మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనకు అండగా నిలబడే వాడే నిజమైన స్నేహితుడు. హరీష్ నాగరాజ్ ఒక డైరెక్టర్, కథ రచయిత, డైలాగ్ రైటర్, ఇప్పటికి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యాడ్స్, కవర్ సాంగ్స్ వీడియోస్ ఇలా అన్ని కలుపుకుని యూట్యూబ్ లో ఆయన డైరెక్ట్ చేసినవి 200 వీడియోల వరకు ఉన్నాయి. మూడు సంవత్సరాల క్రితం ఒక సినిమా ప్రారంభమవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలోను కొన్నిరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడే కొంతమంది స్నేహితులు అతని జీవితంలోకి వచ్చాయి. హరీష్ నుండి ఆ స్నేహితులు ఏమీ ఆశించలేదు, మిగిలిన వ్యక్తులుల వారు జడ్జ్ చెయ్యలేదు. వారి చూపు చాలా స్వచ్ఛంగా ఉండేది, ప్రవర్తించే విధానం కూడా.. కట్ చేస్తే హరీష్ ప్రపంచాన్ని చూసే దృష్టి కోణమే మారిపోయింది, ఒక ఆశతో బ్రతికే మనకి, ఎదో ఒక రూపంలో అదే ఆశ మనల్ని బ్రతికిస్తుంది అనే గొప్ప జీవిత సత్యాన్ని ఆ స్నేహితుల ద్వారా తెలిసింది, ఆ స్నేహితులెవరో కాదండి 'ఆవులు'.
శివుడి దేవాలయం ముందు: హరీష్ శివ భక్తులు, సాటి ప్రాణిలోనూ దైవాన్ని చూడగలరు. ఇలా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో శాంతి కొరకు హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ శివాలయానికి వెళ్లేవారు. సోమవారం శివుని దర్శనం చేసుకుని బయటకు రాగానే ఒక ఆవు కనిపించింది, ఆ ఆవు కూడా హరీష్ నే తీక్షణంగా చూస్తుంది. వర్ణించలేనటువంటి సన్నివేశం అది, ఏదో శక్తి, బలమైన పాజిటివ్ వైబ్స్, జ్ఞానులకు తప్ప సామాన్యులకు అర్ధం కాలేని ఆలోచనలు హరీష్ లో జన్మించాయి. వెంటనే కొన్ని పండ్లు దానికి పెట్టాడు. ఇలా ఒక్కరోజు కాదు వెళ్లిన ప్రతిసారి చేసేవారు. ఆ ఆవు బాధ్యతలు చూసుకుంటున్న కాపరి మరొక ఆవును కొనివ్వమని అడిగారు, రూ.10,000 పెట్టి మరొక ఆవును కొని ఆ కాపరికిచ్చాడు. ఆ ఆవుల వల్ల కాపరి, కాపరి వల్ల ఆవులు బ్రతుకుతున్నాయి. దీని నుండి హరీష్ తనకేదో మంచి జరగాలనే వ్యాపార ధోరణితో చెయ్యలేదు వారి ఆకలి తీరిస్తే వారు ఆనందంగా ఉంటారు, అదే హరీష్ కు ముఖ్యం. కానీ ఇదంతా గమనిస్తున్న నేచర్ ఊరికే ఉంటుందా "మనం ఇతరులకు ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం మోసం చేయాలనుకుంటే మోసం, కోపం చూపిస్తే కోపం, ఆనందాన్ని ఇస్తే ఆనందం ఇలా తిరిగి ఇవ్వడమే తన ప్రధాన కర్తవ్యం కదా".. ఈ సంఘటన నుండి హరీష్ ఆలోచనలు నెమ్మదిగా స్టేబుల్ అవ్వడం మొదలయ్యింది.
మళ్ళీ శివుడి పాట ద్వారా: పెళ్లిచూపులు మూవీ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారి కూతురు మంచి సింగర్. ఒక శివుడి పాట ద్వారా సింగర్ గా లాంచ్ చెయ్యాలని అనుకున్నారు, దీనికి డైరెక్టర్ మన హరీష్. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక వరమహాలక్ష్మీ షోరూమ్ లో షూటింగ్ పర్మిషన్ తీసుకున్నారు(జనరల్ గా ఐతే ఇవ్వరు కానీ మొదటిసారి పర్మిషన్ లభించింది). ఈ షూటింగ్ సమయంలో హరీష్ టేకింగ్ చూసి షోరూమ్ యజమాని కళామందిర్ కళ్యాణ్ గారు ఇంప్రెస్ అయ్యారు. కొంతకాలం తర్వాత కళ్యాణ్ గారు గర్భంతో ఉన్న ఆవును కొనుగోలు చేశారు, ఆవు మరో లేగకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుండి హరీష్ ఆ దూడతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఆవుల దగ్గరకి మనం వెళ్ళినప్పుడు అవి వాసన చూస్తాయి, మన నుండి వచ్చే పాజిటివ్, నెగిటివ్ వైబ్స్ బట్టే అవి మనతో బిహేవ్ చేస్తాయని అంటారు.
హరీష్ వాటికి పండ్లు తీసుకెళ్లడంతో పాటు కాసేపు అక్కడే ఉండి వాటితో గడిపేవాడు. అవి హరీష్ పట్ల విపరీతమైన మమకారాన్ని చూపించేవి, హరీష్ కార్లో వచ్చేటప్పుడు కార్ సౌండ్ వినగానే 'అమ్మా..' అని పిలిచేవి, ఆ పిలుపు ద్వారా జీవితంలో కొద్దిపాటి బాధ కూడా హరీష్ నుండి వెళ్ళిపోయింది. హరీష్ కారులోనే కూర్చుని ఉంటే కార్ డోర్ తీసి బయటకు రమ్మనమని సంజ్ఞ చేస్తుంటాయి. ఒక్కోసారి ఆవు మాట వినకపోయినా కానీ కళ్యాణ్ గారు కాల్ చేసి పిలిపించుకుంటారు. ఆవులను చూసే కాపరి కన్నా, యజమాని కళ్యాణ్ గారి కన్నా ఆవులు హరీష్ కే ఎక్కువ క్లోజ్ అయ్యాయి. ఒకసారి కళ్యాణ్ గారి ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతున్న రోజున వందలాది మంది అతిథులు వచ్చారు, హరీష్ రాగానే లేచి నిల్చుని అమ్మా.. అని పిలిచాయి. అంతమందిలోనూ హరీష్ పట్ల చూపించే ఆ ప్రత్యేక ప్రేమకు అక్కడి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
మొదట గర్భంతో ఉన్న ఆవు పేరు లక్ష్మీ, దానికి పుట్టింది గౌరి, గౌరి కి పుట్టింది ఆదిపరాశక్తి. చిన్నతనం నుండి గౌరీ కి హరీష్ అంటే ఎక్కువ ప్రేమ. గౌరీ ఇక వారం రోజుల్లో కనబోతుంది అనగా హరీష్ అక్కడికి వెళ్ళినప్పుడు హరీష్ ను చూసి అది కన్నీరు పెట్టుకుంది. ఆ దృశ్యం హరీష్ జీవితంలో మర్చిపోలేనని అంటాడు. గౌరీ ప్రసవిస్తున్నప్పుడు కూడా ఆవుల కాపరి, కళామందిర్ కళ్యాణ్ గారు, హరీష్ దగ్గరే ఉన్నారు. ఆవు అనే కాదు ఇతర ఏ జంతువులు కూడా ప్రసవించిన తర్వాత దాని బిడ్డలను అవ్వి తాకడానికి అడ్డుచెబుతాయి, హరీష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. వీడు మనవాడు, వీడి వల్ల మనకు ఎలాంటి ఆపద కలగదు అని వాటికి తెలుసు. మూడు సంవత్సరాల క్రితం సినిమా ఆగిపోయి, వ్యక్తిగత జీవితంలో ఉన్న అనుమానాలు ఇబ్బందులు హరీష్ జీవితంలో ఇప్పుడు లేవు.
హరీష్ ఈ ఆవులలో శివుడి వాహనాన్ని చూడలేదు, లేదంటే వీటికి సేవ చేస్తే తనకేదో ఏదో మంచి నాకు జరగాలని ఆశించలేదు. సాటి ప్రాణులుగానే చూశాడు, భోజనం పెడుతున్నప్పుడు వాటి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞతా భావం, కనిపడగానే 'అమ్మా ..' అని పిలిచే ఆ పిలుపులోని ప్రేమ, దగ్గరికి రాగానే మామకారంతో ప్రవర్తించే తీరు ముందు మిగిలిన లక్ష్యాలు, విషయాలు ఏ పాటివి.? మీరు ప్రపంచాన్ని మార్చాలనే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడం కన్నా మీ పనులను చూసుకుంటూనే సాటివారికి అండగా నిలబడండి, ఒక పూట భోజనం పెట్టినా, ఆర్ధిక సహాయం చేసినా, మాట సహాయం చేసిన లేదంటే మరొక విధంగా మంచి చేసినా పర్వాలేదని హరీష్ అంటుంటారు. హరీష్ స్నేహితులలో కొంతమంది ఈపాటికే ఫిల్మ్ డైరెక్టర్లు అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి మనసు, టాలెంట్ గల హరీష్ కూడా త్వరలోనే డైరెక్టర్ కాబోతున్నారు, నేచర్ అర్హులైన ప్రతి వ్యక్తికి ఓ గొప్ప అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తుంది.