సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ కొంతకాలానికి విసుగు పుట్టి జాబ్ కి రాజీనామా చేసి వ్యవసాయమని, ఫుడ్ ట్రక్ అని ఇలా రకరకాల వాటిలోకి చాలామంది వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేవారికి చాలా రిస్క్ ఉంటుంది. మంచి శాలరీ వస్తున్న జాబ్ ను వదులుకుని మరో వ్యాపారాన్ని మొదలుపెడితే ఖచ్చితంగా అందులో సక్సెస్ అయ్యి తీరాలి లేదంటే తిరిగి జాయిన్ అవుదామనుకున్నా ఒక్కోసారి ఆ జాబ్ కూడా ఉండదు. దేవ్(8886597103) కూడా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నవాడే, కొంతకాలానికి నచ్చిన పని మొదలుపెట్టాడు కూడా కాని చాలామంది చేస్తున్నట్టుగా జాబ్ కి మాత్రం రిజైన్ చెయ్యలేదు.
దేవ్ నాన్న గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తారు. తన అనుభవంలో మిగిలిన వారు చేసిన తప్పులను ఇద్దరి పిల్లలకు ఉదాహరణలతో వివరిస్తూ "తప్పు చేశాము అన్న అపరాధ భావన" వారిలో కలుగకుండా పెంచారు. ఇక దేవ్ కు చిన్నతనం నుండి తనే ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చెయ్యాలని భావించేవాడు.
గీతం యూనివర్సిటీలో Intigrated M.Tech పూర్తికావడంతోనే క్యాంపస్ సెలెక్షన్స్ లో జాబ్ రావడంతో హైదరాబాద్ కి వచ్చేశాడు. ఇక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే సందీప్ తలారి తో పరిచయం ఏర్పడింది. సందీప్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జాబ్ కు రిజైన్ చేసి Poly farmingలో అద్భుతమైన ఫలితాలను రాబడుతున్నాడు. దేవ్ కూడా మొదట poly farming చెయ్యాలని ఆశించి అరకు లో కొంత భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు.
వాతావరణం మారిపోవడంతో పాటు హుద్ హుద్ తుఫాన్లు లాంటి సంఘటనలకు అనుకూలంగా ఈ ప్రాంతం ఉండడంతో poly farming ఇక్కడ చెయ్యడం కష్టతరం అని లీజుకు తీసుకున్న తర్వాతనే దేవ్ కు తెలిసింది. "నష్టం ఏనాడు రాదు మనం ఓటమిని ఒప్పుకోకుంటే" అని ఇదే భూమిని ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అని ఆలోచనలలో మునిగిపోయాడు. అరకు తెలుగు రాష్టాలలోనే కాదు యావత్ భారతదేశంలోను గొప్ప టూరిజం ప్రదేశం. "ఇక్కడ రిసార్ట్స్ కడితే ఎలా ఉంటుంది.? అద్భుతంగా ఉంటుంది, కాని మన రిసార్ట్స్ కంటూ ఒక గుర్తింపుండాలి".
ఇలా అనుకోగానే దేవ్ రీసెర్చ్ చెయ్యడం మొదలుపెట్టాడు. అరకులో ఉన్న రిసార్ట్స్ అన్ని ఒకే రకమయినవి. వారి ఇల్లు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా దాదాపు అదే రకమైన ఇంటి వాతావరణం. ఇప్పటికీ గ్రామాల్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నామంటే అమ్మమ్మ మాత్రమే కాదు, అక్కడి గ్రామీణ వాతావరణంలో అమ్మమ్మ ఉంటున్న పాతతరం ఇంటిలో గడపాలని కూడా. అలానే అరుకుకు వస్తే ప్రకృతితో మమేకం అవ్వాలి, బయట ఉన్నప్పుడు మాత్రమే కాదు రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ప్రకృతికి దగ్గరిగా ఉన్నామనే భావన వారిలో కలగాలనే ఈ "Sri Lahari Bamboo Resort" నిర్మాణం మొదలుపెట్టారు.
Lahari Bamboo Resortని నిర్మాణం దగ్గరి నుండి దేవ్ కు అసలైన కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఒక పక్క జాబ్ చేస్తూనే సమయం చూసుకుని ఇక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. అరకు లో వాతావరణం వెంటవెంటనే మారుతూ ఉంటుంది. ఒక్కోసారి వర్షం పడుతుంది. సరే వర్షం పడుతుంది కదా అని పనులని ఆపుచేస్తే కాసేపాగాక ఎండ వచ్చేస్తుంది. ఇలా వాతావరణ పరంగానే కాక ఎన్నో రకాల సమస్యలు దేవ్ అనుభవించాడు. పగలు రాత్రి అన్న బేధం లేకుండా కార్మికులు పడ్డ కష్టంతో పోటీపడ్డాడు. ఓ చిన్న రేకుల షెడ్ నిర్మించుకుని రిసార్ట్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు చలిలో అందులోనే పడుకునేవాడు.
మిగిలిన ఇళ్లకు వెదురుతో నిర్మించిన ఇళ్లకు చాలా తేడా ఉంటుంది. బయటి టెంపరేచర్ కి ఇంటి లోపలి సుమారు మూడు డిగ్రీలకు పైగా తేడా ఉంటుంది. ఏ మాత్రం చిన్న గ్యాప్ వచ్చినా గాని చలి లోపలికి వెళ్లిపోతుంది. దేవ్ 6 నెలలు శ్రమించి నేచర్ కు దగ్గరిగా ఉన్నామనే భావన కలిగించడానికి అన్ని రకాల మార్పులు చేశారు. అలాగే రిసార్ట్ లో వైఫై, టీవీ, హాట్ వాటర్(గ్రీజర్ తో), హోమ్ ఫుడ్ లాంటి వసతులన్నీ కూడా అమర్చాడు. సంవత్సరంలో టూరిస్టుల తాకిడి సెప్టెంబర్ నుండి జనవరి వరకు అధికంగా ఉంటుంది. అరకు లోయలో మొదటిసారి వెదురుతో నిర్మించిన రిసార్ట్ ఇది అవ్వడం వల్ల ఈ మధ్యనే ప్రారంభం ఐనా గాని టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సమయం అత్యంత విలువైనది. మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాము అన్న దాన్ని బట్టే మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అనుకున్నవన్నీ కూడా చేయవచ్చు అనడానికి దేవ్ లేటెస్ట్ ఉదాహరణ.