నా పేరు ప్రతాప్ కుమార్. ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతఉద్యోగిని. చాల కష్టపడి,రెండేళ్లపాటు ఇంటికిదూరం గా ఉండి మరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి, ప్రజలకి నాకు వీలనైంతవరకు సేవ చేయొచ్చు అనే కారణం తో నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను,పరీక్షలకి ఎంత నిజాయితో చదివానో అంతే నిజాయితో ఉద్యోగం లో కూడా ఉంటె నేను చేయదలచుకున్నది సాధించొచ్చు అనే నమ్మకం తో ఉద్యోగం లో చేరాను,మొదటి సంవత్సరం బానే గడిచింది,అసలే కొత్త,,పైగా ఎదో చేయాలనే ఆరాటం,ఉడుకు రక్తం,దూకుడు స్వభావం. అలసత్వాన్ని,అవినీతిని అసలు ఉపేక్షించలేదు. కానీ నాకు తత్త్వం భోదపడడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
నా కింది స్థాయి ఉద్యోగుల నుండి,నా పై అధికారుల దాకా చాల మంది అవినీతి కి అలవాటు పడిపోయిఉన్నారు.వాళ్ళని మార్చాలని చూసారు ,నన్ను అమాయకుడిని చూసినట్టు చూసారు,నేను వాళ్ళలా మారకూడదు అని మడికట్టుకొని కూర్చున్నాను, నేనో వెర్రివాడ్ని అన్నట్టు చూసారు. వీళ్లందరినీ దాటుకొని నేను ముందుకి వెళ్ళలేను,వీళ్లందరినీ తట్టుకొని నిజాయితీగా నిలబడడం కూడా కుదరలేదు క్రమంగా ఒక ఛట్రం లో ఇరుక్కుపోయాను,బయటకి రాలేని ఇరుకు సందుల్లో నలిగిపోతున్నాను, సావాసదోషం కావొచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం కావొచ్చు,నేను కూడా అవినీతి కి అలవాటు పడ్డాను,నేను చేసేది తప్పు అని మొదట్లో అనిపించేది,తప్పక చేస్తున్నాను అని నన్ను నేను సమర్దిన్చుకునేవాడ్ని.
నాకు ముట్టజెప్పాల్సింది నాకిస్తే ముందువెనక చూడకుండా అనుమతులు ఇచ్చేవాడ్ని, అన్నీ ఉన్నా అసలు విషయం లేకపోతే అది ఎంత పెద్ద పని అయినా ఫైల్ పెండింగ్ లోకి పెట్టేవాడిని,నాకు తెలీకుండానే నేను మారిపోయాను,ఆ విషయం కూడా తెలుసుకోలేనంతగా నన్ను కమ్మేసింది ఆ పొర.
నా జీతం కంటే నా అక్రమ సంపాదనే పదింతలు ఉండేది, అంతగా pollute అయ్యాను ఇలా ఉండగా ఒక రోజు,నా పై అధికారి ఇంటికి సి.బి.ఐ. వాళ్ళు సోదాలకి వచ్చారు,కొన్ని కోట్లలో నగదు,బంగారం,ఆస్తులు జప్తు చేసారు,ఆయన్ని అరెస్ట్ చేసారు,ఆయన కుటుంబం ఒక్క దెబ్బతో నడిరోడ్డుమీదకి వచ్చింది,ఆయన్ని విచారణ తర్వాత జైలు కి తీసుకెళ్లారు,ఆయన్ని కలుద్దాం అని నేను జైలుకి బయలుదేరుతుంటే నా ఫోన్ మోగింది,"సుధీర్ గారు జైలు కో ఆత్మహత్య చేసుకున్నారు"అన్నది ఆ ఫోన్ సంభాషణ సారాంశం. బంధువులు పెద్దగా ఎవరు రాలేదు,ఆయన తోటి ఉద్యోగులం ఒక నాలుగురైదుగురం ఉన్నాం,దహనసంస్కారాలు జరిగాక,ఇంటికి వెళ్లి డాబా పైన కూర్చొని ఆలోచనా లోయలోకి వెళ్ళిపోయాను.
సుధీర్ గారి ఆత్మహత్య నాలో ఆత్మనూన్యతా భావాన్ని పెంచింది,కోట్లు సంపాదించినా,కాటికి మోసుకురావడానికి నలుగురు కూడా కరువయ్యారు. కుటుంబానికి ఓదార్పు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు,అవినీతిపరుడు,లంచగొండి,లాంటి బిరుదులు మిగిలాయి ఆయనకి, కొంచెం లోతుగా ఆలోచిస్తే సుధీర్ గారు,నేను ఒకటే,ఇద్దరికీ పెద్దగా తేడా ఏమి లేదు. ఎన్నో గొప్ప లక్ష్యాలతో ఉద్యోగంలో చేరిన నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అని చూసుకుంటే నామీద నాకే అసహ్యమేసింది,ఇన్నేళ్లు నేను వినిపించుకొని నా అంతరాత్మ మాటలు నన్ను నిందిస్తున్నాయి. ఇది స్మశాన వైరాగ్యం కాదని నాకు అర్ధం అయ్యింది,సుధీర్ గారి చితిమంటలతో నన్ను కమ్మేసిన చీకట్లు తొలగిపోయాయి, ఆ అవినీతి అనే అగాదం నుండి బయటకి రమ్మని ఇచ్చిన సంకేతం లా అనిపించింది,ఇన్నేళ్లు మారిన మనిషిలా ఉన్నాను.
ఇప్పుడు నాకు మనిషిగా మారే అవకాశం వచ్చింది అని అర్ధం అయ్యింది, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను .నా అక్రమాస్తులు,వాటి వివరాలు అన్నీ తీసుకొని,కారులో అవినీతి నిరోధక శాఖ ఆఫీస్ కి బయలుదేరాను,వాళ్ళ ముందు నా అవినీతి ని ఒప్పుకున్నాను,కోర్టులో విచారణ మొదలయ్యింది,నా అక్రమాస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చాను, నా ఉద్యోగానికి రాజీనామా కూడా ఇచ్చాను,నా తప్పులని ఒప్పుకున్నాను,మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది నాకు,నాకేమి భాద కలగలేదు,ఎప్పుడు ఎదో భయాలు,టెన్షన్ తో ఉండే నా మొహం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది,కొండంత బరువు తల మీద నుండి దిగినంత తేలికగా ఉంది రెండంతస్తుల బంగళాలో ఉన్న నాకెప్పుడూ సరిగా నిద్రపట్టలేదు,జైలు లో మాత్రం హాయిగా నిద్రపట్టింది,నేను మారడానికి,మళ్ళి నేను నేను గా బ్రతకడానికి జైలు లో ఉన్న మూడేళ్లు నాకెంతో విలువైన సమయం,జైలులో ఉంటూనే Administration in Governance లో Ph.D చేశాను,విడుదలయ్యాక నాకున్న పాత మిత్రులతో కలిసి ఒక కోచింగ్ సెంటర్ మొదలెట్టాలనుకుంటున్నాను,ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే దానితో పాటు,ఉద్యోగంలో నిజాయితితో ఎలా ముందుకెళ్లాలి అనేది కూడా ఒక పాఠ్యఅంశంగా దించాలనుకుంటున్నాను.
నిజాయితీ గురించి చెప్పే అర్హత నాకు ఉందొ లేదో తెలీదు కానో,అవినీతిపరుడైతే జీవితం ఎంత నరకమో చెప్పడానికి అనుభవం ఉంది,రేపు ఉదయం నేను విడుదల కాబోతున్నాను,నన్ను నేను మళ్ళి కలుసుకోబోతున్నాను.