Contributed by Masthan Vali K
ఏంటందరూ ఓటేసారా... వేసే ఉంటార్లెండి! ఓటుకు రెండు నుంచి నాలుగు వేల వరకు తీసుకుని వెయ్యకుంటే మనస్సాక్షి ఊరుకోదు. ' అరేయ్ డబ్బులు తీసుకుని ఓటెయ్యకుండా ఉంటావా రా... ' అని బాధ్యత ను పదే పదే గుర్తుచేసుంటుంది! ఓటు ఎవరికి వేసినా, డబ్బులు మాత్రం ఉన్న అని పార్టీల నుండి తీసుకోడం ఏదైతే ఉందో, అది...అది కదా మన క్యారక్టర్...ఖచ్చితంగా మనకు తగ్గ నాయకుడే వస్తాడు చూడండి, అందులో వేరే సందేహం అక్కర్లేదు. ఆ..ఆహా ఎంత అదృష్టం మనది.. మనమెన్నుకున్న...ఓ, క్షమించాలి... మనల్ని డబ్బులిచ్చి కొనుక్కున్న నాయకుడు కాబట్టి, మనకు చాలానే చేస్తాడు. వాడి ఎంగిలి చేతికున్న అన్నపు మెతుకుల్ని మన మొహాలపై విదిలిస్తాడు.. మనకన్నం పెడుతున్నాడని ఆనందపడటానికి సిద్ధంగా ఉందాం.. వాడిచ్చిన ముష్టి హామీలు... అవే ఉచిత పథకాలు అమలుపరచక పోవడానికి వాడు చూపించే కారణాలు చూడ్డానికి సిద్ధంగా ఉందాం... కొన్నాళ్ళు వాడి పేరు జపిస్తూ భజన చేయడానికి, ఇంకొన్నాళ్లకు వాడ్నే బూతులతో శపిస్తూ మనల్ని తృప్తి పరుచుకొడానికి సిద్ధంగా ఉందాం..! ఏళ్లు గడిచాక రియలైజ్ అయ్యి... ' ఛ.. వీడికి ఓటేసి తప్పు చేసాం ' ( అదెవరు గెలిచినా సరే...!) అనుకోడానికి సిద్ధంగా ఉందాం.. అప్పుడనుకున్నా పొడిచేదేం లేదు...అయినా సరే, సిద్ధంగా ఉందాం..! వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేమిస్తున్నాం.. మీరిస్తున్నారు కాబట్టి మేం తీసుకుంటున్నాం... అని కోడి ముందా గుడ్డు ముందా లాంటి తల గొక్కోవాల్సిన సమస్య లేదిక్కడ! సమస్య వేరే... దానికి సమాధానం చేదుగా ఉంటుంది...దాన్ని మనం తట్టుకోలేం... అదే నిజాయతి! మన డబ్బులు మనకే ఇస్తున్నాడు, తీసుకోడం లో తప్పేముంది అంటారా...? క్షమించండి. మీకోసం ఇక్కడ బూతులు రాయలేను! చదువుకున్న వారు కూడా తమని సమర్దించుకుంటూ ఓటుని అమ్ముకుంటున్నారంటే... వాళ్ళకంటే పెద్ద హిపొక్రైట్ ఉండడు! దీన్ని చదువుతున్నంత వరకూ నీకు నిరాశావాదం లా అనిపించినా... ఇదే నిజం. ఈ నిజాన్ని రాయడమే నా ఆశావాదానికి ఉదాహరణ. మనది ప్రజాస్వామ్య దేశం, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రజాస్వామ్య సౌలభ్యాలను సద్వినియోగ పరుచుకోక పోవడం... మనలో ప్రశ్నించే చైతన్యం కలిగి, మనకు ప్రశ్నించే అవకాశం కలిగించి, ఆ ప్రశ్నకు సమాధానం అందించే వెసులు లేనంత వరకూ...నాయకుల్ని ప్రజలు ఎన్నుకోవడం కాస్తా ప్రజల్ని నాయకులు కొనుక్కోవడం గా మారడం ఆగనంత వరకూ.. ఎవ్వడు గెలిచినా ఎవ్వరికీ అస్సల్ ఫరక్ పడదు అనుకునే లోగా.. ఇలాంటి పరిణామాల మధ్య కూడా ఇసుమంతైనా ఆలోచన, అవగాహన, ఆచరణ ఉన్న పౌరులు కొందరున్నారన్నది కంటికి కనిపించని నిజం, ఆ నిజమే కనుమరుగవుతున్న నిజాయతికి ఊపిరి అందిస్తోంది... పరుగెత్తి పరుగెత్తి అలసి పోతున్న భారతానికి ఆసరాగా నిలుస్తోంది... ' ఇదిక ఇంతే ' అని బాధ్యత వదిలేసిన వాళ్ళని తిరిగి దారిలోకి తీసుకొస్తోంది.. రాబోయే ఫలితాల్లో ఎవరు గెలిచినా... నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారని, ఎందరో మహానుభావుల స్వాప్నికాలను నెరవేర్చడం లో తమ పాత్ర చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ.. #Hope