మనదేశంలో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి.. యుద్ధ ప్రాతిపదికన వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలూ చాలానే ఉన్నాయి. వాటిలో అత్యవసరంగా తీర్చవలసిన సమస్య "మహిళలపై లైంగిక దాడి(రేప్) ".! భారతదేశాన్ని ఒక మహిళగా, భారతమాత గా అభివర్ణిస్తారు కాని మన మహిళ కోసం ఇప్పటికి పటిష్టమైన రక్షణ చర్యలు ఆశించినంత స్థాయిలో లేవు. డిల్లీ నిర్భయ దాడి జరిగిన తర్వాత నిందితులకు శిక్ష పడినా కూడా ఇంకా కిరాతకంగా దేశవ్యాప్తంగా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల ఒక విషయం మనకు అర్ధమవుతుంది, దాడి జరిగిన తర్వాత శిక్ష పడడం ఎంత ముఖ్యమో ఆ దాడి జరుగక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అంత కన్నా ముఖ్యం అని.
సిద్ధార్ద్ మండల.. 17 సంవత్సరాల వయసు ఉన్నా ఈ వ్యక్తి సంవత్సరాల తరబడి మహిళలు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యకు పరిష్కారాన్ని ఆవిష్కరించారు అదే "ElectroShoe". ఈ ఎలక్ట్రో షూ వేసుకున్న వారు తప్ప మిగిలిన వారు ఎవ్వరైనా షూ వేసుకున్న వారిని ముట్టుకుంటే వారికి షాక్ తగిలేలా దీనిని తయారుచేశారు. దీనికి ప్రత్యేకంగా మనం చార్జింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పాదాలకు తొడుక్కుని నడుస్తే దానికదే చార్జ్ అయ్యేలా(Piezoelectric Effect) దీనిని డిజైన్ చేశారు. ఒకవేళ చార్జింగ్ ఫుల్ ఐనా కూడా స్టోరింగ్ కెపాసిటితో ఇది వర్క్ చేస్తుంది.
సిద్ధార్ద్ కు ఇలాంటి ఇన్వెన్షన్స్ అంటే చిన్నతనం నుండి చాలా ఇష్టం. డిల్లీ నిర్భయ ఘటన అతనిని ఎంతో కలిచివేసింది వారికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న తపనతో ఈ షూ తయారుచేశారు. దీని కోసం దాదాపు 4 సంవత్సరాల పాటు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కుని దీనిని పూర్తిచేశారు. ప్రస్తుతం సిద్ధార్ద్ పేటెంట్ హక్కు పొందే పనిలో ఉన్నారు. నిజానికి నిర్భయ చట్టం వచ్చినా గాని, మహిళల రక్షణ కోసం ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకున్నా గాని ఇప్పటికి జరగాల్సిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ షూ వల్ల ఖచ్చితంగా చాలా ఉపయోగం ఉంటుంది. కాని కేవలం షూ వల్ల మాత్రమే సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పలేము. అన్ని రకాల రక్షణ చర్యలతో పాటు సమాజంలో మార్పు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది.