ఒక సర్వే ప్రకారం మన భారతదేశంలో ప్రతి సంవత్సరం టన్నులలో వృధా అయ్యే ఫుడ్ ను జాగ్రత్త చేస్తే కనుక అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ఒక సంవత్సరం పాటు కడుపునిండా భోజనాన్ని అందించవచ్చు. మీరు ఎంత తినాలని అనుకుంటున్నారో అంతే ప్లేట్ లో పెట్టుకోండి, ప్లేట్ లో పెట్టుకున్న భోజనాన్ని అస్సలు వేస్ట్ చెయ్యకూడదు. అలా చేస్తే కనుక మిగిలిన వారి భోజనాన్ని వృధా చెయ్యడమే కాకుండా, వందరోజులకు పైగా కష్టపడిన రైతును కూడా కించపరిచినట్టే. Empty Plate Challenge.. ఒక్క మెతుకు వదలకుండా భోజనం చేసే దమ్ము మీకు ఉందా.?

అవసరానికి మించి తీసుకుంటే దోపిడే: Empty Plate Challenge మొదట ఫారెన్ లో మొదలయ్యింది. తెలుగు రాష్టాలలో వివిధ వ్యక్తులతో పాటుగా న్యూట్రిషనిస్ట్ ప్రశాంతి గారు ప్రజలు, స్కూల్ పిల్లలలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రశాంతి గారు 22 సంవత్సరాల నుండి న్యూట్రిషన్ గా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. పిల్లలలో మాల్ న్యూట్రిషన్ లోపాలు మన భారత దేశంలోనూ అధిక సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. ఫుడ్ లేకపోవడమా.? కరువులు ఉన్నాయా అంటే అది లేదు. ఫోన్ చేసి ఆర్డర్ పెడితే పల్లెటూళ్లకు సైతం ఫుడ్ డెలివరీ చెయ్యబడుతున్న రోజులివ్వి. నేను Foodie, Food Loverని అంటూ చాలామంది వారి కడుపునిండినా కానీ మిగిలిన వారికి విలువైన ఆహారాన్ని డబ్బుతో లాక్కుంటున్నారు ఇది మరొకరకమైన దోపిడి. కడుపునిండా భోజనాన్ని తిని, ఎక్కువ అని కాకుండా అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని పేదలతో పంచుకుంటే కనుక ఆహారం అస్సలు వృధా కాదు.

పిల్లలలో అలవాటు కావాలి: మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళింటికి వెళితే వారు భోజనం చేసే విధానం మనకు అనుభవం ఉండి ఉంటుంది, ఒక్క మెతుకు కూడా వదలరు, వేసుకున్న కూరను కూడా అస్సలు వృధా చెయ్యరు. మన అమ్మ నాన్నలు కూడా దాదాపు ఇలాగే ఉంటారు. ఎటొచ్చి మన తరం మన తర్వాతి తరం పిల్లలలోనే ఈ వృధా అలవాటు ఎక్కువగా మారింది. పిల్లలలో చిన్నతనం నుండే ఇది అలవడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ప్రశాంతి మరియు వారి టీం స్కూళ్ళకు వెళుతుంటారు. ముందుగా మనం ఏ స్థాయిలో వృధా చేస్తున్నాము.? భోజనం మరియు వాటిని పండించడానికి రైతులు, దానిని కొనడానికి మన అమ్మ నాన్నలు ఎంత కష్టపడుతున్నారని వివరించి రైతుల కష్టాన్ని తెలియజేసే ప్లేట్ లో పిల్లలతో కలిసి భోజనం చేస్తారు.

షేర్ చేసుకోండి: మా పిల్లోడు మంచిగా తినాలని అమ్మ అన్నం కూర, పెరుగన్నం, ఓ నాలుగు బిస్కెట్స్, ఓ రెండు పళ్ళు లేదంటే ఓ స్వీట్ లంచ్ బాక్స్ లో పెడుతుంది. ఈ పిల్లోడు వాడికి నచ్చినంత తినేసి మిగిలినది చూస్తే అమ్మ సాయంత్రం కొప్పుడుతుందని డస్ట్ బిన్ లో పడేస్తున్నారు, అది కాస్తా వేస్ట్ అయిపోతుంది. అదే నలుగురు పిల్లలు కలిసి భోజనం చేస్తే ఫుడ్ ని షేర్ చేసుకుంటే ఈ విధమైన వృధా ఏ మాత్రం ఉండదు. అలాగే హోటళ్లల్లోనూ తినగా మిగిలినది పార్సిల్ కట్టించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన పద్దతులే కొత్తగా కనుగొన్నవేమి కాదు, ఆచరించకపోవడం వల్లనే మై స్టోరీస్, ప్రశాంతి లాంటి వారు మరలా గుర్తు చెయ్యాల్సి వస్తుంది.
