ఎవరో ఎందుకండి మా బంధువుల అబ్బాయి నే ఇక్కడ ఒక ఉదాహరణ కింద తీసుకుందాం.. ఒకరోజు దేనికోసమో బాగా ఏడుస్తుంటే ఫోను ఇచ్చి కార్టూన్ వీడియోస్ చూయించాం. అంతే!! ఇక వాడు ఫోను వదలడం లేదు. వాడు అలా సైలెంట్ గా ఉండిపోతే ఇంట్లో సందడే లేదు. పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది.. వీటన్నిటి కన్నా వాడు సమాజాన్ని చూసే దృష్టి మరోరకంగా ఉంటుందనే భయం ఉంది.


మూడు నాలుగు సంవత్సరాల పిల్లల దగ్గరి నుండి 70, 80 వయసులో ఉన్న పెద్దవాళ్ళ వరకు ఫోన్ కు ఎడిక్ట్ అయిపోతున్నారు. పెద్దవారు జీవితం చూశారు, విశ్రాంతి సమయం.. దీనివల్ల అంతగా ఇబ్బంది లేకపోవచ్చు. మరి పిల్లల పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్న నుండే పుట్టుంది "డర్టీ ఫీట్". మీ పిల్లలను వారికి అప్పజెప్తే చాలు.. చిన్నతనంలో మనకు ఫోన్ లేని రోజుల్లో మనం ఆడిన ఆటలు ఇప్పటి పిల్లల చేత ఆడిస్తారు.. పల్లెటూరికి తీసుకువెళ్లి ఎడ్లబండి ఎక్కిస్తారు, వ్యవసాయంపై అవగాహన తెలిసేలా చిన్నపాటి పొలంపనులు చేయిస్తారు.. తాటికొమ్మలతో ఆటలాడిస్తారు.. చెట్లెక్కిస్తారు, లోతుతక్కువగా ఉన్న చెరువులోకి దింపుతారు.. ఇవన్నీ చదువుతున్నందుకు బహుశా మీకు సంతోషం కన్నా ప్రపంచం ఎలా మారిపోయింది అనే ఆలోచన వస్తున్నట్లుంది కదా.. తప్పదు!! మనకు ఎలాగూ సమయం ఉండడం లేదు, మారిన పరిస్థితులకు అనుగుణంగా వారికీ ఒక అవకాశం వచ్చింది, ఇప్పటి పిల్లలకు జీవిత మాధుర్యం తెలుస్తుంది.


అసలెలా స్టార్ట్ అయ్యింది:
ఏడు సంవత్సరాల క్రితం నివేదిత గారి అక్కకొడుక్కి పల్లెటూరిని చూయించాలని తీసుకెళ్లింది. అక్కడ బాబు మిగిలిన రోజుల కంటే ఆనందంగా, ఉత్సాహంగా ప్రవర్తించడంతో అప్పుడే ఇలాంటి స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేస్తే ఇద్దరికి బాగుంటదని ఒక ఏడుగురి పిల్లలతో ట్రయిల్ వేశారు. అసలు సిటీలో చెట్లు ఎక్కడున్నాయి ఎక్కడానికి.? కనీసం పరిగెత్తడానికి కూడా వీలు లేదు ఎట్నుంచి ఏ వెహికిల్ వస్తుందోనని భయం. ఒక్క చోట కూర్చుని ఆడే గేమ్స్ కన్నా పరిగెత్తుతూ ఆడే ఆటలలో ఆ మాజానే వేరు. కొంతమంది పిల్లలకు అసలు పల్లెటూరు అంటే అంతగా అవగాహన కూడా ఉండదు అలాంటి వారికి ఎలా అనిపిస్తుందో అని కంగారు పడ్డారు కానీ అందరి పిల్లలకు ఈ టూర్ విపరీతంగా నచ్చింది.. ఇక అప్పటినుండి బండి వేగం పెరిగిపోయింది.


పల్లెటూరికి వెళదాం..
సిటీలో లేని గొప్ప విషయాలు పల్లెటూర్లల్లో ఉంటాయి. సిటీ తినే పంట పల్లెటూరులోనే పండుతుంది. నగరాల్లో వేసుకునే బట్టలు పల్లెలే నేస్తాయి. పల్లెటూరు ఒక మహా ప్రపంచం, ప్రేమ ఆప్యాయతలు బాధ్యతలతో లోతు నిండిన మహా సముద్రం. పల్లెలోని మనుషుల మాటతీరు, వారు ఎంత ప్రేమగా వరుసలతో పలుకరిస్తారు.? అలాగే తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మా, వామన గుంటలు, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలు ఇలా రెండు రకాలుగా బాల్యాన్ని అందంగా తీర్చి దిద్దడమే డర్టీ ఫీట్ స్టార్టప్ పని. 2012 లో స్టార్ట్ ఐన డర్టీ ఫీట్ ఇప్పటికి ఎన్నో వేలమంది పిల్లలకు భవిషత్ జ్ఞాపకాలను ఇస్తుంది.

