కేసీఆర్ గారికి తెలుగు పద్యాలన్నా, తెలుగు సాహిత్యమన్నా మమకారం ఎక్కువ. చిన్నతనంలోనే తనలోని టాలెంట్ ను పరిచయం చేసింది కూడా పద్యాలే. ఒకరోజు క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థులు పద్యం చదవడానికే ఇబ్బందిపడుతుంటే కేసీఆర్ గారు కేవలం ఒక్కసారి విని చూడకుండా చెప్పారు. టీచర్ షాక్ అయ్యి నువ్వు పెద్దగయ్యాక గొప్పోడివి అవుతావని అభినందించారట. కేసీఆర్ మనసును తాకేది ఇద్దరు మనుషులు. ఒకరు ఆపదలో ఉన్న వ్యక్తి ఐతే, మరొకరు తెలుగు కవిత్వాన్ని రాసే కవి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిపై మనం యుద్ధం చెయ్యాలి, అది గుంపులు గుంపులుగా కాదు, సమిష్టగా ఒంటరిగా పోరాటం చేయాలని అయినంపూడి శ్రీలక్ష్మి గారు భారతీయులకు దిశ నిర్ధేశం చేశారు. ఈ కవిత కేసీఆర్ గారికి మాత్రమే కాదు చదివిన ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపగలిగేంతటి శక్తి ఉంది.
శ్రీలక్ష్మి గారు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. యాంకర్ గా, ఈవెంట్ ఆర్గనైజర్ గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా ముందుగా చెప్పినట్టు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, అలాగే రచయిత్రి గా ఉన్నత స్థానంలో ఉన్నారు.
శ్రీలక్ష్మి గారు రాసిన స్ఫూర్తి నింపే కవిత: ఇప్పుడిక క్వారెంటైనే మన వాలంటైన్..! ‘కరోనా’కి ఓ రిటర్న్ గిఫ్ట్!
ఏమైందిప్పుడు.. క్షణాలు మాత్రమే కల్లోలితం ఆత్మస్థయిర్యాలు కాదు కదా సమూహాలు మాత్రమే సంక్షోభితం సాయం చేసే గుండెలు కాదు కదా..! ఎన్ని చూడలేదు మనం
కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు ప్లేగును జయించిన దరహాసంతోనే కదా చార్మినార్‌ను నిర్మించుకున్నాం..! గతమెప్పుడూ విజయాల్నే గుర్తుచేస్తుంది వర్తమానమెప్పుడూ సవాళ్ళనే చూపిస్తుంది భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది
కుంగుబాటు తాత్కాలికమే యుద్ధభూమిలోకి దిగాక వెనక్కు తిరగటం, వెన్నుచూపటం మనకు తెలియదు యుద్ధం ఏ రూపంలో వస్తేనేం మిస్సైల్ అయినా-వైరస్ అయినా పెద్ద తేడా ఏం వుంటుంది కనుక..! నీకు బాగా తెలుసు- జీవన వాంఛాజనితం మన దేహం ఎన్నిమార్లు యుద్ధ ప్రసవాలు చూడలేదు ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు! కరోనా పాజిటివ్ అయితే ఏంటట పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక సామాజిక దూరం మన అస్త్రమయ్యాక
జనతా కర్ఫ్యూ మన కవచమయ్యాక ఇప్పుడిక క్వారెంటైనే మన వాలంటైన్..! ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా? క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు దొంగతనంగా ప్రవేశించిన కరోనాకు కరుణ తెలియదు క్యా కరోగే.. అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో
పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం మన కలాల్ని కరవాలాలుగా మార్చి కవి సిపాయిలుగా మారుదాం నిరస్త్రగా-క్షతగాత్రులుగా మిగలకుండా రథ, గజ, తురగ పరివారాలతో పని లేకుండా ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా ప్రతియుద్ధం ప్రకటిద్దాం దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది... ఆత్మస్థెర్యంతో ఎదిరిద్దాం కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం ఎన్నో యుద్ధాలను చూసాం... కానీ ఇది ఎంతో ప్రత్యేకం గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక పోరాటం చేయాలి ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి సైనికుడు కదా ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల రక్షణ వలయం అల్లుదాం రండి కబళించాలని చూసే కరోనాను మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి ఐసోలేషన్ వ్యూహంతో.. ‘నమస్తే’ మంత్రంతో.. రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రండి..!