This Guy's Short Poem About Father Is Relatable To All The Guys Out There

Updated on
This Guy's Short Poem About Father Is Relatable To All The Guys Out There

Contributed by Hari Atthaluri

నాన్న ఈ పదం.. కొందరకి భయం.. కొందరికి నమ్మకం.. కొందరకి ధైర్యం.. కొందరకి జ్ఞాపకం.. నాన్న.. వేలు పట్టుకుని నడిపిస్తాడు.. వేలకి వేలు మన కోసం ఖర్చు చేస్తాడు.. ఏ వేళ ఫోన్ చేసినా, మనకోసం వచ్చేస్తాడు.. నాన్న మనకోసం కష్ట పడతాడు.. మనకోసమే కూడ బెడతాడు... మనకి కష్టం వచ్చిన ప్రతి సారీ పక్కనే ఉంటాడు.. మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు... నాన్న.. తెలియని విషయాలు ఓపిగ్గా చెప్తాడు.. తెలియక చేసే తప్పుల్ని క్షమిస్తాడు.. తెలిసీ చేసే తప్పుల్ని శిక్షిస్తాడు... తెలివితక్కువగా చేసేవి కూడా భరిస్తాడు.. నాన్న.. బాధ్యత గా ఉంటాడు.. బాధలు ఎన్ని ఐనా పడతాడు.. బాగున్నా లేకపోయినా మనకోసం బయటకు వెళ్లి సంపాదిస్తాడు.. నాన్న అనే పదం... అందరకీ ఇంతే అందంగా ఉండదు... కొందరకి అంతే ప్రేమ దొరకదు.. కానీ.. వెతికి చూస్తే... అందులోను ఎంతో కొంత మంచే ఉంది.. ఒక బాధ్యత లేని నాన్న ని చూస్తూ పెరిగిన వాళ్ళు కూడా.. నాన్న లా నేను ఉండకూడదు అని బాధ్యత గా పెరుగుతున్నారు... అలా.. జీవితం లో ఎంతో కొంత పైకి ఎదిగి.. వాళ్ల పిల్లల్ని ఇంకా బాధ్యత గా, ప్రేమగా చూసుకుంటున్నారు.. మరి బాధ్యత ఉండి, ఇంకా బాగా చూసుకునే నాన్న ఉన్న పిల్లలు.. ఇంకెంత బాధ్యత గా ఉండాలి ??? వాళ్ళని బాధ పెట్టక పోవడం కూడా ఓ బాధ్యతే కదా ! కొన్నిటికి నాన్న అడ్డే చెప్పి ఉండొచ్చు.. స్వానుభవం కానీ, పక్కన పరిస్థితులు చూసి కానీ వాళ్ళు ఆ అభిప్రాయం కి వచ్చి ఉండొచ్చు... Argument చేయకుండా... అర్ధం అయ్యేలా చెప్పాల్సింది మనమే కదా!! ఏది ఎలా ఉన్నా... మన గుర్తింపు ఎప్పటికీ.. మన నాన్న తోనే ముడిపడి ఉంటుంది.. తన ప్రేమ మనల్ని నడిపిస్తూనే ఉంటుంది.. ఆ ముడి కి.. ఇపుడు వయసు పెరుగుతుంది.. ఆ ప్రేమ కి.. కొంచెం చాదస్తం వస్తుంది.. నీ ప్రపంచం ఎంత పెరిగినా.. నాన్న కి నువ్వే ప్రపంచం అని మర్చిపోకు.. ఐదారు పదుల వయసులో.. విసుక్కోకుండా..నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడే ఆ నాలుగు ఐదు మాటలే ఇప్పుడు వాళ్లకి చాలా అవసరం.. ఆ మాటలే కాదు... ఆ ప్రేమ "ఫోటో ఫ్రేమ్" గా మారక ముందే.. పాత వాటితో పాటు ఇంకొన్ని కొత్త జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోండి... కుదిరితే ఇప్పుడే నాన్న కి ఓ ఫోన్ చేసి... కొంచెం సేపు హ్యాపీ గా మాట్లాడండి.. ఇది కూడ ఒక జ్ఞాపకమే అవుతుంది...