ఇదేంటి తిన్నా తినకపోయినా డబ్బులెందుకు కట్టాలి అని అనుకుంటున్నారా.. అవును ఈ ఫుడ్ కోర్ట్ లో మాత్రం అంతే. ఈ విషయం తెలుసుకునబోయేముందు మరో విషయం దీనికంటే ముందుగా తెలుసుకోవాలి. ఈ మధ్య జరిగిన ఓ సర్వేలో కఠిన వాస్తవం తేటతెల్లమయ్యింది.. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్షరాల 50,000 కోట్ల ఆహారం వృధా అవుతుందట. మరో విషయం ఏంటంటే దాదాపు 60% శాతానికి పైగా పేదలున్న మన దేశంలో ఇంతటి స్థాయిలో ఆహారం వృధా అవ్వడం మన నిర్లక్ష్యానికి ప్రథమ ఉదాహరణ..
మన వాళ్ళు "అయ్యా బాబు అన్నం వృధా చేయకండి అంటే వినరు, నా దగ్గిర డబ్బుంది నువ్వెంటి నాకు చెప్పేదనుకుంటారు. ఇలాంటి వారి ఆగడాలు కేదార్ గారి ఫుడ్ సెంటర్ లో సాగవు. కస్టమర్స్ ఎంతయితే ఆర్డర్ పెట్టారో ఆ ఫుడ్ అంతా తినాల్సి ఉంటుంది మిగిలిస్తే మాత్రం డబుల్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
బాల్యంలో వరంగల్ కు చెందిన లింగాల కేదార్ గారు తోటి మిత్రులతో కలిసి ఆటలాడేవారు. అందులోనే భోజనం వండుకోవడం కూడా ఒకటి. అదంతా చిన్న పాత్రలలోనే వండుకునేవారు. ఇలా ఆడుకుంటూనే వయసు పెరుగుతున్న కొద్ది ఓ మంచి ఫుడ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన కూడా పెరిగింది. అప్పుడప్పుడే వరంగల్ సిటీ అభివృద్ధి మొదలవ్వడంతో ఇదే మంచి సందర్భమని భావించి 30 సంవత్సరాల క్రితం ఈ ఫుడ్ సెంటర్ ను మొదలుపెట్టారు.
కేదార్ గారి ఫుడ్ కోర్ట్ లో అడుగుపెట్టగానే ఆత్మీయుల ఇంటికి వెళుతున్నటువంటి అనుభూతికి లోనవుతుంటారు కస్టమర్స్.. వడ్డించేవారి ప్రవర్తన, వడ్డించిన భోజనం కూడా మన ఇంట్లో వండినంత కమ్మగా ఉంటుంది. మీకు కావాల్సినంత వరకు మొహమాటపడకుండా తినండి అంతేకాని ఆహారాన్ని వృధా చేస్తే మాత్రం ఫైన్ కట్టాల్సిందే.!!
ఫైన్ అనగానే "ఆ ఎదో భయపెట్టడానికి అలా అందరు చెప్తుంటారులే, ఎంతమందిని చూడలేదు" అని అనుకుంటే మాత్రం ఇక అంతే సంగతులు.. "మీకు భోజనం నచ్చక వదిలేస్తే నాకు చెప్పండి, నేనే తిరిగి మీకు డబ్బులు చెల్లిస్తాను" అంతేకాని ఆహారం మిగిలిస్తే మాత్రం ఫైన్ ఖచ్చితంగా వసూలు చేసి తీరుతారు అందులో రాజీపడే సమస్యే లేదు. ఇలా ఫైన్ ద్వారా వసూలు చేసిన డబ్బుతో పాటు, తాను మరికొంత కలిపి సేవ కార్యక్రమాలు చేయడం వరంగల్ వాసులందరికి తెలిసిన విషయమే..
ఆహారం మిగిలిస్తే ఫైన కట్టాల్సి ఉంటుందనే నిబంధనను మొదట చాలామంది వ్యతిరేకిత్తించారు, కాని కేదార్ గారు వెనుకడుగు వేయలేదు. సామాన్యుల దగ్గిరినుండి పోలీసులు, జడ్జీలు, పేరుగల నాయకులు ఇలా ఎవరు మిగిల్చినా కూడా కేదార్ గారు అస్సలు క్షమించరు. కేదార్ గారు మాత్రమే కాదండి ఇక్కడ భోజనం చేసే తోటి కస్టమర్లు కూడా కేదార్ గారికి సపోర్ట్ చేస్తారు. కొంతమంది కేవలం డబ్బు సంపాదించడం కోసం హోటల్స్ నడుపుతారు, కేదార్ గారు మాత్రం అతితక్కువ లాభంతో ప్రజల ఆకలి తీర్చాలని ఈ ఫుడ్ కోర్ట్ నడుపుతున్నారు. మిగిలిన హోటల్స్ కన్నా ఇక్కడే తక్కువ ధరలో రుచికరమైన భోజనం లభిస్తుంది.
కేదార్ గారి మనస్తత్వం సున్నితమైనది ఆకలితో ఎవ్వరు కనిపించిన ఆయన చూస్తూ ఉండలేరు. పేదలు, డబ్బుతక్కువున్న వారికి సైతం ఈ ఫుడ్ కోర్ట్ లో కడుపునిండా భోజనం దొరుకుతుంది. వరంగల్ వేదికగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న దశలో ప్రతిరోజు 10,000 రూపాయల భోజనాన్ని ఉద్యమ కారులకు ఉచితంగా వడ్డించారు.
మన భారతీయులలో క్షమించే గుణం ఎక్కువ ఉండడం వల్ల ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరూ నిక్కచ్చిగా ఉంటే మాత్రం చేసిన తప్పు మరోసారి రిపీట్ అవ్వదు. ఇక్కడ ఒక్కసారి భోజనం వృధా చేసి ఫైన్ వేయుంచుకున్న వాళ్ళు బయట, వారి ఇంట్లో కూడా వృధా చేయకపోవడం అది ఒక అలవాటుగా మారడం అనేది సమాజానికి ఎంతో మేలు.