శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శ్రీలక్ష్మీ సమేతంగా ఇక్కడ కొలువై ఉండటం మూలంగా ఈ ప్రాంతాన్ని "దేవుని కడప" అనే పేరు వచ్చింది. స్వామి వారు భూలోకానికి విచ్చేసేటప్పుడు భూమి మీద తొలి అడుగు ఇక్కడే మోపారు అని ఆ పరమ పుణ్య పాదంతో ఈ నేల పునీతమైందని స్థానికంగా ప్రచారంలో ఉంది. నిజానికి ఈ దేవాలయంలో పూర్వం ఆంజనేయ స్వామి వారు పూజలందుకునేవారు.
పురాణాల ప్రకారం కృపాచార్యుల వారు భూలోక వైకుంఠమైన తిరుమల దేవాలయ దర్శనానికై ప్రయాణం కొనసాగిస్తున్నారు.. కొన్ని రోజుల విశ్రాంతికై అదే మార్గంలోని ఇక్కడి హనుమత్ క్షేత్రంలో(దేవుని కడప) గడిపారు. కొన్ని ఆటంకాల మూలంగా కృపాచార్యుల వారు తన ప్రయాణాన్ని కొనసాగించలేక పోయారు. ఇక్కడే తనకు దర్శన భాగ్యం కలిగించాలని కళియుగ ప్రత్యక్ష దైవాన్ని కృపాచార్యుల వారు వేడుకున్నారు. ప్రేమతో నిండిన ఆ పిలుపుకు మెచ్చి వేంకటేశ్వర స్వామి కృపాచార్యుల వారికి దర్శనమిచ్చారు. తిరుమలలో మాత్రమే కాకుండా ఇక్కడి ప్రశాంత వాతావరణంలో కూడా కొలువై ఉండాలని కృపాచార్యులు స్వామి వారిని అభ్యర్ధించారు. అలా శ్రీనివాసుని అనుమతితో ఇక్కడే శ్రీ వేంకటేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించారట.
ఆ కాలంలో తిరుమలకు ఉన్నంత పవిత్రత, గుర్తింపు ఈ దేవాలయానికి ఉండేదట.. తిరుమలకు వెళ్ళె భక్తులందరూ ముందు ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఇక్కడి వేంకటేశ్వర స్వామి వారి పాద ప్రతిమలను పూజించే సాంప్రదాయం ఉండేది. ఈ గుడిని నాటి పరిస్థితులకు, ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా పటిష్టంగా నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడి శిల్ప సౌందర్యం గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరి హర రాయలు, బుక్కరాయలుతోపాటు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈ దేవాలయంలో కాలానుగూణంగా జరిగే నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
ఈ దేవాలయానికి ఉండే మరో ప్రత్యేకత: తెలుగువారి నూతన సంవత్సరంగా పండుగ జరుపుకుంటున్న ఉగాది పర్వదినం నాడు ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి దీవెనలు అందుకుంటారు. ఇలాంటి సాంప్రదాయానికి గల ప్రధాన కారణం 'బీబీ నాంచారి' అమ్మవారిని స్వామి వారు ప్రేమించి కళ్యాణం చేసుకున్న కారణంగా వేంకటేశ్వర స్వామి వారిని ముస్లిం సోదరులు అల్లుడుగా భావిస్తారు. ప్రతి కొత్త సంవత్సరం నాడు ఇంటి ఆడపడచు, అల్లుడికి ఇచ్చే గౌరవాన్ని ఇక్కడి కడప ముస్లిం మిత్రులు సాంప్రదాయంగా ఆచరిస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.