నగ్నమునికి(కలంపేరు) ఏ ప్రాంతీయాభిమానం లేదు, ఏ మతాభిమానం లేదు కాని ఆయన కలం కొంతమందికి కొమ్ముకాస్తుంది..! దిక్కు మొక్కు లేని జనానికి పక్షపాతి ఆయన.. వారి కష్టానికి, వారి శక్తికే అభిమాని ఆయన.! అనుమానాలపై, భయంపై పోరాటం చేసేవారికి ఆయన కవిత్వం ఓ వెలుగునిచ్చే సూర్యుడు.. ప్రజల లోపాలను తెలుసుకుని వారంతట వారిని మారేలా చెయ్యడమే ఆయన కవిత్వానికి నిత్య పోరాటం. ఓ గొప్ప కవికి ఉండవలసిన లక్షణాలు అన్ని నగ్నముని గారికి ఉన్నాయి కాని అవి సంపాదన కోసం ఉపయోగించుకోలేదు.! పేద ప్రజల కోసం, దగా పడ్డ గుండెల కోసం మాత్రమే ఉపయోగించారు దిగంబర కవులలో ఒకరైన నగ్నముని. నగ్నముని గారి అసలు పేరు మానేపల్లి హృషీకేశవ రావు. మన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఉదయించని ఉదయాలు, తూర్పుగాలి, కొయ్యగుర్రం, జమ్మిచెట్టు, నగ్నముని కథలు, విలోమ కథలు లాంటి రచనలతో ప్రజా చైతన్యానికి తనవంతు శక్తిని ధారపోశారు.. నగ్నముని గారి లాంటి కవులకు వారి కలమే ఆయుధం.. ఆ ఆయుధంతోనే ప్రజలలో నెలకున్న భయాలను, అజ్ఞానాన్ని కలంతో నరికేస్తారు.

ఆయన సాగించిన అక్షర పోరాటం..
ఈ వ్యవస్థ లో పుట్టడం మోసపోవడానికే పెరగటం మోసపోవడానికే ప్రేమించటం మోసపోవడానికే నమ్మడం మోసపోవడానికే.!
జీవితం చివరన పొంచి ఉన్నది మాత్రమే మృత్యువు కాదు అజ్ఞానంలోనూ, మూర్ఖత్వంలోనూ బతుకు భయంలోనూ, ద్వంద్వ జీవితంలోనూ నయవంచనలోనూ, ప్రతీక్షణం వెంటాడేది మృత్యువే.
బలహీనుడు సంపద సృష్టిస్తాడు బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడు. చరిత్ర నిండా దరిద్రుల శవాల గుట్టలే ”
నిద్రపోతే కలలు కళ్లను కుడతాయి కదిపితే తేనెటీగలు ఒంటిని వెంటాడి మరీ కుడతాయి కదపకపోయినా నోరు మెదపకపోయినా క్షుద్ర రాజకీయాలు నిండు జీవితాల్ని కుడతాయి.
కేలండర్ కి రక్తమాంసాలుండవు.. కేవలం కాలం కుక్క నోటిలోని ఎముకముక్క గోడకు బల్లిలా కరుచుకుపోయిన వట్టి కాగితం ముక్క తారీఖులు ముద్దాయిల్లా బోనుల్లో నిలుచునుంటాయి అది ఏ తారీఖన్నా కావొచ్చు.
మనిషి కులం కత్తితో, మతం మత్తులో, ఎన్నికల క్రీడలో, ముక్కలు ముక్కలుగా నరకబడుతున్నాడు. మనిషి ఇప్పుడు కబేళాలో ఉన్నాడు. భారత ప్రజాస్వామ్యం అతి ఖరీదైనదిగా మారిపోయింది.
ఎంత పెద్ద అబద్దమైనా పది సార్లు చెపితే అది నిజమై పోతుంది. ఈ చిన్న విషయం తెల్సుకున్నోడే నేటి పాలకుడు. నేనొక అబద్దాన్ని సృష్టిస్తాను దాన్ని నా ప్రచార యంత్రానికి వదిలేస్తాను.. ఇక అది తన పని తాను చూసుకుంటుంది ఎలాగూ డబ్బు ఉండనే ఉంది. ఇక అడ్డేముంది.!
నీ రోగం మీద జాలి లేదు నీ రోగం జాతి జాతంతా అల్లుకుంటున్ననాడు నిన్ను కాల్చి చంపడానికి వెనుకాడే వాడిని కాను.!
మనిషి ఊపిరి కొయ్యడానికి కత్తే కానక్కర్లేదు జీవితాల్ని చెరచడానికి, మరుక్షణం మృతకళేబరం చెయ్యడానికి తుపాకులూ యుద్ధాలే రానక్కర్లేదు.. నూరేళ్లు నవ్వుతూ తుళ్లుతూ వేయిరేకలతో వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని భగ్గున మండించెయ్యడానికి పెట్రోలే అక్కర్లేదు ఉప్పు నీళ్లు చాలు దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు.”
గుద్దేసి వెళ్ళిపోయిన కారు కింద పడ్డ మనిషి చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. తిరిగి అంతా అతన్ని వదిలేసి మాట్నీకి వెళ్లిపోతున్నారు ఓ౦కార౦ కాదు ఆర్తనాదమే జీవికి అన్ని భాషలలోనూ అనివార్య అ౦తిమశబ్ద౦.!
నదుల మంచినీళ్లని కౌగిలిలోకి తనివితీరా తాగితాగి తెగబలిసిన కొండచిలువలా మెలికలు తిరిగి కాలంపై భూగోళంపై ‘అలగాజనం’ ముఖాలపై వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజాలంపై చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి నీటితో పేనిన తాళ్లతో గొంతులు బిగించి కెరటాల్తో కాటేసి వికటాట్టహాసంతో బుసలు కొడుతూ పరవళ్ళు తొక్కింది మనిషి బతికుండగా దాహం తీర్చలేని ఉప్పునీటి సముద్రం మిగిలింది కెరటాలు కాదు శవాల గుట్టలు శరీరాల్నుండి తెగిపోయి గాలికి ఊగుతున్న ఊపిరి దారాలు.
మనిషిలోని అన్ని అంగాలు జంతువులుగా మారడానికే జీవితాంతం ప్రయత్నిస్తాయి ప్రకృతిలోని అన్ని గ్రహాలూ భూమిని ప్రభావితం చెయ్యడానికే గిరగిరా తిరుగుతాయి చివరకు మిగిలేది గాయం కాని రక్తం మరక కాని కనబడని హత్య మాత్రమే.!
ఈ భూమిపై నిరంతరం జీవన ఘోషతో రోడ్ల పక్కన పడి మూలుగుతు దొర్లుతున్న కొన ఊపిరి నిజం మృత్యువు నిజం. మౌనాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన శవం నిజం. దరిద్రం నిజం. దరిద్రం చిమ్మే చీకటి నిజం. సమస్త లోకాన్నీ బతికించే సంపద సృష్టించే వాడి రక్తం విలువలేని ఖనిజం.!
ఎన్నటికి మనం తిరగబడలేం కాబట్టి ఎప్పటికి మనకి తిరగబడటం చేతకాదు కాబట్టి మన రక్తం నిండా కులాల, మతాల సూత్రాలు ప్రవహిస్తున్నవి కాబట్టి మనం పిరికి కుక్కలం పందులం కాబట్టి మన జీవితాన్ని శాశ్వతంగా కొనేసి పరిపాలిస్తున్న రకరకాల కుష్టుదేవుళ్ళని కొలవడానికే అంకితమవుదాం.!
కుష్టుదేవుళ్ళు నానా రకాలుగా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు తల్చుకుంటే ధరలింకా ఆకాశాన్నంటి పెరిగిపోవచ్చు కాబట్టి వాళ్ళు కన్ను తెరిస్తే మనం మాడి మసై పోగలం కాబట్టి వాళ్ళు తల్చుకుంటే ధర్మశాస్త్రాలు కోట్ చేసి లాఠీల్తో మన ఎముకలు విరగొట్టెయ్యగలరు కాబట్టి మనమంతా కుష్టు దేవుళ్ళ నానా వేశాలు తిలకిస్తూ భక్తితో భజన చేద్దాం! కుష్టు దేవుళ్ళ విరాట్ స్వరూపాన్ని కాకా పడుతు కొలుద్దాం.!
నేను బహుశా ఒకేపాట పాడుతున్నాను.. నేను జీవితాంతం ఒకేపాట పాడతాను. నా పొట్టలోంచి ఒక పేగును బయటకు పీకి ఏక్ తారాగా వాయిస్తు వీధి వీధినా పాడుకుంటు పోతాను.. నిజాన్ని వినగల చెవి కోసం లోకమంతా గాలి మీద గాలిస్తాను..!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.