Contributed by Sai Ram Nedunuri
రాతియుగం నుంచి, రాక్షస భావాల వరకు బ్రతకడం కోసం పోరాడే కాలం నుంచి, బ్రతకనివ్వకూడదు అనే కుంచిత స్వభావాల వరకు చూసాను అన్నీ .. సాక్షిగా నిలబడి పచ్చటి తివాచీ నుంచి, పాషాణపు గుర్తుల వరకు ఆహ్లాద పర్యావరణం నుంచి, ఆకాశం వైపు అర్రులు చాచే కాలం వరకు చూసాను అన్నీ .. సాక్షిగా నిలబడి ఎటుచూసినా జలజల పారే జలం నుంచి, అంతరించిపోతున్న జలవనరుల వరకు నేలా నింగి యొక్క నీలం కలిసినట్టు కనిపించే దృశ్యం నుంచి, నేల ఎర్రదనం నింగి కోపాగ్నిగా మారే తరుణం వరకు చూసాను అన్నీ .. సాక్షిగా నిలబడి
పురాణాల నుంచి, మతఛాంధసం వరకు మతం భోధించే మంచి నుంచి, మతం పేరుతో జరిగే అమానుషం వరకు చూసాను అన్నీ .. సాక్షిగా నిలబడి సకలచరాచర జననం నుంచి, నాలో కలిసే సమయం వరకు మహాప్రస్థానం సాగించిన మహానుభావుల నుంచి, భయోత్పాతం కలిగించిన రాక్షసుల వరకు చూసాను అన్నీ .. సాక్షిగా నిలబడి జీవరాశుల భాధలు .. బంధాలు కలకళలు .. సంతోషాలు అధికార కాంక్షలు .. బానిస సంకెళ్లు అభిమాన ఆత్మీయతలు .. ఆనందాల కేరింతలు కృంగిపోయే క్షణాలు .. నేలకొరిగే తరుణాలు ధైర్యంతో నిండిన నయనాలు .. నింగికెగసే పయనాలు నిరంతర మజిలీ కొనసాగిస్తూ చూసాను అనితరసాధ్యమైన ప్రయాణం చేస్తూ చూసాను మౌనంగా .. సాక్షిగా నిలబడి చూసాను.
-- భూమాత అంతరంగం