"నిజాం, దొరల సామ్రాజ్యం" అనే మహా సముద్రాన్ని ఆవిరి చేసేయ్యడానికి ఒక్కో నిప్పుకణం ఏక మవుతున్న రోజులవి. జరుగబోయే కీడు ముందే తెలిస్తే భయం ఇప్పుడే పుడుతుంది. నిజాం సామ్రాజ్యంపై మనం యుద్ధం చేయగలమా చేసి గెలవగలమా అసలు బ్రతకగలమా..? ఇలాంటి ఆందోళనకర పరిస్థితులలో దొడ్డి కొమరయ్య ఆ చీకటి సమూహంలో ఉదయించాడు.. "మీరందరూ ఒక్కటైతే దొర ఏం జేస్తడు!! బాన్చన్ నీ కాల్మొక్తా అంటే దొర కొడుక్కి నీ కొడుకు బానిస ఐతడు, వాడి మనవడికి నీ మనవడు బానిసైతడు!! నువ్వు లే.. తిరగబడు నీ వంశాన్ని కాపాడుకో ఆ శక్తి నీలోనే ఉంది ఇప్పుడే పోరాడు" అంటూ దొడ్డి కొమరయ్య గారు విప్లవాత్మకంగా తానొక్కడే యుద్ధం చేయకుండా ఆ యుద్ధంలో ప్రజలను సైతం భాగం చేసి పోరాట యోధులను తయారుచేసిన గొప్ప ధీశాలి.
వరంగల్ జిల్లాలోని కడవెండి అనే గ్రామంలో 1927లో ఈ సాయుధ రైతాంగ వీరుడు జన్మించారు. ఏ దొర పుట్టుకతో వేల ఎకరాలతో పుట్టలేదు పోయేటప్పుడు పట్టుకపోడు కాని ఆ రోజుల్లో జమిందార్లు, భూ స్వాములు వేల ఎకరాలు ఆక్రమించుకుని పేదలను అందులో పాలెర్లుగా నియమించుకుని సంవత్సరాల తరబడి వెట్టి చాకిరి బలవంతంగా చేయించేవారు. ఇది దశాబ్ధాల తరబడి జరుగుతూ వచ్చింది దొరగా పుట్టడం మా అదృష్టం, బానిసగా పుట్టడం మీ దౌర్భగ్యం నోరు ఎత్తకుండా పనిచేయండి అని దొరలు శ్రామికుల మీద దాడి చేసేవారు.
నిజాం పాలనలో పటేల్, పట్వారి, జమీందారి వ్యవస్థలుండేవి. నిజాం రాజులు నిర్ణయించిన పన్నలను దేశ్ ముఖ్, దేశ్ పాండేలు వసూలు చేసేవారు. భూమి శిస్తు కింద రైతులు పండించిన పంటలో సగం పంటను నిర్ధాక్షిణ్యంగా లాక్కునేవారు, లేదంటే భూమినే స్వాధీనం చేసుకునేవారు అక్కడ ఇదే చట్టం. నిజాం పాలనలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండేదంటే ఆఖరికి దొరల ఇంట్లో ఎవరైనా పుట్టినా, చచ్చినా పన్నులు వసూలు చేసే అతి నీచపు సాంప్రదాయం అమలులో ఉండేవి. ఓ పిల్లిని రూంలో వేసి నాలుగు తన్నితే అది కాసేపటి బెబ్బులిలా తిరగబడి పోరాడుతుంది అలాంటి పరిస్థితే ఇక్కడా జరిగింది.
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అరాచకాలను తెలంగాణ నుండి తరిమికొట్టాలని ఈ ప్రాంతంలోని శ్రామికులు సంఘాలుగా ఏర్పడి పోరాడడం మొదలుపెట్టారు. ఆర్ధిక బలం, మేధ బలం లేని ఆ శ్రామికిలకు అన్నీ తానై అండగా నిలబడ్డారు. ఈ ఉద్యమంలో భాగంగానే దొడ్డికొమరయ్య గారు శ్రామికులను ఏకం చేసి ఓ నాయకునిగా దొరలపై పోరాటానికి కదిలారు. దొర రామచంద్రా రెడ్డి 60 గ్రామాలను తన ఆధిపత్యంలో ఉంచుకుని పరమ కిరాతకంగా వ్యవహరించేవారు. అతని తల్లి భూస్వామి జానకి కూడా ఓ కలియుగపు రాక్షసి. ఆ గ్రామంలోని పంటపోలాలన్ని తన పేరుమీదనే రాయించుకున్నది. ఈ రాక్షసుల మీద పోరాటం చేస్తున్న సమయంలో దొరల తుపాకి గుండుకు దొడ్డి కొమరయ్య గారు నేలకు ఓరిగారు. వీరులు చచ్చినా పోరాటం ఆగదు వారు ఛిందించిన రక్తం భూమి మీదనే పడుతుందిగా ఆ త్యాగమే మరెందరో వీరులకు జన్మనిస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు.. ఆయన ప్రాణ త్యాగం వృధా కాలేదు.. ఆయన చావు వల్ల ఉద్యమం మరింత రాజుకున్నది. కొమరయ్య గారి మరణానికి ప్రతీకారంగా ఈ దొర వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా దాడులు జరిగాయి.
శ్రామికులు ఏకమయ్యి రామచంద్ర దోర గడిని కూల్చి పారేశారు. అలా దాదాపు 5సంవత్సరాల పాటు నిరాటంకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో ఈ ఉద్యమమే మరింత విస్తరించింది, దొరల భూములను స్వాధీనం చేసుకుని ఎర్రజెండాలను పాతి లక్షల ఎకరాలను శ్రామికులకు అందజేశారు. అన్యాయం ఉన్న ప్రతి చోట ఓ నాయకుడు పుడతాడు. నిజమైన నాయకుడు ప్రాణత్యాగం చేసినా ఆయన కలలు కన్న సామ్రాజ్యం తప్పక అనుచరుల వల్ల నెరవేరుతుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ సంతోషానికి, మన ఉజ్వల భవిషత్తుకు నిన్నటి అమరులు కారణం వారు అందజేసిన స్పూర్తిని మనము అందుకొని దేశాన్ని మరింత ముందుకు నడుపుదాం ఇదే మనం వారికి ఇచ్చే నిజమైన నివాలి ఇంక్విలాబ్ జిందాబాద్!!