సముద్రానికి మనసుంటే ….
(Contributed by N.V.P. Sai Ram)రోజూ లాగే ఇవాళ కూడా సూర్యుడు నాకు దగ్గరగా వచ్చే సమయం అయింది..అదేనండి .. సాయంత్రం అయింది . పక్షుల కిలకిలారావాలు, నా ఆత్మీయుల కబుర్లు, తీరం తో నేను ఆడుకునే ఆటలు అన్నీ రొజూ లాగానే సాగిపోతున్నాయి . కాని మనసులో గుబులు గా ఉంది . నేను ఎవరి గురించైతే ఎదురుచుస్తానో .. వాళ్ళు మాత్రం వారం రోజుల నుంచి ఎక్కడా కనిపించట్లేదు ..
నేను ఎన్నో ప్రేమ జంటలకి ఆతిథ్యం ఇచ్చినా ..ఒక అబ్బాయి అమ్మాయి మాత్రం నా దృష్టిని ఆకర్షించేవాళ్ళు . నేను ఎలాగైతే నా పరిధి తెలుసుకుని తీరానికి వెలుపలే ప్రవహిస్తానో .. సరిగ్గా అలాగే, ఒకరితో ఒకరు ఎంతో గౌరవం ఇచ్చి పుచ్చుకునేవారు .. ఒకరిని ఒకరు మీరు అని సంభోది౦చుకునేవారు .. ఇసుక మీద వాళ్ళ ఇద్దరి అడుగుల మధ్య గౌరవప్రదమైన దూరం కలిగి ఉండడం వల్ల అనుకుంట .. నేను వాటిని తాకగానే వెంటనే పసిగాట్టేదానిని .. ఒకరి అభిప్రాయలు ఒకరు గౌరవించుకుంటూ .. ఒకరి వ్యక్తిత్వం మీద ఇంకొకరికి ఎంతో అభిమానం కలిగి ఉండేవాళ్ళు .. "నువ్వే నా ప్రాణం " అని ఎవ్వరు ఎప్పుడు అనుకోలేదు .. కానీ ఇద్దరిలో ఎవరు ముందు వచ్చినా తన తోడు కోసం ఎదురు చూసే ఎదురుచూపులు చూసిన నాకు .. ఒకళ్ళు విడిచి ఇంకొకళ్ళు ఉండలేరేమో అనిపించేది .. కాని ఎందుకు వారం రోజుల నుంచి కనపడట్లేదు .. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇష్టాలని గౌరవించలేదా ? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ? ఇలా ఎన్నో రకాలుగా నా మనసు పరుగులు తీయసాగింది ..
......................... ఇవాళిటికి సరిగ్గా రెండు ఏళ్ళు గడిచాయి వాళ్ళు కనిపించక .. వాళ్ళని తలుచుకోని రోజు లేదు .. మర్చిపోయిన పూట లేదు .. అయినా సరే నా జీవనం కొనసాగుతోంది .. కొన్ని సార్లు చిన్న పిల్లలతో ఆడుకోవడం తో ఆ జ్ఞాపకాలని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను .. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే .. పున్నమి రోజు నా పైన కొలువుదీరే జాబిలి లాగ ఎంత ముద్దుగా ఉందో ఈ చిన్నారి పాప .. నాతో ఎంతో ఆనందంగా ఆడుతోంది .. తను బంతి ని దూరం గ విసరడం .. నేను పరుగు పరుగున వెళ్లి నా అలల చేతులతో తిరిగి తనకి ఇవ్వడం .. చిన్నారి ముఖం లో కేరింతలు కొడుతున్న ఆనందం చూసి నేను మురుసిపోవడం .. ఎంత ఆహ్లాదం గా ఉందో .. ఇంతలో "సరయూ" అని దూరం గా పిలుపు వినిపించింది .. నాతో ఆడుకుంటున్న పాప పరుగు పరుగున వెళ్లి అమ్మా నాన్నల భుజాల పైకి ఎక్కింది .. తన అమ్మా నాన్నలని చూడగానే ఏళ్ళ ముందు జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయి .. నేను ఎవరి గురి౦చి అయితే రోజూ ఆలోచిస్తూ ఉంటానో .. అదే అబ్బాయి అమ్మాయి .. జంట గా మారి ఈ చిట్టి తల్లికి అమ్మా నాన్నలు అయ్యారు .. కుటుంబ సమేతంగా నన్ను చూడడానికి వచ్చారు .. వాళ్ళ ఎన్నో జ్ఞాపకాలకి నేను సాక్షిగా నిలిచినందుకు కాబోలు "సరయూ" అని నా పేరే పెట్టుకున్నారు వాళ్ళ గారాల పట్టికి .. ఆనందం తో నా కళ్ళు చమర్చాయి .. తనువంతా నీరు కలిగి ఉంటాను కదా .. నా కళ్ళ వెంట ఆనంద ధారని ఎవ్వరు చూసి ఉండరులే .........!!