A Short Of A Girl Describing The Relationship With Her Dad In Different Stages Of Her Life

Updated on
A Short Of A Girl Describing The Relationship With Her Dad In Different Stages Of Her Life

Contributed by Kutti Subrahmanyam

ఇది గెలిచాననుకుంటూ ఓడిపోయిన ఒక కూతురి కథ.(అన్ని పాత్రలు కల్పితాలు మాత్రమే).

నాన్న! ఈ మాటకి దూరమయిన పిల్లలు ఎందరో. అందులో మన కథనాయిక కూడా ఒకరు. ఇంతకీ గెలుస్తూ ఓడిపోవడం ఏంటి? ఈ 25 ఏళ్ల అమ్మాయి ఎదురుకొన్న ఒడిదుడుకులు ఏంటి? ఇంత చిన్న వయసులో ఓడిపోవడం ఏంటి? ఓటమి అర్ధాలు ఎన్నో!

ఆ పల్లెటూరి ఇంట్లో ఐదుగురు ఉండేవాళ్ళు. అమ్మ నాన్న నానమ్మ, తాతయ్య మరియు అత్త (నాన్న వాళ్ళ చెల్లి). అంత మంది ఉన్నారంటే ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ శాతం లో ఉండాలి. కానీ అన్నీ ఉన్నా సంతోషం కనీసం కూడా లేని ఇల్లు అది. మనస్సులో ప్రేమ ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది. కానీ రోజు గొడవలు. కారణం ఎవరికీ తెలియదు. రోజూ ఒక గొడవ, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, సాధించడాలు. బయటికి వెళ్లి వస్తే ప్రాణాలతో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అన్న భయం తో బ్రతికే వాళ్ళు.

అప్పుడే పెళ్లి అయ్యి కాపురం మొదలు పెట్టిన ఆ జంటకు ఎదో వెలితి కనిపించేది. చేప కింద నీరులా సాగిపోతున్న ఆ జీవితం లో వెలితి ని తరిమేస్తూ ఒక పాప పుట్టింది. కానీ 6 నెలలకే పుట్టేయడం తో పుట్టిన వెంటనే మరణించింది. బాధ పడుతూ నెలలు గడవగా మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఈసారి చక్కగా, పొడుగ్గా, చామంచాయ రంగుతో పుట్టింది. అమ్మాయి పుట్టింది అనగానే ఆఫీస్ నుంచి ఉరుకుల పరుగుల మీద వచ్చాడు ఆ తండ్రి. కానీ నమ్మకాల ముసుగులో బిడ్డని తండ్రి నేరుగా చూడకూడదని చెప్పడం తో చిన్నబోయిన ఆ మొహం, నూనె నిండిన పాత్రా లో తన బంగారుతల్లి కనిపించడం తో చందమామని చుసిన శ్రీరామచంద్రుడిలా కళకళలాడిపోయింది. ఇంట్లో ఆడపిల్ల పుట్టడం తో ఎంతో సంతోష పడ్డారు అందరు.

1-10 ఏళ్ల వయసులో:

పాప కి పుట్టిన మూడు సంవత్సరాలకే ఆ తాతయ్య కన్నుమూశారు. కానీ స్పోర్ట్స్ తాతయ్య ఉత్సాహం నింపుకుందో ఏమో ఆ పాప 9 నెలలకే నడిచేసింది, 12 నెలలకే పరిగేతేసింది. 18 నెలలకి స్కూల్ కి వెళ్లిపోవడం మొదలుపెట్టిన కూతుర్ని చూసి గర్వ పడడం మొదలుపెట్టాడు తండ్రి. ఇంకాస్త ఎదిగేసరికి మాట్లాడే మాటలు విని అనవసరంగా వస ఎక్కువ రాసేసాం అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఆఫీస్ నుంచి వచ్చే నాన్న కిటికీ నుంచి ఒక శబ్దం చేస్తే చాలు ఎంత నిద్ర లో ఉన్న పుటుక్కున లేచి కూర్చుంటుంది. అంత ప్రేమ పెంచేస్కుంది ఆ వయసులోనే. అబ్బాయి కన్నా చురుకుగా ఉంటూ ఎంతో సున్నిత మనస్సు తో పెరిగింది. ఎంత చురుకుగా ఉన్నా కూడా, ఎప్పుడు నవ్వేది కాదు. నవ్వు అనేది నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.

10-15 ఏళ్ల వయసులో:

ఒక అమ్మాయి తండ్రిగా తన కూతురు ఎలా ఉండాలి అని నాన్న అనుకున్నాడో ఆశ్చర్యంగా అలానే పెరగడం మొదలు పెట్టింది కూతురు. ఎప్పుడు ఏ బెంగ లేకుండా గుండెల మీద చెయ్య వెస్కొని పడుకునేవాడు. తన కూతురు తెలివయినది ఏదయినా సాధిస్తుంది అన్న నమ్మకం చాలా ఎక్కువ. అది తన పదవ తరగతి పరీక్షలు. మొదటి ర్యాంకు వస్తే ఒక సినిమా హీరో చేతుల మీదుగా 10,000 రూపాయిల బహుమానం అనడం తో పట్టు బట్టి చదివింది. కానీ రెండవ స్థానానికి పరిమితం అయింది. 100 /100 మార్కులు గణితం లో మొత్తం మండలం లో తన కూతురికి మాత్రమే వచ్చాయని గర్వ పడ్డాడు నాన్న. కానీ మొదటి స్థానం ఇవ్వలేకపోయింది అన్న బాధ కూతురికి ఉండిపోయింది. సున్నిత మనస్కురాలు మరియు తండ్రి ఫై ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల ఈ విషయం చాలా బాధించింది కూతురిని.

15-20 ఏళ్ల వయసులో:

కాలేజీ లో ఉచిత సీట్ దొరకడం తో పట్నం వెళ్ళింది చదువుకి. కానీ హాస్టల్ లో ఉండలేకపోవడం వలన, ఆ తల్లిదండ్రులు కూడా పట్నం వచ్చేసారు. బయట కాలేజ్లో సీట్ ఖాళీ లు లేకపోవడం తో రెండు నెలలు ఖాళీగా ఉంటూ ఇంట్లోనే చదువుకున్నాది. ఆయా సమయం లో చదువు నేర్పించే పాఠాల కన్నా ఎంతో తెలుసుకుంది. నానమ్మ అత్త ఎలాంటి వాళ్ళో అర్ధం చేసుకుంది.

రెండు సంవత్సరాల ఇంటర్ పూర్తయిపోయింది. మళ్ళీ రిజల్ట్స్ లో అదే జరిగింది. రెండవ స్థానం. ఈసారి ఇంకాస్త పట్టుదల పెంచుకుంది మనసులో. Govt సీట్ తెచ్చుకొని బీటెక్ లో చేరింది. నాన్న ని చూస్తూ నాన్న చేసే పనిని ప్రేమిస్తూ తాను కూడా నాన్నలా అవ్వాలని కోరికతో తన తండ్రి చదివిన కోర్స్ లోనే చేరింది. తండ్రి కూతురు కలిసి అన్నీ చర్చించుకోవడం పోటీ గా చదివి అన్నీ తెలుసుకోవడం చేసేవారు. ఆలా నాలుగు లో రెండు సంవత్సరాలు అయిపోయాయి. బీటెక్ లో మార్కులు ఏంటి లే అని అనుకునే వాళ్ల మధ్య ఈ కూతురికి మాత్రం మొదటి ర్యాంకు అవసరం. 0.05 శాతం తో రెండవ స్థానం లోనే ఉండిపోయింది. ఈసారి అసంతృప్తి మైండ్ నిండా నిండిపోయింది. ఇంత సహాయం చేసే నాన్న, ఇంతగా ప్రేమించే నాన్న కి ఉన్న ఏకైక అలవాటు, తాగుడు. ఇంట్లో ఇన్ని ఏళ్లలో జరిగిన అన్ని గొడవలకి, ఆ భార్య భర్తల మధ్య వెలితికి అన్నిటికి కారణం అదే. ఆ అలవాటు తనకి రావడానికి కారణమయిన నానమ్మ అంటే ఆ కూతురికి ఎప్పుడు కోపమే. రెండవ ర్యాంకు తెచ్చుకొని అసంతృప్తి తో ఇంటికి వచ్చిన ఆ కూతురు ఇంట్లో వాతావరణం చూసి ఇంకాస్త నీరస పడిపోయింది. డబ్బు పిచ్చి ఉన్న నానమ్మ చేసిన గొడవ గురించి తెలుసుకుంది. 18 ఏళ్లలో తాను పడ్డ కష్టాలు ఎప్పుడూ చెప్పని అమ్మ ఆ రోజు చెప్తుంటే విని దుఃఖం ఆపుకోలేకపోయింది. భార్య కి తల్లి కి మధ్య నలిగిపోతూ తాగి వచ్చిన తండ్రి ని చూసి కోపం తో, "నాన్న, నువ్వు ఇలా తాగుతూ ఉన్నంత కాలం, ఇంట్లో గొడవలు ఆగవు. నేను ఏది సాధించలేను. నువ్వు లేనప్పుడు వస్తుందేమో ఇంకా నాకు ఫస్ట్." తాగి ఉన్న నాన్నకి ఆ మాట గుర్తుండకపోయినా, కూతురి మనసులో ముద్ర పడిపోయాయి.

"THE POWER OF SPOKEN WORD" అని నాన్న చిన్నప్పట్నుంచి చెప్పేవారు. ఈరోజు నేను ఈ మాట ఎందుకు అన్నాను. నాన్న లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని నేను అంత పెద్ద మాట ఎలా అనగలిగాను? అని రోజూ ఆలోచిస్తూనే 9 నెలలు గడిచాయి. ఇలా ఉంటే జీవితం లోనే ఇంకేం చూడలేము అనుకుందేమో, అమ్మ నాన్న తమ్ముడితో టూర్ వెళ్దాం అని ఆలోచించింది. మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు. 'నేను పుట్టిన 18 సంవత్సరాలలో మొదటి యాత్ర' అని ఏంత్తో సంతోషంగా ఉంది. టూర్ నుంచి వచ్చి నాలుగు నెలలు అయింది, పరీక్షలు మొదలవ్వడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈసారి కూతురిని ఎంకరేజ్ చెయ్యడానికి బైక్ కొని ఇద్దామనుకున్నాడు ఆ తండ్రి. తాను కాలేజీ నుంచి వస్తున్న దారిలో కాలేజీ బస్సు ఆపి ఎదో బాయ్ఫ్రెండ్ పికప్ చేసుకున్నట్లు గా తన కూతురిని హీరోలా బైక్ మీద కుర్చోపెట్టుకున్నాడు . కూతురికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. కొన్న కొత్త బైక్ కి హెల్మెట్ కొందాం అని తండ్రి కూతుర్లు వెళ్లారు. ఇద్దరూ బయట తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది. డిన్నర్ చేసి అమ్మ తో తాను మరియు నాన్న రోజంతా ఎలా ఎంజాయ్ చేసారో చెపుతూ కూర్చుంది ఆ కూతురు. హాల్ లో న్యూస్ చూస్తూ ఉన్న నాన్నను లోపలికి పిలవడానికి వచ్చిన తన పిలుపు గాలిలో కలిసిపోయింది. గొంతులోంచి మాట రాలేదు. ఆ చిరునవ్వు కలిగిన మొహాన్ని మరియు ప్రాణం లేని తన నాన్న శరీరాన్ని చూసి సంతోషాన్నంతా ఆ చీకట్లో కలిపేసింది. కొన్ని నెలల లో బీటెక్ పూర్తి చేసుకుని కాలేజీ లో ఉండే వేల మంది స్టూడెంట్స్ లో బెస్ట్ స్టూడెంట్ గా గోల్డ్ మెడల్ అందుకుంది. అంటే మొదటి రాంక్ కన్నా ఎక్కువ. కాలేజీ ఫౌండేషన్ డే రోజు ఫంక్షన్ లో, స్టేజి ఎక్కి తన కూతురు మెడల్ అందుకోవాలి అనేది నాన్న కల. నాన్న చనిపోయిన అదే రోజు కాలేజీ ఫౌండేషన్ డే.

ఆ తర్వాత చదివిన పై చదువుల్లో లక్షల్లో స్కాలర్షిప్ తీస్కొని ఒక పేరు సంపాదించుకున్న ఆ కూతురుకి పెద్ద ఉద్యోగం వచ్చినా సంతోషం లేదు కానీ, తండ్రి పని చేసిన మొదటి కంపెనీ పేరు తాను చేరిన మొదటి కంపెనీ పేరు ఒకటే కావడం తో అన్నీ నాన్న ఇస్తున్నారు అని, నాన్న తన పక్కనే ఉన్నారు అనే ధైర్యం తో అడుగులు వేస్తున్న ఆ కూతురు ఎంత దూరం వెళ్తుందో!!

తాను ఆ రోజు కోపం లో మాట్లాడిన మాటని నాన్న నిజం చేసి చూపించారు. గెలిచింది ఎవరు? ఆ మాట అన్న నేనా? లేక ఎవరికీ కనిపించని ఆ మాట యొక్క శక్తా?

జీవితం లో మనం చేసే ప్రతి పనీ, మాట్లాడే ప్రతి మాటా మనం కూడా అనుభవించక తప్పదు. ఎంతయినా మన జీవితాన్నిగడిపేస్తున్నదే వాటితో!

"ఆవేశంలో అన్న మాటలు, ఆలోచించి చూడు చాలు. సమాధానాలు దొరుకుతాయి కాబోలు!"