ఒకటి గుర్తుంచుకో మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు, మీ అధికారం - జీవితం. గౌరవ జీవితం, వాటి కోసం పడి చచ్చి వాటికోసం ఏదైనా సరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కు మాలిన జీవితం. దేన్నీ నమ్మకు!! నీ లోపల, యీ ముసుగు లోపల, ఈ వంచన అంచుల కింద వున్న నీ అసలు స్వరూపాల్ని, నీ "తనాన్ని" నమ్ముకో. ఈ నాలుగు నిముషాలు హాయిగా బ్రతుకు. అది తెలిసినప్పుడు ఇంతకాలం ఈ ముసుగు నిన్ను ఎంత వ్యర్థుడిగా చేసిందో తెలుస్తుంది.
నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు, నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి, చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి, మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, భైరవయ్య - మన్మోహన్ సహాయ.. "మేం ఆరుగురం. దిగంబర కవులం. మాలోని నిజరూపాల్ని దర్శిస్తూ మా చుట్టూ వున్న మనుష్యులందర్నీ ప్రేమిస్తూ వాళ్ళని కూడా ఆ ప్రయత్నం చెయ్యమంటున్నాం. అందుకే మేం దిగంబర కవులం! మంచికోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటం లేని చిరునవ్వులు చిందే సమాజం కోసం, అహోరాత్రులు ఆరని అగ్నిలో నడచిన ఆత్మలోంచి పలుకుతున్న గొంతుకులం"..
ఇది సెక్సు గ్రంథం కాదు. రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించినది అంతకంటే కాదు. ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపన పడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చెక్కి ప్రవచించిన కవిత..
1. నిజాన్ని చెప్పలేక, నిర్మలంగా బ్రతకాలేక, ముసుగుని ముఖం నిండా కప్పుకున్న బురదని భాష నిండా పులుముకున్న నిన్ను చూస్తే నాకెందుకు ద్వేషం. నీ చుట్టూ విషకీటకాలు నిర్జనారణ్యాలు సంచరిస్తున్న, నీ ఒంటినిండా రసి కారుతున్నా, నిన్ను ప్రేమిస్తాను. నిన్ను మంచి తనంతో భయపెడతాను.. నీ బొమికల్ని హడల గొడతాను, నీ కలల్లో కల్లోలం రేపుతాను.. ఊ! లే! ముసుగు తొలగించు ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి ఆత్మముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో మనిషిలా మంచిగా, ఆకాశంలా అవనిలా బతుకు..
2. వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన విద్యాలయాలు వదిలి జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి.. మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి మహావ్యవస్థ రూపొందించని నాయకులు జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా పురుగులుగా వెధవలుగా ఎట్లా దిగజార్చారో ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి. యాభై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి..
3. మనిషి మీద నమ్మకం పోగొడుతున్న మీరు దేవుడి మీద ప్రమాణం చెయ్యమంటారెందుకు.? దోషికి నిర్దోషికి ఒక్కటే సూత్రం "వల్లించిందే వల్లించి వాదిస్తారు. ఫీజు కుడితి కుండలో న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు. మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి.? ఎక్కనివ్వండి నన్ను బోను. కలాలు కాగితాలు సర్దుకోండి, లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి. న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి? మనిషి, రక్తం, ప్రాణం ముఖ్యం. లింగ భేదాలు వాదాలు తప్పితే మందిర్, మజ్జిద్, చర్చి, మాతాధికారులు, మతాలు యెందుకు? ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళు, మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే. దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే. అమ్మ యెవర్తెతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే.
4. డియర్ స్కౌండ్రల్.. నువ్వు ఎప్పుడు ఏడ్వలేదని? ఎప్పుడో ఒకడు తంతాడని, ప్యాకెట్ కొట్టేస్తాడని, పరీక్ష పోతుందని, వ్యాపారం నల్ల సముద్రం పాలవుతుందని, నీ భార్యను ఎవడో లేవదీసుకెళతాడని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు. మరి ఎడ్వంది ఎప్పుడు? ఏడుపు మారుద్దామని వొళ్ళు మరిచేలా త్రాగినా ఏడుస్తూనే ప్రేలుతావ్. జేబులు నిండుకొన్నాక మళ్ళి ఏడుస్తావ్. నీవు చేసిన వెధవ పనికి, చేస్తున్న ముదనష్టపు చేష్టలకి రేపు పత్రికల్లో డొక్కచించి డోలు కడ్తారని ఒకటే ఏడుపు. మరి ఎందుకిలా నిన్ను నరుక్కుంటున్నావ్? జానెడు పొట్టకు కూడు దొరకాలేదనా? నగ్నత్వాన్ని కప్పివేయడానికి మారేడు బట్ట లేదనా. దౌర్భాగ్యపు వేషాలు.. అధికారాన్ని ఔపోసన పట్టినవాడా ఎన్నడయిన గుడిసె గడపముందు ప్రశాంతంగా నిద్రించిన శవాన్ని చూశావా.? మనస్సు మమతల రాగాలలో ఒయాసిస్సు కన్నీళ్లతో నిండిందని తెలిసిందా.?
5. కడుపులోని స్వప్నానికి నీ తాతలు తండ్రుల నీ వంశపు తరతరాలు రూపురేఖ విలాసాల దేవులాటలో ఇంకా ఇంకా నువ్వింకా బానిసవే. కళ్ళు తెరిచి నేలా నింగిని కన్నదాన్ని చూడలేని కసి గందుకు మతాలు యెల్లలు సంకుచిత స్వభావాల కొలబద్దలు ఎందుకు? ఎందుకు? యెందుకు? కామానికి కసికీ కట్టుబడ్డ నీ ప్రేమకు జాలిపడీ కరుణించీ తోటమాలి విసిరేసిన జీవమొక్క - ఎటు పెరిగిన - పెరుగనీని పిచ్చి పిచ్చి ఊహలు పుచ్చిన తలపులలో ఇంకా ఇంకా ఓ మనిషీ! నువ్వింకా బానిసవే..
6. అడుగు అడుగులో సహారా ఎడారి ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం. ఊపిరి సలపనీని యుద్ధభయంజలపాటపుసుళ్ళు. భూగోళం ఒంటినిండా రాచపుళ్ళు పిచ్చెత్తిన పక్షిలా ఎగిరిపోయి ఉపన్యాసాల పుచ్చగింజలు ఏరకు. హృదయాన్ని శిధిలం చేయకు ఎవడికీ వేదిక నిర్మించకు. స్వకుచమర్ధన సన్మానపత్రాలు సమర్పించకు శ్రోతలశాపాల్నుంచి తప్పించుకోలేవు. పదవీక్షయ పీడితనియంతృత్వ రాజకీయ రాబందులు చంపితేగాని చావరు. అది మాత్రం మర్చిపోకు ఆకాశం బీదది అవకాశం ఉన్నంత వరకే వెలుగుతుంది. భయం బానిసత్వం బ్రతుకుకాదు. సరిహద్దుల్లో పారేనెత్తుటేర్లని నిర్లిప్తంగా చూస్తూ నిలుచున్న మేధావుల్ని మన్నించకు. ఎవర్నీ నమ్మకు. నీ ఆశయం సూర్యుణ్ణి మాత్రం పిడికిట్లోంచి జారవిడవకు, ప్రాణం పణంపెట్టైనా ఈ జగతికి మానవతా బిక్షపెట్టు.
7. ఆపకండి.. వెనక్కి పిలవకండి. మీ మానసిక ఏకాకితనం శిఖరాల మీద కాంతిపాదాలతో కదంతొక్కుతూ నడుస్తున్న వాణ్ని, మీ కళ్ళల్లో పెరిగిన చీకటి అరణ్యాల్ని తగలబెట్టేవాన్ని, మీ గుండెల్లో చోటు చేసుకున్న శూన్యపు ఆకాశాల్ని వెలిగించేవాడ్ని పాలిపోయిన నరనరాన్ని పితికి జీవనదికి ఊటలు సృష్టించేవాడ్ని, మీ బిడ్డల భావికి ఆకలి శోకం మాట లేకుండా చేసేవాణ్ణి, కాకులు గద్దలు వదిలేసిన ఎముకల్లాంటి పదవుల్ని పట్టుకు మిమ్మల్ని శాసించే వెర్రికుక్కల్ని తరిమికొట్టేవాడ్ని, మీ తలలమీది చంద్రుణ్ణి ముక్కలుచేసి చీకటి కాగితాల్ని మిగిల్చి ఎందుకు ఏమిటి అని ఎదిరించే హక్కులేదని వాదించే గాడిదల నాలుకల్ని పీకేసేవాణ్ని, మీ ధైర్యాన్ని కొల్లగొట్టి బానిసలుగా వాడుకుంటూ మోయలేనిచట్టాల గులకరాళ్ళతట్టలు మోయించేవాళ్ళని వాళ్ళ డబ్బాల్ని వాయించే అపరశిఖండుల్ని పట్టపగలు బట్టబయలు చేసేవాణ్ణి ఆపకండి.. ఆపకండి.. వెనక్కి పిలవకండి.
8. రక్త మాంసాలు లేని రూపాయి కోసం బొమిక కోసం మనిషీ ప్రపంచ గమనం పట్టని కొందరు పిచ్చికుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. ఉపన్యాసాల్లో సానుభూతి కరుణలు, మానవత్వపు విలువలు చొల్లు కింద కారుస్తున్నారు. ఒకడి దొకడు అందినంత వరకు నాలుకను సాచి నాక్కుంటున్నారు. అబద్దాలాడక పూట గడవదు. ఆత్మీయుల్ని లాభనష్టాల త్రాసులో తూచందే నిద్రపోరు. నిర్లజ్జగా లంజ టెక్కులతో రాజకీయ బజారు పందుల వెంట రాత్రింబవళ్ళు పరుగెడుతున్నారు. పలుకుబడి పీతికుప్పలో పురుగుల్లా పెరుగుతున్నారు. వీళ్ళ నరాల్లో ప్రవహించేది రక్తం గాదు.. నవ్వుతారు ఉమ్మినట్టు.. చూస్తారు నాకుతున్నట్టు.. కనిపిస్తారు మనుషుల్లా..
అయ్యిందా అర్ధం అయ్యిందా.. ఏం చెయ్యాలో అర్ధం అయ్యిందా!? అయితే చూడండి. కణకణ లాడుతున్న నిప్పుల్ని మీ అబద్దాన్ని, మీదనుకున్న దాన్ని.. నక్కలాంటి - కుక్కలాంటి - పందికొక్కులాంటి బ్రతుకుని సూర్యుని నిజనిజ కిరణాలు తట్టుకోలేక గుడ్ల గూబల్ని, పొంచి ఉన్న మానుపిల్లుల్ని , దొంగచాటుగా తెగబడే తోడేళ్ళని మీ జీవితంలా పగిలిపోయిన పెంకుల్ని మీ చుట్టూ విశ్వరూపం దాల్చిన సత్యాన్ని..
కలమే ఆయుధంగా, అక్షరాలే సైనికులుగా, పుస్తకమే యుద్ధ భూమిగా సృష్టించిన మరింత దిగంబర కవిత్వాన్ని ఈ పుస్తకం ద్వారా కలుసుకోవచ్చు. You can get your copy HERE