Contributed By Hari Atthaluri
అమ్మ.. అమ్మ లో అ అంటే అమృతం.. మ అంటే మమకారం.. ఆ అమృతం ఇచ్చి ఓ బిడ్డకు ప్రాణం పోస్తుంది.. ఆ మమకారం పంచి ఆ బిడ్డ ని పెంచుతుంది..
అమ్మ... పుట్టి.. పోయే లోపు.. మన ప్రమేయం లేకుండా.. మన నోట్లో కి వచ్చే మొదటి పదం.. మనం ఎక్కువ సార్లు పిలిచే పదం.. అలా మనం ఎలా పిలిచినా.. తను మాత్రం ప్రేమ గానే పలుకుతుంది..
ఆఖరకు మనం ఎన్ని సార్లు అరిచినా.. అవన్నీ మర్చిపోయి మళ్లీ తనే దగ్గరకు వస్తుంది.. నవమాసాలు మాత్రమే కాదు.. తన ఊపిరి చివరి నిమిషం వరకు, బిడ్డ ని మనసులోనే మోసేది అమ్మ... కళ్ళల్లో పెట్టుకుని చూసేది అమ్మ..
నీకు ఇష్టమైనవి నువ్వు అడగక ముందే చేసేది అమ్మ ! నీకు కష్టం వస్తే నీతో పాటు కలిసి ఏడ్చేది అమ్మ !! పడిపోవటం..లేపటం.. ఏడవటం..ఓదార్చటం. తప్పు చేయటం.. సరిదిద్దటం.. ఎదగటం..ఎదిగి..ఎత్తులో నిలబడేలా చేయటం..
ఇలా నీ ప్రతీ అడుగు వెనక... నువ్వు అడగని అమ్మ ప్రేమ ఉంటుంది.. నువ్వు పొగడని అమ్మ ప్రార్థన ఉంటుంది.. చివరకు నీకు వచ్చే ఎక్కిళ్ళు లో కూడా ఎక్కువ అమ్మ నిన్ను తలచుకున్నవే ఉంటాయి.. నువ్వు తినే వరకు తను ఆగుతుంది... నువ్వు బాగా తింటే తను సంతోష పడుతుంది.. నీకు బాగో లేకపోతే తను ఉపవాసం ఉంటుంది..
నువ్వు ఏం చెప్పినా నమ్ముతుంది..ఏం చేసినా భరిస్తుంది.. నువ్వు నువ్వు గా లేకపోతే అర్దం చేసుకుని మరీ ఆప్యాయత పంచుతుంది... నీ తర్వాతే తను అని అనుకుంటుంది.. నీ కోసం ఎన్ని బాధలు అయినా భరిస్తుంది.. అన్ని బాధలు ఉన్నా నీ కోసం బ్రతుకుతుంది... ఏ బిడ్డ ని చూసినా, అమ్మ కి ఖచ్చితంగా తన బిడ్డే గుర్తు వస్తాడు...
ఏం ఆశించని ప్రేమని అలా ఇస్తూనే ఉండటం అమ్మ కి మాత్రమే సాధ్యం.. ఇలా తను చూపించే ప్రేమని ఈ ప్రపంచంలో ఇంక దేనితోనైనా పోల్చటం అసాధ్యం.. అమ్మ గురించి, తన ప్రేమ గురించి ఇంకా రాయాలని ఉంది.. ఎంత రాసినా అది ఈ అనంత విశ్వం లో ఆవగింజ అంతే అవుతుంది... ఎందుకు అంటే అసలు అమ్మే "సృష్టి" ఆ సృష్టి ని నిర్వచించే పదాలు ఎన్ని సృష్టించినా తన అమ్మతనం ముందు సరిపోవు...