పండుగ అంటే ఒక సంతోషం, ఆ సంతోషానికి కారణాన్ని గుర్తుచేసుకుని స్ఫూర్తిపొందడం. చిన్నపుడు దసరా అంటే ఒక పది రోజులు బడి కి సెలవు ఇచ్చే పండుగ . ఈటీవీ లో మాయబజార్ , మిస్సమ్మ, గుండమ్మకథ, నర్తనశాల వేసేవారు. జెమినీ, మా టివి, జీ లో ఏవో కొత్త సినిమా లు వేసే వాళ్ళు అవి చూస్తూ , వీలైతే బయటకి వెళ్లి, ఎంజాయ్ చేసి చివరి రోజు ఏవైనా హోంవర్క్ ఇస్తే అవి చేసుకునే వాళ్ళం. కొంచెం పెద్దయ్యాక ఇంటర్ కి వచ్చాక పదిరోజుల సెలవు కాస్త మూడు రోజులయ్యింది. అందులో ఒక రోజు సండే అయ్యేది.ఇంటర్ దాటి డిగ్రీ వచ్చాక పండగ కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఒక సీజన్ అయిపొయింది. టికెట్స్, సినిమా చూసే హడావిడిలో పడిపోతాం పండుగ అనే సంగతి అమ్మ తిట్టే వరకు పట్టించుకోము. కానీ అసలు ఈ పండగ ముఖ్య కారణం ఏంటి? అనే ప్రశ్నకి సమాధానం మన దగ్గర వెంటనే దొరకదు.
మహిషారుడికి బ్రహ్మ వరం:
దసరా, శరన్నవరాత్రులను, శివుని అర్థాంగి అగు పార్వతి శక్తీ రూపిణి గా మహిషాసుర సంహారం జరిపినందుకు జరుపుకుంటారు. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ప్రస్తుతం మైసూరుని ని పాలిస్తూండేవాడు. అతను బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి నాకు అమరత్వం కావాలని కోరాడు. అది సాధ్యపడదని బ్రహ్మ తెలుపగా.. స్త్రీ ని ఓడించడం సులువని అహం తో, మగ, మృగ , దేవతల ద్వారా నాకు మరణం వాటిల్ల కూడదని వరం కోరుతాడు. బ్రహ్మ, స్త్రీ ద్వారా తప్ప మరి ఏ విధంగా నీకు మరణం సంభవించిందని వరమిస్తారు.
దుర్గ దేవి ఆవిర్భావం:
బ్రహ్మ వరం పొందినప్పటి నుండి మహిషాసురుని అకృత్యాలకు అడ్డు ఉండదు, దేవతలకు రాజు అగు ఇంద్రుడిని సైతం ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. అప్పుడు త్రిమూర్తులు , దేవతలందరు కలిసి లక్ష్మి , సరస్వతి, పార్వతుల అంశగు దుర్గ దేవి ని అవతరింపజెసి తమ శక్తులని, ఆయుధాల్ని ఇస్తారు. మహిషాసురుడు వివిధ రూపాలుగా మారుతుంటే దుర్గమాత సైతం 9 రోజులు 9 రూపాలతో ఆ రాక్షసుడితో తలపడి చివరి రోజైన విజయదశమి నాడు సంహారం చేసి ఆరోజు నుండి మహిషాసురమర్ధిని గా అందరి పూజలు అందుకుంటుంది.
మహిషాసురమర్దనం నేర్పింది ఏమిటి?:
అమరుడిలా వరం పొందిన మహిషాసురుడు చెడు పనులు చేసి హతమయ్యాడు. మార్కండేయుడు అల్పాయుష్షు తో పుట్టిన కానీ తన భక్తితో శివుడ్ని మెప్పించి మృత్యుంజేయుడు అయ్యాడు. మంచి గుణం శాపాన్ని వరం చేయగలదు. అహం, దుర్గుణం వరాన్ని కూడా శాపంగా మార్చగలదు.
ఆయుధ పూజ విశిష్టత:
దసరా లో ఆయుధ పూజ చేస్తారు. యుద్ధం చేసిన వాడికి కత్తి ఆయుధం. రచయితలకి కలం ఆయుధం. సాఫ్ట్ వేర్ వాళ్లకి లాప్ టాప్స్ ఆయుధం, మనకోసం మనం ఎంత కష్టపడుతున్నామో మన పనిముట్లు కూడా అంతే కష్టపడతాయి. మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనతో కొన్నేళ్లు ఉంటాయి. లేదా కొన్ని రోజులుండి ఫస్సక్ అవుతాయి. We should give some respect to our working companions. అర్జునుడు అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు కౌరవులతో యుద్ధం చేయవలిసి వస్తే తన ఆయుధం అయినా గాండీవానికి పూజ చేసి అజ్ఞాతం నుండి బయటకి వచ్చి భీష్ముడు లాంటి యోధులున్న 100,000 ల సైన్యం తో తలపడి విజయం సాధించారు. ప్రాణం లేని వస్తువులు మన ప్రాణాధారాలు అవుతున్నాయనే విషయాన్నీ గుర్తుచేస్తుంది ఈ పండుగ.
దసరా నేర్పింది ఏమిటి?:
దుర్గ దేవి అవతరిస్తున్నపుడు దేవతలందరు తమ తమ శక్తులని ఇచ్చి ఆమెని శక్తి స్వరూపిణి ని చేశారు . నేటి పరిస్థితుల లో మన మధ్య ఒక్కడు కాదు ఎంతో మంది ఉన్నారు మహిషాసురులు. స్త్రీ తను ఇంతకాలం భరిస్తున్న వేధింపులను బాధలను బయటపెడుతోంది. తను ఎదురుకుంటున్న సమస్యల పై పోరాడుతోంది. మనం కూడా వాళ్లకి బలాన్ని ఇవ్వాలి. బలం అంటే ఆయుధాలు కాదు. కాస్త ప్రేమ , గౌరవం, నమ్మకం. ప్రేమిద్దాం, గౌరవిద్దాం, గెలిపిద్దాం.