"జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అంటే మనం పుట్టి పెరిగిన వూరు స్వర్గం తో సమానం .కన్నతల్లి మీద పుట్టి పెరిగిన ఊరు మీద మమకారం మన కట్టె కలే వరకు మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. మనం ఎన్ని దేశవిదేశాల్లో తిరిగిన ఒక్క సారి ఊరుని తలచుకుంటే చాలు ఎన్నో మధుర స్మృతులు కళ్ళముందు కదులుతుంటాయి.. నా పేరు రాజ్ నాకు అందరిలానే నా ఊరి గొప్పలను పంచుకోవాలి అని ఉంటుంది . పిజ్జా లు తింటూ బ్రతికే మన జీవితాలకి పప్పు ఆవకాయ రుచులు గురించి కధల్లో చదువుకోటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. అందుకే ఈ సారి దసరాకి అందరం మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. కుర్రోళ్ళం కదా అనుకుందే తడవుగా ఎయిర్ బస్సు లు మారి ఎర్ర బస్సు ఎక్కాం.
కూరగాయల, పువ్వులు బస్తాలు , కాలేజీ పిల్లలు, తోటీ పూర్తి గా నిండి పోయింది. ఎవరో మహానుభావులు మేక పిల్లలిని , కోడి పెట్టలిని కూడా ఆ బస్సు లో కి ఎక్కించెసారు.అబ్బా సందడి మొదలైయింది . ఫీల్- డిసెన్సి-పర్ఫెక్షన్ అని సిటీ ముసుగులో ఇన్నాళ్ళు మేము మిస్ అయిన ఊర నాటుతనం బయటకి వస్తుంది. బాబాయి , అక్క , పిన్ని ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో సంబంధం కలుపుకుంటూ ప్రేమ గా మాట్లాడుకుంటున్నారు. “ఏరా అబ్బాయి ఏ ఊరు మనది ? ” అంటూ పక్కన తాత పలకరించాడు "తాల్లూరు తాత ” "ఎవరి తాలుకా ? ” "కోటేశ్వర రావు గారి మనవడిని ” "ఓరోరి మా కోళ్ళ ఫారం కోటేశ్వరావు గారి మనవడివా ?? ” "అవును తాత పండక్కి వచ్చా” "ఎప్పుడో చిన్నపుడు చూసా .. చానా పెద్దోడివి అయిపోయావ్ ”
పచ్చని పొలాలు , కన్నుల విందుగా ప్రవహిస్తున్న కృష్ణమ్మా .. పచ్చిక మేస్తున్న పశువులు , గోడల మీద పిడకలు , 15 సంవత్సరాల తర్వాత నేను నా ఊరిలొ అడుగు పెడుతున్నాను . మండే ఎండాకాలంలో ఊహించని తొలకరి నన్ను పలకరించింది. నాతో వచ్చిన నా స్నేహితులకి ఇదంతా ఏదో కొత్త ప్రపంచం లా ఉంది , అంతా కొత్తగా .. వీదుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే నేను గుర్తుపట్టలేనంత కొత్తగా మా ఊరు ఉంది .. పూరి గుడిస నుంచి పక్క ఇళ్ళ వరకు అబివృద్ది చెందింది.బిల్లం కోడు నుంచి psp ల దాక ఎదిగింది. అలా అలలా తేలిపోతున్నట్టు ఉంది ఆ కమ్మని పిల్ల గాలి తాకుతుంటే.
ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది బాబాయి హోటల్ నుండి పాతపాటలు ఇంకా అలానే వస్తున్నాయి ముసలి మూకల బాత కాణి కూడా మారలేదు . అలా పల్లెటూరి ప్రకృతి ని ఆస్వాదిస్తూ పచ్చని కప్పుతో ఉన్న మా ఇల్లు చేరుకున్నాము. ఎన్నో జ్ఞాపకాలు ఇంకెన్నో మధుర క్షణాలు చిన్ననాటి చిలిపి చేష్టలు , అల్లరి పనులు అన్ని కళ్ళ ముందు తేలి ఆడుతున్నాయి. ఇంట్లో తాత బామ్మాల పలకరింపులు అత్తా మామల కుశల ప్రశ్నలు మరదలి పిల్ల కొంటె చూపులు అంతకుమించి బామ్మా చేతి పప్పు ఆవకాయ గోరుముద్దలు. ప్రయాణం చేసిన అలక తో నిద్ర ముంచుకొస్తుంది. అంతలో సుబ్బిగాడు ఇంటికి వచ్చాడు.
” ఒరేయ్ సుబ్బి గా మావిడి తోరణాలు తెస్తా అన్నావ్ కదరా ?” ” తేస్తానే ముందు మా రాజు గాడు ఏడి ? ” “ఇప్పుడే నడుం వాల్చాడు పైన పడక గది లో ఉన్నాడు ” “ఒసేయ్ బామ్మా బావ పడుకుంటే ఈ యదవనెందుకు పంపుతావ్ అసలే అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయుంటాడు” “ఓయమ్మో ఎంత ప్రేమో ???”
ఇప్పటివరకు ఎంతో ప్రశాంతం గా ఉన్న ఇంటికి సుబ్బిగాడి రాక తో కంపు కంపు అయ్యింది .. తలుపుల్ని దడేల్ అనుకుంటూ తీసి నన్ను బయటకి పట్టుకు పోయాడు. “ఒరేయ్ సుబ్బి నాకు చెట్టు ఎక్కటం రాదు రా ” “మాకు మాత్రం వచ్చా ఏంటి అందుకే నిచ్చన తెచ్చాం ” ఇద్దరం కలసి పండక్కి కావాల్సిని సామానులు తీసుకెళ్ళాం.ఎన్నో ఏళ్ళగా నేను మిస్ అయ్యిన ఆ పచ్చదనం , నా తెలుగుదనం ని మనస్పూర్తి గా ఆస్వాదిస్తున్నా.దేవుడ్ని పూజించే పూలనే పూజించటమే మన బతుకమ్మ పండుగ . ఊరిలో ఉన్న ఆడవాలందరు కలిసి , బతుకుమ్మ చుట్టు పాటలు పాడుతూ ఆడుతున్నారు . చిన్న పిల్లలు అరుగుల మీద కూర్చొని అమ్మమ్మలు చేసిన మురుకులు తింటూ అది చూస్తున్నారు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని ఈ బిజీ జీవితాల్లో, నలుగురు కలిసి ఆలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో తప్ప దాన్ని బహుశా ఈ జనరేషన్ పిల్లలు చూసి ఉండరేమో.
రాత్రి అయ్యింది. అమ్మ చేతి గోరుముద్దలు తిని, తాతకి మాత్రలు ఇచ్చి, చిట్టి మరదలికి ఒక ముద్దు ఇచ్చి, అమ్మమ్మ ఒడిలో వాలిపోయి అలా నిద్రలోకి జారుకున్న. ఇంకా ఏం చూస్తున్నారు , మిమ్మల్ని కూడా మీ పల్లె పిలుస్తుంది . మరి ప్రయాణానికి సిద్దం కండి.
*** సర్వే జనా సుఖినోభవంతు ***