దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు మృదుబాషి అని అంటుంటారు కాని ఆయన కవిత్వం మాత్రం ఉద్యమాలే చేస్తాయి. సైనికుడు ఎలా ఐతే ఉద్వేగంగా తుపాకిలో బుల్లెట్లు లోడ్ చేస్తాడో తిలక్ గారు కూడా కలంలో ఇంకు నింపే సమయంలో అంతే ఉద్వేగంగా ప్రవర్తిస్తారు. మన పశ్చిమ గోదావరి జిల్లా మండపాకలో జన్మించిన తిలక్ గారు కథలలో, కవిత్వాలలో అందవేసిన చేయి. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం రాసిన ఆయన కవిత్వం అప్పటి తరానికే కాదు ఇప్పటి తరానికి చీకటి ఉన్న ప్రతి చోటుకు దూసుకెళుతుంది. తిలక్ గారి గురించి మాట్లడాడం కన్నా ఆయన కవిత్వం మాట్లాడితే ఇంకా బాగుంటుంది.
దేవుడా రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి నీతుల రెండునాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాలనుండి లక్షలాది దేవుళ్లనుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంత కేసరుల నుండి శ్రీమన్మద్గురు పరంపరనుండి..
స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయం కల్గించనంతవరకే.
అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేను మాత్రం తలుపు తెరచి యిల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండదాటి కోనదాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచునున్నాను.
ఒక్క నిరుపేద వున్నంతవరకు, ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు, ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంతవరకు, ఒక తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంతవరకు, ఒక క్షత దు:ఖిత హృదయ మూరడిల్లానంత వరకు, నాకు శాంతి కలగదింక నేస్తం, నేను నిగర్వినైనాను, ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. ఈ గుండెపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి.
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు రేపటి గురించి భయం సంఘ భయం అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం గతంలో కూరుకుపోయిన మనుష్యులు గతించిన కాలపు నీడలు. వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు కలుగుల్లోంచి బయటకు రాలేరు లోపల్లోపలే తిరుగుతారు మౌడ్యం వల్ల బలాడ్యులు అవివేకం వల్ల అవినాశులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు.. సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు శిథిలాలయాలకు పూజారులు.
ఎవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో చెదిరిన జుట్టుతో జారిన పైటలతో ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు తల్లులా భార్యలా అక్క చెల్లెండ్రా మీరు ఏ నాటివారు ఏ వీటివారు మీరు ఏ యుద్ధంలో చనిపోయాడు మీ వాడు ఏ దళం ఎన్నవ నంబరు. కురుక్షేత్రమయితే కృష్ణుణ్ణి అడుగు పానిపట్టయితె పీష్వాలనడుగు బొబ్బిలయితె బుస్సీనడుగు క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం ప్రథమ ద్వితియ ప్రపంచ యుద్ధాలు బిస్క్మార్క్ నడుగు, హిట్లర్ నడుగు, బ్రహ్మదేవుణ్ణి అడుగు.
ధాత్రీ జనని గుండె మీద యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు మీ రెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీ రెపుడైనా చూశారా కన్నీరై నా విడిచారా. దరిద్రుని నోరులేని కడుపు తెరచుకున్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు మీ రెప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా.
బల్లపరుపుగా పరచుకొన్న జీవితం మీద నుంచి భార్యామణి తాపీగా నడచివచ్చి అందికదా పంచదార లేదు పాల డబ్బా లేదు బొగ్గుల్లేవు రాత్రికి రగ్గుల్లేవు. రోజూ పాడే పాత పాటకి రోజూ ఏడ్చే పాత చావుకి విలువలేక, విని కూడా కదలకుండా గొంగళీ పురుగు సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్రపోయింది.
కాలానికి ఒక రూపంలేదు దానికి పాపంలేదు కాలం అద్దం లాంటిది అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు ఎవడికి వాడే యిచ్చా ప్రయత్నబలంతోవర్ణోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు.
కాలం కదలదు, గుహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు. చెట్లనీడ ఆవులు మోరలు దింపవు, పిల్లి పిల్ల బల్లిని చంపదు. కొండమీద తారలు మాడెను బండమీద కాకులు చచ్చెను కాలం కదలదు, గుహలో పులి పంజా విప్పదు, చేపకు గాలం తగలదు. ఎండుటాకులు సుడిగాలికి తిరిగెను గిర్రున, వడగొట్టిన భిక్షుకి అరచెను వెర్రిగ.
అర్ధరాత్రి థియేటర్లలో అర్ధనగ్న లాస్యానికి, సెక్సీ హాస్యానికి అమెరికన్ జాకెట్లు తొడిగిన బంగారప్పిచికలు కిచకిచలాడినప్పుడు. ఊరవతల సందులలో అంగళ్ళలో విక్రయార్ధం రంగేసిన రకరకాల మొగాల్ని పేరుస్తోన్నప్పుడు యుద్ధాల్ని సృష్టించే మహానాయకులు దేశాల సరిహద్దులలో నిలబడి ద్వేషాల శతఘ్నులు పేలుస్తూన్నప్పుడు అకాల మరణం పొందిన అనాథ బాలుణ్ణి ఒడిలో పెట్టుకుని అతగాడు ఎర్రని కళ్ళతో ఏమీ ఎరగని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
చీకట్లో చీకటి కనపడదు దీపం పాపం వంటి చీకటిని చూపెడుతుంది.
దీపాల మధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతుంది. దీపం ఆసరాతో చీకటి నిజాన్ని తెలుసుకో పాపం ఆసరాతో చీకటి నిజాన్ని తెలుసుకో ఆకలేసినపుడు కొట్లో మిఠాయి కాజేద్దామనే యానాదిపిల్ల ఆబకళ్ళు ఆపుకోలేని యౌవ్వనంలో తప్పటడుగువేసిన పెళ్ళికాని పిల్ల కన్నీళ్ళు ఆరు లక్షలున్నా దొంగ నిలవలు వేసే షావుకారు అజ్ఞానపు కుళ్ళు తోడేలు గొర్రెను చంపి తాగుతూన్న నెత్తుటిలో సృష్టి క్రూరపు ముళ్ళు. ఆకతాయి మొగుడైనా ఆ వేధవ ప్రతిబింబాన్ని ఆప్యాయంగా మోపే ఆడదాని ఒళ్ళు.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు నలుగురిని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు!