Director Vamsy garu shared an interesting note about his popular film 'Ladies Tailor'. Have a look:
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ విజయవాడ బ్రాంచ్‌లో పనిచేసే ముగ్గురు కుర్రోళ్లు విశ్వనాథ్‌గారితో సినిమా చేద్దామని మద్రాసొచ్చి ఎడిటర్ జి.జి. కృష్ణారావుగార్ని కలుస్తా సినిమా మేకింగ్‌లో వాళ్లకి ఇన్సిపిరేషనైన ఏడిద నాగేశ్వర్రావుగారింటిక్కూడా వచ్చేరు. వాళ్లని కూర్చోబెట్టిన నాగేశ్వర్రావుగారి భార్య జయలక్ష్మిగారు వొచ్చిన పని గురించి విన్నారు.
వాళ్లకి కాఫీలిచ్చేక, ‘‘కొత్తోళ్ళు విశ్వనాథ్‌గారితో సినిమా తియ్యడమనేది అంత ఆషామాషీ విషయంకాదు. చాలా టైము పడద్ది. చాలా శ్రమ కూడా పడాలి,’’ అన్నారు. ‘‘మేవొచ్చింది ఈ పని మీద. ఏం చెయ్యమంటారో కాస్త చెప్పండి?’’ అన్నారాళ్లు. ‘‘ అడుగుతున్నారు గాబట్టి చెప్తున్నాను. మా యింట్లో ఓ కుర్రోడున్నాడు. అతను మాకు తీస్తున్న సినిమా ఆనకారేపట్లో బయటికొస్తుంది. అది చూస్తే మీ ఆలోచన్లు మారొచ్చు,’’ అంటా సాగనంపేరు.
ఆ జయలక్ష్మిగారు చెప్పిన ఆనకారేపూ గడిచేకా బయటికొచ్చినా సినిమా పేరు సితార. దాన్ని చూసిన ఆ ముగ్గురూ సిన్మా ఇతన్తో తీద్దామని డిసైడైపోయేకా ,ఆవిడ చేతుల మీదుగానే పాతికవేలు ఆంధ్ర బేంక్ చెక్ అడ్వాన్స్ ఇప్పించేరు నాకు. ఆ తర్వాత విజయవాడలో వాళ్లాఫీసు శలవులొచ్చినపుడల్లా మద్రాసొచ్చేసి నన్ను కలుస్తుంటే, ‘సౌందర్యలహరి’ అనే కథ చెప్పేను. కమలహాసన్‌కి చెపుదాం, అతనొప్పుకుంటే ఒక క్లాసిక్ అవుద్దనుకున్నాం. వీనస్ స్టూడియోలో కమలహాసన్ హీరోగా మా గురువు భారతీరాజాగారి ఒరు ఖైదీఇన్ డైరీ సినిమా షూటింగవుతుంటే వెళ్లి కలిస్తే,అంతా విని ఏడాది పడద్ది అన్నాడు కమల్.
‘‘అప్పటిదాకా ఆగలేంగానీ ఏదన్నా సినిమా మొదలెడదాం,’’ అన్నారాళ్లు. పార్సన్ కాంప్లెక్స్‌లో వీడియో విజన్ అని ఒక కేసెట్ల షాపుంది. దాంట్లో, సంజీవ్‌కుమార్ యాక్ట్ చేసిన ఫ్లాప్ సినిమా లేడీస్ టైలర్ కేసెట్ కనిపించింది. సినిమా చూళ్లేదుగానీ ఆ టైటిల్ భలే నచ్చింది నాకు. వెంటనే మా వూళ్లో చిన్న వోరి ఇంటి అరుగుమీద మిషను కుట్టే త్యాగరాజుగాడు గుర్తుకొచ్చేడు. వాళ్లొచ్చినప్పుడల్లా, ‘‘మరా కమలహాసన్ మేటరలాగయ్యింది. మనం చెయ్యబోయే సినిమా కథేంటి?’’ అంటా అడుగుతుంటే రోడ్ పక్కన పడేసున్న ఖాళీ బర్కిలీ సిగరెట్ పెట్టి డొక్కు మీద లేడీస్ టైలర్ అని రాసి ఈ టైటిల్ రిజిష్టర్ చెయ్యడి,’’ అన్నాను.
వాళ్లలో ఒకడైన తమ్ముడు సత్యం (అసలు పేరు పొట్లూరి సత్యనారాయణ), ‘‘కథ లేకుండా టైటిల్ రిజిష్టర్ చెయ్యడమేంటండీ?’’ అన్నాడు. ‘‘మనసుకేమనిపిస్తే అది చేద్దాం,’’ అని, ‘‘మీలో ఎవరికన్నా ప్రొడక్షన్ అనుభవం ఉంటే బాగుంటుంది. తలకోనలో నా అన్వేషణ సినిమా మొదలవుతుంది,’’ అంటా ఆ తమ్ముడు సత్యంతో, ‘‘నువ్వొస్తావా లొకేషన్‌కి,’’ అన్నాను.
డిస్కస్ చేసుకున్న ముగ్గురూ తమ్ముడ్ని మా లొకేషన్‌కి పంపడానికి డిసైడయ్యేరు. అన్వేషణ సిన్మాకి మొత్తంగానూ, ప్రేమించు పెళ్లాడు సినిమాకి కొంచెంగానూ పనిచేసేడా తమ్ముడు సత్యం. అరకులో ఆలాపన షూట్ జరుగుతా వుంటే వచ్చిన ముగ్గురూ కొత్తగా పరిచయం చేసిన కొత్త రైటరు తనికెళ్ల భరణితో కలిపి మాటాడతా వుండే వారు.ఇప్పట్లా అరకులో గెస్ట్‌హౌసులూ, లాడ్జింగులూ ఆ రోజుల్లో లేవుగాబట్టి రైల్వేస్టేషన్ క్లోక్ రూముల్లాంటి చోట్లా అదీ కాలక్షేపం చేస్తుండే వాళ్ళు రాత్రుళ్లు. ఆ టైములోనే అరకులో ఒక చిన్న టైలరింగ్ షాపు ఓనర్ పేరు నాగమణి అని బోర్డు మీద రాసుంటే అది వై. విజయ కేరెక్టర్‌కి పెట్టేడంట భరణి.
మొత్తం కథ విన్న భరణి ఫ్రెండయిన తల్లావఝల సుందరం ముగ్గురాడోళ్లనీ ఆ అరుగుమీద టైలర్‌గాడు సెడ్యూస్ చెయ్యకుండా వుంటే బాగుంటది అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే అన్నారు వేమూరి సత్యంగారు. షూట్ కోనసీమ అందాల్లో చేద్దాం అనుకుంటే నిర్మాతల్లో ఒకరైన సాయిబాబుగారు వాళ్ల బంధువైన బిక్కిని సీతారాంబాబుగార్ని పరిచయం చేస్తే ఆయన ద్వారా పరిచయమైన అద్భుతమైన వ్యక్తి ముదునూరి అక్కిరాజు.
షూటింగ్ మొత్తం తాటిపాక (జగ్గంపేట) అవతల ఆరోజుల్లో ప్రాసిట్యూట్స్‌కి ఫేమస్ గ్రామమైన మానేపల్లిలో. మా మెయిన్ లొకేషన్ వెనకే వాళ్లంతా వుండే వీధి. రైటర్ భరణి రాత్రంతా కష్టపడి రాసుకొచ్చిన సీన్ అద్భుతంగా ఇంప్రొవైజ్ కాబడి భలే గమ్మత్తుగా పండిపోతుంది. ఆర్డనరీ పాసింగ్ షాట్స్ కూడా హాయిగా నవ్వించేస్తున్నాయి.
వాళ్ల ఇళ్ల ముందు నిలబడి షూటింగ్ చూస్తా నవ్వుతున్న ఆడజనం ఇంకా ఇంకా నవ్వేలా డెవలప్ చేస్తుంటే నా పక్కనే వున్న భరణి చేస్తున్న ఏడింగ్స్ అలా ఇలాగుండటం లేదు. మే నెల గాలి ఏమాత్రం ఆడని మండుటెండల్లో, చెమటలకి చొక్కాలు తడిసి ముద్దవుతున్నా అద్భుతంగా హాస్యం పలికిస్తున్న ఆర్టిస్టుల్ని మర్చిపోలేను. షూట్ చూడ్డానికొచ్చిన ప్రెస్ వాళ్ళెవరో మరాఠీ డైరెక్టర్ దాదా కోండ్కే ఇలాగే చేస్తాడు. హాస్యాన్ని ఇష్టపడే మిత్రజనాన్ని పిలిపించి లొకేషన్లో కూర్చోబెడతాడు.అన్నారు. అంతా వినేసి నవ్వేసిన నేను నా అదృష్టంకొద్దీ నాకీ మానేపల్లి కలిసొచ్చిందను కున్నాను.
కొత్తార్టిస్టుల్తో నాలుగు పాటలు పెట్టి తీసే చిన్న సినిమా ఈ లేడీస్ టైలర్. ఇళయరాజా విపరీతమైన బిజీ అవ్వడం వల్ల మూడు పాటలేరికార్డ్ చెయ్యగలిగేది. నాలుగోది అవ్వలేదు. తిరిగి మద్రాసొచ్చి రికార్డ్ చేసుకుని మళ్లీ ఈ ప్రాంతానికి షూట్ చెయ్యడానికి రావాలంటే తడిసి మోపెడవ్వుద్ది. ఆలోచించిన నేను సైలెంట్‌గానే తీద్దాం అన్న నిర్ణయానికొచ్చేను. అయితే ఈ పాటలో ముగ్గురు హీరోయిన్ల ఇంట్రడక్షనూ హీరో తాలూకు బోల్డు బిజినెన్సూ వున్నాయి. నాలాంటి చిన్నవాడి బడ్జెట్ సినిమా పాటకి మూడురోజులే టైము. సౌండ్ లేని ఈ పాట మూడురోజుల్లోనే పూర్తి చేసెయ్యగలిగేను.
మద్రాసు వెళ్లేకా ఆవేళ నైన్టూ ఒన్ కాల్‌షీట్‌లో పాట రికార్డింగ్ అయ్యింది. వెంటనే మోనో మిక్స్ చేయించి సౌండ్ డెవలప్ చేసేకా పాజిటివ్ ప్రింటేసి రాయపేటలో వున్న మద్రాస్ సినీ లేబ్ ఎడిటింగ్ రూవ్‌ులో కూర్చున్న నేను సౌండ్ లేకండా తీసినా ఆ సాంగ్ షాట్స్ ముందేసుకుని సరిగ్గా గంటన్నరలో ఎడిటింగ్ ఫినిష్ చేసుకుని ప్రసాద్ స్టూడియోకి బయల్దేరేను. ఏదో తమిళ కంపెనీ పాట రికార్డిగ్ జరుగుతుంది. అయిదు నిమిషాలు టైవ్‌ు కావాలని ఇళయరాజాగార్నడిగి పైన ప్రొజక్టర్లో పాట త్రెడ్ చేయించి రన్ చేయించేను. పొద్దుట రికార్డింగయిన ఆ పాట చూస్తున్న ఇళయరాజాగారు పక్కనే వున్న ఎమ్మెస్ విశ్వనాథన్‌గారితో జరిగింది మొత్తం చెప్పేసరికి చాలా థ్రిల్లయ్యేరంతా.
స్టార్ కమేడియన్స్ లేకపోడంతో చాలా పొద్దుటే మొదలెట్టి పొద్దోయేదాకా చేసే షూట్‌లో చాలా ఎక్కువ వర్క్ జరిగేది. ఈ సినిమాలో ప్రదీప్‌శక్తి చేసే వేషం పేరు వెంకటరత్నం. ఎప్పుడో ఎవడో తన చెల్లెలికి అన్యాయం చేసింది గుండెల్లో పెట్టుకున్న ఆ వెంకటరత్నం ఆ వూళ్లో ఎవడు ఏ అమ్మాయి మీదన్నా కన్నేస్తే కన్ను, చెయ్యస్తే చెయ్యి తీసేసే కిరాతకుళ్లా మారిపోయేడు. అలా చేస్తున్నా వెంకటరత్నం వూళ్లో కంటే జైల్లోనే ఎక్కు రోజులు కాపురం వుండి వస్తుంటాడు. ఈ కేరెక్టర్‌కి నాకు ఇన్సిపిరేషన్ మా గురువు భారతీరాజాగారి కలుక్కుళ్ ఈరవ్‌ులో విలన్. ప్రదీప్‌శక్తి చేస్తున్న వెంకటరత్నం కేరెక్టర్ రోజురోజుకీ చాలా గొప్పగా షేపవుతోంది. పొద్దోతే మా యూనిట్లో చాలామంది జనాలు ఆ మానేపల్లి ఆడోళ్ళ ఇళ్లకి వెళ్లి వస్తున్నారు. వీరలక్ష్మిగారింటి అవతల వయొలెట్ కలర్ మేడలో కౌసల్య చాలామందికి తెగ నచ్చేస్తుంది.
ఆవేళ మధ్యాన్నం ఊరి చెరువు పక్కన గుళ్లో షూటింగ్.సీనేంటంటే.... ఆ వూళ్లో గంగరాజు అనేవాడు గౌతమి అనే అమ్మాయిని పాడుచేస్తే అది వెంకటరత్నానికి తెల్సింది. దాంతో గంగరాజుగాడ్ని తీసుకొచ్చి చెట్టుకి కట్టేసి గౌతమిని పిల్చి గంగరాజు ముందు నిలబెట్టి ఆ అమ్మాయిని చూస్తా, ‘‘ నా చెల్లెలు, నా తల్లి కంటే ప్రాణమైన ఈ గౌతమిని పాడుచేస్తావా?’’ అంటా కత్తి తీసుకుని చెరిచిన గంగరాజు చేతులు నరికెయ్యాలి. ‘‘గంగరాజు వేషం ఎవరేస్తారు?’’ అన్నాను.
‘‘మన ప్రొడక్షన్ మేనేజర్ కన్నబాబుకి ఇంట్రస్ట్ వుందంటండి,’’ అన్నాడు తమ్ముడు సత్యం. ‘‘మరా గౌతమి వేషం?’’ అంటున్న నా చెవిలో నిన్న రాత్రి ప్రదీప్‌శక్తి కౌసల్య మేడలోకెళ్లిన మేటర్ ఊదేడు జాయిగా. వెంటనే ఆ కౌసల్యని పిలిపించి చెట్టు కింద నిలబెట్టించేను. మేనేజర్ కన్నబాబుని చెట్టుకి కట్టేయించేను. తర్వాత ప్రదీప్‌శక్తిని పిలిపించి , కత్తి అతని చేతికిచ్చి, ఆ కౌసల్యని చూస్తానే, ‘‘ఏరా... నా ప్రాణమైన నా చెల్లిలాంటి గౌతమిని పాడుచేస్తావా?’’ అన్న డైలాగ్ చెప్పి చెయ్యి నరకాలి, అన్నాను. కౌసల్యని చూస్తున్న ప్రదీప్ నోట్లోంచి డైలాగు రాటం లేదు! ఏ చప్పుడూ లేని యూనిట్ మనుషుల గుండెల్లో గోలే గోల.
ఐదారు రోజుల్నుంచి క్లైమాక్స్ రాత్రీ పగలనక చేస్తున్నాం. కెమెరామేన్ హరి అనుమోలుని పిల్చి, ‘‘ఈ వీధిలో ఆ చివర్నించి ఈ చివరిదాకా కత్తి పట్టుకుని ఆవేశంగా నడుచుకుంటా వస్తుంటాడు వెంకటరత్నం,’’ అన్నాను. విన్న హరి, ‘‘ఫుల్ స్ట్రీట్ లైటర్ చెయ్యాలంటే గంటన్నర పడ్తుంది,’’ అన్నాడు. అప్పటికి రాత్రి పది దాటింది. గత కొన్ని రాత్రులుగా నిద్రలు లేని జనాలు జోగుతున్నారు. వీరవేణిగారి అరుగు మీద కూర్చున్న నేను కళ్లు మూసుకునుంటే లోపల్నుంచొచ్చి, ‘‘అరుగు మీదేంటలా కూర్చున్నారు? లోపలికి రండి,’’ అందా వీరవేణి. వెళ్తే, తన గదిలో పందిరిపట్టి మంచం.నూర్జహాను, కునేగా మరికుళందు సెంట్లు కలగలిసిన వాసన......
‘‘కాస్సేపు దీనిమీద పడుకోండి. మీ హరిగారు రెడీ అని అరిచేకా చెప్తాను అప్పుడె ళ్దురుగాని,’’ అంది వీరవేణి. ‘‘నేను పడుకుంటే నువ్వూ?’’ అన్నాను. ‘‘మంచం పెద్దది కదా నేనీపక్కన సర్దుకుంటాన్లెండి,’’ అంది. ‘‘సరే,’’ అంటా పరుపెక్కిన నా మనసు మనసులో లేదు.నిద్రపోతుందో లేదో తెలీదు గానీ ఆ వీరవేణి చెయ్యీ,కాలూ నామీద పడ్తున్నాయి,వెచ్చటు ఊపిరి నా కంఠం దిగువలో తగుల్తుంటే చాలా బాగా అదేదో గమ్మత్తుగా వుంది. బయట జనరేటర్ ట్రబులివ్వడంతో లైటింగ్ కి అనురున్న టైము కన్నా డబులయ్యింది. అటుపక్క పడుకున్న వీరవేణి ఇటుపక్క తిరిగింది. సందకాడ స్నానం చేసేకా వీరవేణి రాసుకున్న చింతాల్ పౌడర్ వాసన. ‘‘రెడీ రెడీ,’’ అంటున్న హరిగారి మాటలు. గబుక్కున లేచి పరుగెట్టేను.
మొదలెట్టిన టాకీ ఎడిటింగ్ రెండు రోజుల్లో పూర్తి చేసేం. తర్వాత పాటలు అవీ చాలా తక్కువ టైములో పూర్తయింది .ఇంత ఫాస్ట్‌గా ఎడిటింగ్ పూర్తవ్వడానికి కారణమేంటంటే ఏదనుకున్నామో అదే తియ్యడం, ఎంత అనుకున్నామో అంతే తియ్యడం. పాటలన్నీ జాయిన్ చేసేకా చూసుకుంటే పదకొండు వేల అయిదొందలు మాత్రమే వుంది. సినిమా అంటే రెండున్నర గంటలుండాలి. అప్పుడే కడుపునిండా తిని పెరుగన్నంతో భోంచేసినట్టు అని ప్రేమించు పెళ్ళాడు సినిమా అప్పుడు అన్న రామోజీరావుగారి మాట గుర్తొచ్చి కొన్ని కామెడీ సీన్లు ఎగస్ట్రాగా తీద్దాం అనుకుంటే ఇమడటం లేదు. అయినా పేచ్ వర్క్ షెడ్యూలేసి అరుణాచలం స్టూడియోలో కొన్ని పాసింగ్ షాట్సూ, దవ్‌ుని నూతిలో తొయ్యడం లాంటి సీన్లు షూట్ చేసి జాయిన్ చేసేను. అయినా అనుకున్న పన్నెండువేల ఐదొందల అడుగుల లెంగ్త్ రావటంలేదు సినిమా.
ఎగ్మూర్ మ్యూజియవ్‌ు ఎదురుగుండా వున్న సుజాతా థియేటర్లో డబ్బింగ్ మొదలైంది. నవ్వులే నవ్వులు. ఆ డబ్బింగ్‌లో కూడా ఎక్స్‌పెర్‌మెంటల్ ఐడియాలు. డబ్బింగ్ మొత్తం అయ్యేకా సినిమాకో చక్కని షేప్ తెచ్చేక, ఇళయరాజాగారి మ్యూజిక్ ఇన్‌ఛార్జ్ కళ్యాణం చుట్టూ తిరుగుతుంటే క్షణం ఖాళీలేదు పొమ్మంటున్నాడు. రీ రికార్డింగ్ అవ్వని ఆ సినిమానే చాలా ప్రొజక్షన్సేసుకుని చూసుకుంటున్నాం. ఒకరోజు మాతోపాటు సినిమా చూసిన కార్టూనిస్ట్ జయదేవ్‌బాబుగారు ఆండాళ్ థియేటర్లోంచి బయటికొచ్చేకా నవ్వలేక చచ్చిపోయేనన్నారు. ఒక వారంగాదు రెండు వారాలుగాదు, ఒక నెలగాదు రెండు నెలలుగాదు, నాలుగు నెలల తర్వాత దొరికాయి ఇళయరాజాగారి రీ రికార్డింగ్ డేట్స్. ఇనిమా రీ రికార్డింగు, మిక్సింగు అయ్యి ఫస్ట్ కాపీ వచ్చింది. చూసిన నేను 'రీ రికార్డింగ్ కాకుండా చూసిన సినిమానే బాగుంది' అనుకున్నాను. అయితే, ఎవరికీ చెప్పలేదా విషయం. చూస్తున్న బయ్యర్లు బాగుందంటున్నారుగానీ కొనడానికి ముందుకు రాడంలేదు. ఎందుకంటే అన్నీ కొత్త మొకాలు. హీరోయిన్లందరూ వూరిపోయి లావుగా దున్నపోతుల్లాగున్నారు. ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లూ ఒక సీనియర్ నిర్మాతని కల్సినప్పుడు, ‘‘వంశీ బాధితులా?’’ అనడిగేరంటా నిర్మాతగారు.
రోజులు గడుస్తున్నాయి. ఎవరూ కొనని సినిమా స్టేలయిపోయేలాగుంది. చివరికి సాహసం చేసినా యువ నిర్మాతలు ఎలాగా దిగేం ఏమయితే అవుతుందనుకుని సొంతంగా రిలీజ్ చేసేసేరు. ఆవేళ మహాబలిపురం వెళ్లే రోడ్‌లో వున్న శ్యామలా గార్డెన్స్‌లో లాయర్ సుహాసిని సినిమా షూటింగ్. మార్నింగ్ షో, మేట్నీ అయ్యేకా కొత్తగా కొన్న మారుతీ వేనేసుకుని నాదగ్గరకొచ్చిన రవి కిషోర్‌గారు, ‘‘సినిమా హిట్టండీ,’’ అన్నారు. ‘‘ఇవ్వాళ శుక్రవారం... సోమవారం తర్వాత అనుకుందాం హిట్టో కాదో,’’ అన్నాను. ‘‘థియేటర్లో జనం రియాక్షన్స్ మామూలుగా లేవు. అప్పటిదాకా చూడక్కర్లేదు సినిమా హిట్టు,’’ అంటా గట్టిగా మాటాడేస్తున్నారు రవికిషోర్‌గారు. ఎవరో చెప్పేరు, హైదరాబాద్‌లో నైజాం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన సెక్సీ కటౌట్లు చూసిన మహిళా సంఘాల వాళ్లు వాటిని పీకెయ్యడంతో హిట్ రేంజ్ మరింత పెరిగిందని. ఆ సినిమాలో బూతు తప్ప ఏముందనీ, ఏ కథాలేని ఆ సినిమా సినిమానా అని ఇలా రకరకాలుగా మాటాడి దాని హిట్ రేంజ్ ని మరింత, మరింతగా పెంచేసేరు జనం.