మీరు చదవబోతున్న ప్రశ్నలు సమాధానాలు అన్నీ దైవంతో సంభాషణం అనే పుస్తకం లోనివి. ఈ పుస్తకాన్ని మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు రాశారు. మల్లాది గారు తెలుగు సాహిత్యంలో మొదటి పదిమంది రచయితలలో ఒకరు. ఏ రచయిత రాయలేని సంఖ్యలో రచనలు చేశారు. 3,000 పైగా కథలు, 150 పైగా నవలలు తెలుగువారికి అందించారు. చిన్నప్పుడు పాఠకులు అయితేనే పెద్దయ్యాక రచయిత అవుతాడన్నట్టుగా మల్లాది గారు చిన్నప్పటి నుండే తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఓటు హక్కు వచ్చిన వయసు నుండే రాయడం మొదలుపెట్టారు. మల్లాది గారి గురుంచిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఎలా ఉంటారో ఇప్పటికి తెలియదు!! దాదాపు 48 సంవత్సరాల కాలం నుండి ఆయన ఫోటో ఎక్కడా ప్రచురితం అవ్వలేదు.
రచయిత రచన పాఠకులకు తెలిసి అర్ధమైతే చాలు, అంతే కానీ నేను ఎలా ఉంటానో తెలియాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయం. నేను చాలామందికి తెలిస్తే కనుక స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లలేను, ఊరికనే పార్కులో అలా బల్ల మీద పడుకుని ఆకాశంలో పక్షుల గుంపుని ప్రశాంతంగా చూడలేను.. ఇలాంటి రకరకాల కారణాల వల్ల కూడా ఆయనేవరో తెలియజేయడానికి అంగీకరించలేదు.
కథ నేపధ్యం: ఓ న్యూస్ పేపర్ లో విలేకరిగా దేవర్షి అనే వ్యక్తి పనిచేస్తుంటారు. అనుకోని సంఘటన మూలంగా ఒకరోజు అద్దెకి ఇళ్ళని చూపించే కొన్ని వెబ్ సైట్లలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఓ పదాన్ని టైప్ చేసి ఓ వెబ్ సైట్ యు.ఆర్.ఎల్ ని క్లిక్ చేశాడు. అది తెరుచుకున్న తక్షణం ఆ వెబ్ సైట్లో నుండి మెరిసిన మెరుపుకి గదంతా వింతకాంతి అలుముకుంది. 'నీ సందేహాలు, అనుమానాలు, సంశయాలు, ప్రశ్నలు ఇక్కడ టైప్ చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు' అన్న అక్షరాలు స్క్రీన్ మీద కనిపించాయి. ఇలా దేవర్షి చాలా సందేహాలను నివృత్తి చేసుకొన్నాడు. ఈ పుస్తకంలో ఓ మనిషి దేవుడికి చేసిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులని మీరు చదవచ్చు. ఐతే రచయితకు దేవుడితో పరిచయం ఉండి ఆయన చెప్పిన సమాధానాలు కావివి. ఇది దేవుడితో ఊహాత్మక సంభాషణ మాత్రమే సుమా! జీవితానికి ఉపకరించే, లేదా ఆలోచింప చేసే ఎన్నో ప్రశ్నలకి లౌకిక, ఆధ్యాత్మిక, సామాజిక, కొండొకచో వ్యంగ్య సమాధానాల సమాహారమే ఈ దైవంతో సంభాషణం. కొన్ని సమాధానాలు నర్మగర్భంగా ఉండి లోతుగా ఆలోచిస్తే కాని అర్థం కావు.




























ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యగలరు: Click Here
