేమే కాని సముద్రాన్ని కాదు, నీ ఈ కొద్దిపాటి చర్యను విజయమనుకోకు సత్యం తెలుసుకో.. అంటూ సీత గడ్డి పరకను పడేసింది.
ఊహించన ఈ పరిణామానికి దిగ్ర్బాంతికి లోనయిన రావణుడు మదిలో అవమాన భారంతో సీతపై, అక్కడి సైనికులపై భయంతో బెదిరించి అక్కడి నుండి నెమ్మదిగా వెనుదిరిగాడు..
(సోర్స్: వాల్మీకి రామాయణం)