కొంతమంది వ్యక్తుల గురించి వర్ణించడానికి వారి సక్సెస్ నే కొలమాణంగా చూడాల్సిన అవసరం లేదు.. సక్సెస్, ఫేయిల్యూర్ లకు అతీతంగా ఉండే వారి వ్యక్తిత్వం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. "వివేక్ కృష్ణ" నిన్నటి నుండి ఈ పేరు మారుమ్రోగి పోతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్న మహేష్ కత్తి గారిని కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సమర్ధవంతంగా ఎదుర్కున్నారని అభిమానులు ఆనందపడుతున్నారు. అతని ప్రశ్నలు నచ్చని వారు కొందరు వివేక్ గారిని విమర్శిస్తున్నారు. అది తప్పా కాదా అనే ఆ డిస్కషన్ లోకి వెళ్ళడం లేదు కాని ఇంతలా సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న వివేక్ గారి గురించి చాలామందికి తెలియదు.. అతని గురించి కాస్త తెలియజేయాలనే ఈ ఆర్టికల్ ఉద్దేశం అంతే కాని మరో ఆలోచన లేదు. (గతంలో మహేష్ కత్తి గారి గురించి కూడా ఇలాంటి ఆర్టికల్ నేనే రాశాను).
వర్మ కంపెనీ నుండి: "తను మాత్రమే కాదు తన శిష్యులను సైతం తనంత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు". వివేక్ గారు వర్మ గారితో దర్శకత్వ శాఖలో పనిచేయకపోయినా కాని వర్మ గారి వర్కింగ్ స్టైల్ చూసి చాలా నేర్చుకున్నారు. అంతకు ముందు వరకు కొన్ని సినిమాలకు పనిచేశారు. వర్మ గారు అప్పలరాజు, దొంగలముఠా చేస్తున్న సమయంలో వివేక్ గారితో పరిచయం ఏర్పడింది. వర్మ గారు ఒక వ్యక్తిని అంచనా వేయడానికి క్వశ్చన్స్ అడిగే అలవాటుంది అలా ఫిల్మ్ మేకింగ్ విషయంలో వివేక్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడం, వర్మ గారికి ఆ సమధానాలు ఎంతగానో నచ్చడంతో వర్మ గారు చేయాల్సిన "బెజవాడ" సినిమాను వివేక్ గారికి అందజేసి దర్శకుడిగా తెలుగువారికి పరిచయం చేశారు.
తాతయ్య గారి నుండి: వివేక్ గారి స్వస్థలం చిత్తూరు జిల్లా పాఖాల. వివేక్ గారికి చిన్నతనం నుండి సినిమాలంటే ప్రేమ కలగడానికి గల ప్రధాన కారణం వారి కుటుంబ నేపధ్యం. 1947 కాలం నుండి తాతయ్య, నాన్న, వివేక్ గారు డిస్ట్రీబ్యూషన్ రంగంలో ఉన్నారు, అదీ కాక వారికి ఓ సొంత థియేటర్ కూడా ఉంది. థియేటర్ లో పడే ప్రతి కొత్త సినిమా ను చూడడం, దానికి ప్రేక్షకుల స్పందన లాంటి ఇతర ఇష్టాలతో ఇండస్ట్రీలోకి రావాలనే కుతూహలం పెరిగింది.
టర్నింగ్ పాయింట్: ఇండస్ట్రీలోకి రావాలని ఉన్నా అందుకు పేరెంట్స్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. అందువల్ల ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం, తర్వాత వ్యాపారం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలోనే జగపతి బాబు గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. వివేక్ గారు సినిమాల గురించి కథల గురించి చెబుతుంటే జగపతి బాబు గారికి ఎంతో ఆశ్చర్యం వేసి "మీరు ఇండస్ట్రీలోకి తప్పక రావాలని ఆహ్వానించారు". కేవలం ఆహ్వానం మాత్రమే కాదు వివేక్ గారికి ఎంతో ఇష్టమైన కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసే అవకాశం అందించారు. వివేక్ గారు కృష్ణవంశీ గారితో ఖడ్గం, శ్రీ ఆంజనేయం సినిమాలకు కలిసి పనిచేశారు.
సింహా, లెజెండ్ రైటర్ గా: ఇద్దరు వ్యక్తులను స్నేహితులగా చేసే శక్తి వారి అభిప్రాయాలకు ఉంది. బోయపాటి శ్రీను గారు వివేక్ గారు డైరెక్టర్స్ కాకముందే మంచి స్నేహితులు. ఆ స్నేహం తోనే సింహా, తులసి, లెజెండ్, జయ జానకి నాయక, కిక్(సురేందర్ రెడ్డి) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా వివేక్ గారు కలిసి పనిచేశారు.
వర్కింగ్ స్టైల్: "శ్రీలక్ష్మీ నీ మనోహర్ చంపినపుడు విజయవాడకు చెడ్డ పేరు వచ్చింది, అయేషా మీరా మరణం తదనంతర పరిణామాల వల్ల విజయవాడకు చెడ్డ పేరు వచ్చింది, చిన్ని నాగ శాంభవి హత్య వల్ల విజయవాడకు చెడ్డ పేరు వచ్చింది" అంతేకాని ఒక సినిమా వల్ల విజయవాడకు చెడ్డ పేరు రాదు.! ఇది బెజవాడ సినిమా సమయంలో షూటింగ్ ను అడ్డుకుంటున్న అందోళనకారలకు చెప్పిన మాటలు. ఆ తర్వాత వాళ్ళే సత్యం తెలుసుకుని షూటింగ్ కు సహకరించారు. బెజవాడ నడిరోడ్డు మీద కత్తులతో వెంబడించి ప్రత్యర్ధులను నరికే సన్నివేశాల దగ్గరి నుండి ఓల్డ్ సిటీలో (ఖడ్గం సినిమా కోసం) అత్యంత సున్నితమైన సన్నివేశాలు చిత్రీకరించే వరకు ఆయన వర్కింగ్ స్టైల్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఖడ్గం సినిమా కోసం సెల్ ఫోన్ బాంబ్ తయారుచేయించడం, నిజమైన తీవ్రవాదులను, పోలీస్ ఆఫీసర్లను కలుసుకోవడం, శ్రీ అంజనేయం సినిమా కోసం నిజమైన క్షుద్రపూజలు చేసే వారిని కలుసుకుని ప్రతీది క్షుణ్ణంగా తీయడం వివేక్ గారి వర్కింగ్ స్టైల్ లో ఓ భాగం.
డ్రీమ్ ప్రాజెక్ట్: వివేక్ గారు బాలకృష్ణ గారితో సింహా, లెజెండ్ సినిమాలకు కలిసి పనిచేయడం వల్ల మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంధర్బంలోనే ఓ అద్భుతమైన కథను బాలకృష్ణ గారికి వివరించడం, కథ బ్రహ్మాండంగా నచ్చడం జరిగిపోయాయి. త్వరలోనే బాలకృష్ణ గారి కాంబినేషన్ లోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది.