ఒక మనిషి ఇంత ధర్మాంగా జీవించగలడా?.. అనే ప్రశ్న కు దేవుడే మనిషిలా జన్మించి సమాధానం చెప్పాడు. ఆయనే శ్రీరాముడు. నరులు వానరులు తననేమి చేయలేరు అనే గర్వం తో.. రావణుడు "నర వానరులు" వల్ల తప్ప ఇంకెవరి వల్ల తనకు చావు రాకూడదని కోరుకున్నాడు. రావణుడు గర్వాన్ని, మనిషి అనుకుంటే ఏదైనా సాధించచ్చు అనే తత్త్వాన్ని చెప్పడానికి మనిషయ్యాడు దేవుడు. మనలో ఒకడిలా పుట్టి నాయకుడు లా ఎదిగి దేవుడిలా మారాడు శ్రీరాముడు.
ఇప్పుడున్న ప్రపంచం, రాముడిని దేవుడిలా పూజించడం కన్నా ఒక నాయకుడిలా భావించి అనుసరించాల్సిన అవసరం చాలా ఉంది. మనలో ఉన్న నాయకుడు, రాముడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్ని ...
1. వినయం: తన తండ్రి దశరథుడు పిలిచి రాజు ని చేస్తా అన్నప్పుడు ఎంత వినయంగా ఒప్పుకున్నాడో.. అడివి కి వెళ్ళమన్న అంతే వినయం తో ఆ మాటని పాటించాడు. పెద్దల పట్ల వినయం వాళ్ళ మాటకి విలువ ఇస్తే.., ముళ్ళ బాటైన పూల బాటవుతుంది. అడివికి వెళ్లకుంటే రావణ సంహారం చేసేవాడా..? లోక కళ్యాణం కావించేవాడా?

2. విధేయత: విశ్వామిత్రుడు యాగాన్ని, రాక్షసుల బారి నుండి రక్షించమని దశరథుడు, రామలక్ష్మణులని పంపిస్తాడు . ప్రయాణం లో విశ్వామిత్రుడు చెప్పిన ప్రతి ఒక్క పనిని విధేయత తో పాటిస్తారు రామ లక్ష్మణులు. రాజా భోగం అనుభవించే వాళ్లు కటిక నేల పై పడుకుంటారు. ఈ విధేయత కి సంతోషించే విశ్వామిత్రుడు ఎన్నో అస్త్ర శస్త్ర విద్యలని వాళ్లకి నేర్పించాడు.

3. నిబద్ధత: తను ఇచ్చిన మాటమీద నిలబడగలడం నిబద్దత అంటారు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం వాలి ని సంహరించాడు. విభీషణుడుకి ఇచ్చిన మాట ప్రకారం రావణుడి తమ్ముడైన అతన్ని కాపాడాడు. కళ్యాణం జరిగేటప్పుడు సీతమ్మ కి ఇచ్చిన మాట ప్రకరాం తనని కాపాడటానికి ఒక యుద్ధమే చేసాడు. తన మాటపై తన నిబద్ధత అది.

4. జవాబుదారీతనం రాజైన, ఉద్యోగైనా, జవాబుదారితనం ఉండాలి. చాకలివాడు చెప్పినందుకు సీతమ్మ ని తిరిగి అడివికి పంపించాడు శ్రీరాముడు అనే విషయం లో చాలా మందికి చాలా భావాలు ఉండచ్చు. కానీ అసలైన కారణం జవాబుదారీతనం. రాజుగా తన రాజ్య ప్రజల మాటలే వాళ్ళ భావాలే తన శాసనాలు., కాబట్టి సీతమ్మ ని అడివికి పంపించి జీవితాంతం బాధపడటానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు.

5. సానుకూలత రాముడి ముఖం లో ఎప్పుడు ఒక సానుకూల దృక్పధం(positive attitude) ఉంటుంది.. అది ఉంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఒక నాయకుడు తన కింద పనిచేసేవాళ్ళతో ఎంత సానుకూలంగా ఉంటే వాళ్ళు అంత ఇష్టంతో పని చేయగలరు. ప్రజలకు నచ్చని నాయకుడు, నాయకుడు ఎలా అవుతాడు.

6. సమర్ధత అందరిని ముందుండి నడిపించాలంటే ముందు మనలో సామర్ధ్యం ఉండాలి. తన అనుచరుల బలాన్ని సరిగ్గా వాడుకునే సమర్ధత ఉంది కాబట్టే నర వానరులని సైన్యంగా చేస్కుని రావణుడిని జయించాడు. నరులు వానరులు ఏమి చేయలేరు అనే రావణుడిని గర్వాన్ని అణిచివేశాడు.



