మన ఇల్లు అంటే మనం ఉంటున్న ఇల్లు కాదు మన శరీరమే మన ఇల్లు 100 సంవత్సరాలు నివసించే ఇల్లు.. అలాంటి ఇంటిని మనం పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొన్ని పల్లె ప్రాంతాలలో బాలికలకు పీరియడ్స్ వస్తుంటే భయపడుతున్నారు, వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, ఆ రోజుల్లో స్కూళ్ళకు వెళ్లడం లేదు, కొంతమంది పిల్లలైతే పచ్చడి మాత్రమే భోజనంగా స్వీకరిస్తున్నారు.. వీటన్నిటిని తెలుసుకున్న రేచల్, స్వరూప్ దంపతులు పిల్లలలో గూడుకట్టుకున్న భయాలను తొలగిస్తున్నారు.

రేచల్ గారు డాక్టర్. డాక్టర్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. చిన్నప్పుడు తాతయ్య "నువ్వు డాక్టర్ ఐతే పేద ప్రజలందరూ నిన్ను దేవతలా చూస్తారు" అని అన్నారు. ఆ ఒక్క మాటే తనని ఇంతలా ఎదిగేందుకు ఒక మూల కారణమయ్యింది. ఐతే తాను మిగిలిన వారికి దేవతలా కనిపించింది మాత్రం డాక్టర్ పట్టా తీసుకున్నప్పుడు మాత్రం కాదు పిల్లలలో కాన్ఫిడెన్స్ పెంచిన తర్వాత మాత్రమే. స్వరూప్ రేచల్ గారి జీవితాన్ని మాత్రమే పంచుకోలేదు తన ఆశయాన్ని కూడా.
మూడు క్రితం ప్రారంభమైన వీరి సంస్థ 200 మంది సభ్యులతో వేలాది పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలిగారు. వీరేం చేస్తారు.? ముందుగా ఎంచుకున్న స్కూళ్ళకు వెళ్లి పిల్లలతో కలిసి భోజనం చేయడం కలిసి ఆడుకోవడం లాంటివి చేస్తూ వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. పీరియడ్స్ రోజులలో వారి అలవాట్లు ఎలా ఉంటాయి.? ఇంట్లో కానీ బయట కానీ ఎలా ఉంటుంది.. లాంటి విషయాలన్నింటిని తెలుసుకుంటారు. వారి రీసెర్చ్ లో తెలుసుకున్నదాని ప్రకారం పీరియడ్స్ రోజులలో పిల్లలు స్కూల్ కు వెళ్ళరు, ఇంట్లో ఒంటరిగా ఉంటారు, భోజనం కూడా కేవలం పచ్చడితో మాత్రమే చేస్తుంటారు. ఇలా వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా తగ్గుతున్నాయి. దీని ప్రకారం పిల్లలతో, టీచర్లతో అలాగే తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వీటి మీద విస్తృతంగా చర్చించి వారిలో పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తారు.

ఈ Healing Training Foundation కు అవసరమయ్యే నిధులు దాతల దగ్గరి నుండి తీసుకోవడంతో పాటు రేచల్ గారు హాస్పిటల్ లొనే ఎక్కువ సమయం పనిచేసి సంపాదించిన జీతాన్ని దీనికోసం వెచ్చిస్తుంటారు. వీరు చేస్తున్న మరికొన్ని అతిముఖ్యమైనవి సెల్ఫ్ డిఫెన్స్, మహిళల వ్యక్తిగత శుభ్రత, అలాగే ఐ చెకప్, హెల్త్ చెకప్ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.


