ఎవ్వరికైనా రేపటి గురించి ఆశ, నిన్నటి గురించి ఆవేదన, ఈ రోజు గురించి ఆరాటం ఉంటుంది. అలా కాకుండా ప్రతి రోజూ ఒకేలా...తూర్పున ఉదయించిన సూర్యుడు పడమటిన అస్తమించటం చూస్తుండటం తప్ప ఏమి చేయలేని కాలం అది. ఆశ లేని బతుకు, ఆసరా లేని జీవితం, ఆవేశాల ఆవిరి పొంగుతున్నా, ఆలోచనలకు కూడా సంకెళ్ళు వేసుకు గడిపే రోజులు అవి. పరాయి పాలన లో సొంత ఇంటిలోనే కిరాయి వాళ్ళలా బతకటం ఎంత నరకమో కదా. ఆ నరకం నుండి దేశాన్ని కాపాడిన వీరులు, యోధులు, నాయకులు, నేతలు, పౌరులు, సైనికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పుణ్యఫలం, ప్రాణ త్యాగం వలనే మనం ఈ రోజున వేడుకలు చేసుకోగలుగుతున్నాం. అలా ఎంతో శ్రమ పడిన వారికి మా తరహా నివాళి.....
1. మహాత్మా గాంధీ : కొన్నిసార్లు రక్తం చిందంచటం సరిపోదు...శరీరం పగిలి రక్తం పారుతున్న చిరునవ్వు చిందించగల ధైర్యం ఎవ్వరికి ఉంటుందో ఆయనే గాంధీ.
2. అల్లూరి సీతారామ రాజు: ఎవ్వరిని పట్టుకోవటానికి బ్రిటిష్ సైన్యం ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి తినలేని పగళ్ళు వేచారో ఆయనే మన్యం వీరుడు మన అల్లూరి సీతారామ రాజు.
3. ఝాన్సీ లక్ష్మిభాయ్: దిక్కుమాలిన నియమాలు పెట్టి, మగదిక్కు లేని సంస్థానాలను కలిపెసుకోవాలని చూసిన బ్రిటిష్ వారిని మీ దిక్కున్న చోట చెప్పుకోండి నా సంస్థానాన్ని మాత్రం ఇచ్చేది లేదు అంటూ తెగేసి చెప్పిన వీర నారి రాణి లక్ష్మీభాయ్.
4. చంద్రశేఖర్ ఆజాద్: పేరు ఆజాద్ అంటే స్వాతంత్ర్యం. పేరు లోనే దిక్కరా స్వరం. పదిహేనేళ్ళ వయసులోనే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు, పాతికేళ్లకే ప్రాణ త్యాగం చేసిన యోధుడు ఆజాద్.
5. నేతాజీ సుభాష్ చంద్రబోస్ : స్వాతంత్ర్యం అడుక్కుంటే వచ్చేది కాదు, మిమ్మల్ని బ్రతిమాలవలసిన అవసరం మాకు లేదు. దేశం కోసం ఏం చేయటానికైనా నేను సిద్ధం. మిత్రులారా మీ రక్తం నాకివ్వండి, స్వాతంత్ర్యం నేనిస్తాను అంటూ సాయుధ పోరాటానికి ప్రాణం పోసిన సేనాధిపతి నేతాజీ.
6. షహీద్ భగత్ సింగ్: మీరు కేవలం మా తలలు తెంచగలరు కాని ఎన్నటికి వాటిని మీ ముందు వంచేలా చేయలేరు అంటూ ప్రాణం విడిచిన పోరాట అమర వీరుడు భగత్ సింగ్.
వీరిని స్మరించటానికి ఈ రోజును మించిన రోజు లేదు. మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేం, దేశానికి చేతనైన మంచి చేయటం తప్ప ఇంకేం చేయగలం మేము. అదే మేము మీకు ఇవ్వగల నిజమైన నివాళి.





