ఈ గుడి కాకినాడ నుండి 32కిలో మీటర్ల దూరంలో ఉన్నది. పూర్వం ఇదే చోట దక్షుడు అనే ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి తన కూతురు, పరమేశ్వరుని భార్య ఐన సతీదేవి కూడా వస్తుంది. తనని కాదని పెళ్లి చేసుకున్నందుకు దక్షుడు శివుడిని విచక్షణ రహితంగా దుషించడంతో మనస్తాపంతో సతీదేవి తనని తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. అది చూసి కోపొద్రేకంతో శివుడు వీరభద్రుడి ద్వారా దక్షుడి సామ్రాజ్యాన్ని నాశనం చేశారని ఒక పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షుడు ఇక్కడే యజ్ఞం చేయడం వలన మొదట ఈ ఊరిని దక్షవాటికగా ఆ తర్వాత దాక్షరామంగా పిలిచేవారు ఆ తర్వాత కాలక్రమంలో ద్రాక్షారామంగా పిలువబడుచున్నది.
ఇక్కడ శివుడు భీమేశ్వరునిగా దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి వారు స్వయంభూ గా వెలిశారని భక్తుల నమ్మకం. ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాలలోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటి. దీనిని 9వ శతాబ్ధంలో తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా ఇక్కడ ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశిగా పిలుస్తారు. ఒకానొక కాలంలో వింద్యపర్వతం ఆకాశాన్ని అందుకునేంతలా పెరిగి సూర్యుని గమనానికి అడ్డుతగిలిందట అప్పుడు అగస్త్య మహర్షి ఆ వింద్య పర్వత పొగరుని అణిచి కాశి నుండి ద్రాక్షారామానికి వచ్చి ఇక్కడి గోదావరి నదిలో స్నానమాచరించి ఇక్కడి భీమేశ్వరుని సేవించారట ఇక అప్పటి నుండి ద్రాక్షారామాన్ని దక్షిణకాశిగా పరిగణించబడుతున్నారు.
ఈ ఆలయంలో వందల సంవత్సరాల నుండి విప్లవాత్మక మార్పులు చేయకపోవడంతో ఇప్పటికి నాటి చరిత్రకు, సాంప్రదాయాలకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు తాము అత్యంత మహిమాన్వితమైన ప్రాచీన దేవాలయంలోకి ప్రవేశించామన్న అనుభూతికి లోనవుతారు. ఇక్కడి గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తారు. ఇలా పిలవడానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. స్వయంభూ గా వెలసిన స్వామి వారిని నిత్యం అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని ఇక్కడికి తీసుకువచ్చారట. అందువలన ఈ గోదావరిని 'సప్త గోదావరి' అని పిలుస్తారు.