మన శ్రీశ్రీ గారు ఒకమాట అన్నారు 'అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కదేది కవితకు అనర్హం..' ఒక కవితకు ప్రతి పదం అవసరమే అన్నట్టు మన అవసరానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఉపయోగకరమే. అదే ఉద్దేశంతో వెదురుతో పాటు, పాడైపోయిన కారు లారీ టైర్లు ఇతర పనికిరాని వస్తువులతో మన ఇంటికి అవసరమయ్యో ఎన్నో వస్తువులను తయారుచేస్తూ ఒక కొత్తరకమైన ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు మన హైదరాబాద్ కు చెందిన అరుణ ప్రశాంత్ దంపతులు. ఉపాధి అంటే ఇక్కడేమి తమ ఉపాధి కోసం మాత్రమే కాదు, గిరిజనుల చేతి వృత్తులలో ఒకటైన వెదురు వస్తువులకు ఆదరణ, వారికి ఉపాధి కల్పించడం కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం.


2006 లో ప్రశాంత్ అరుణల వివాహం జరిగింది. హైదరాబాద్ లో ఒక మంచి ఇంటిని నిర్మించాలనుకున్నారు. ఇంటి ఫర్నిచర్ మిగితావారి కన్నా ప్రత్యేకంగా ఉండలనుకున్నారు. ఇందుకోసం వెదురుతో చేసిన ఇంటి వస్తువుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా కూడా వారు ఆశించిన వస్తువులు దొరకలేదు. బాగా వెతకగా.. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో వెదురుతో ఫర్నీచర్ చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి కళ ప్రతిభను చూసి ఆశ్ఛర్యానికి లోనయ్యారు. కాని ఇంతటి ప్రతిభ దాగున్న గిరిజనులు ఈ పనిపై అంతగా ఆసక్తి చూపకుండా నగరంలో వలస కూలీలుగా మారిపోయారు. ఇందుకు కారణం వెదురుకు అంత ఆదరణ భారత్ లో లేకపోవడమే. మార్కెటింగ్ సరిగ్గా చెస్తే వెదురు వస్తువులకు మరింత డిమాండ్ పెరుగుతుంది.. తద్వారా గిరిజనులకు మాత్రమే కాకుండా వారికి ఒక కొత్తరకమైన ఉపాధి దొరుకుతుంది అని వెదురు గృహోపకరణాలను తయారుచేయడం మొదలుపెట్టారు.


"చిన్నప్పుడు అడుగులు నేర్చుకునేటప్పుడు కింద పడుతూ లేస్తాం అలాగే ఏ కొత్త పనిచేసినా తడబాటు సహజమే". ఈ వ్యాపారం ప్రారంభించినప్పుడు మొదట కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా వాటికి సరైన పరిష్కారాలును కనుగొని ఇప్పుడు దేశంలోనే మంచి సంస్థగా (bamboohouseindia) గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట ఏ రకమైన వెదురు మేలైనది దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఢిల్లీ ఐఐటి, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారి సహకారంతో సంపూర్ణ అవగాహన చేసుకున్నారు. వెదురు కళలో ఆరితేరిన మన ఆదిలాబాద్ గిరజనులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వారు నేర్చుకున్న దానికన్నా మరింత ఎక్కువగా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.



వీరు చేసిన వాటిలో అత్యత్తమ మైనది "బ్యాంబూ స్టిక్స్ తో ఇంటిని నిర్మించడం". మిగిలిన వాటికన్నా ఈ ఇల్లు ఆరోగ్యానికి మంచిదంటారు. ఈ వెదురు కర్రలు ఎక్కువ శాతం ఆక్సిజన్ ఇస్తుంది. వేసవిలో కూడా చల్లగా ఉండటమే కాక కళాత్మకంగా ప్రత్యేకంగా ఉంటుంది. వెదురుతో నిర్మించిన ఇళ్ళు దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఉంటుందనంటారు(పెంట్ హౌస్ లుగా ఇవ్వి చాలా బాగుంటాయి). ఇలాంటి ఇళ్ళు ఇప్పటివరకు 100కు పైగా నిర్మించారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇంటిని నిర్మిస్తారు. కేవలం ఉపాధి మాత్రమే కాకుండా మన స్వదేశి కళలకు ఆదరణ కల్పించడం నిజంగా అభినందనీయం.




Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.