Here's What Happened When A Guy Had a Chance Encounter With His Conscience!

Updated on
Here's What Happened When A Guy Had a Chance Encounter With His Conscience!
(Contributed by Eswara Uday Sai Kiran) నడవటం మొదలుపెట్టి చాలా సేపయింది. చీకటి కూడా పడింది. ఎంత దూరమెళ్ళాలో తెలీదు, అంచనాలే తప్ప అవగాహన లేదు. చూస్తూ చూస్తూ కారాడవిలోకి ప్రవేశించా. ప్రపంచాన్ని కమ్మేసిన చీకటి, నా కంటికేదీ కనిపించకుండా చేసింది. మనసేమో బిక్కు బిక్కుమని జంకుతోంది. వెనక్కి వెళ్ళలేను, ముందుకి దారి లేదు, వెతికే ధైర్యం లేదు. కళ్ళ ముందూ, వెనకా శూన్యం ఆవహించింది. అప్పుడు సరిగ్గా రెండు ఫర్లాంగుల దూరంలో ఎదో వెలుతురు కనపడింది. ఎవరో చేతిలో దీపంతో వస్తున్నారు. ధైర్యం భయం రెండూ ఒకేసారి వచ్చి చేరాయి మనసులో. వెలుతురు దగ్గరికొచ్చే కొద్దీ ప్రాణం పోయేంత పనయింది. చూస్తుండగానే దీపంతో ఉన్నాయన నా దగ్గరికి చేరుకున్నాడు. బాగా ముసలాడిలా ఉన్నాడు. ఉన్న ధైర్యాన్నంతా కూడి అడిగేసా, "అయ్యా, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అర్ధం అవడం లేదు, చాలా భయంగా ఉంది, ఈ భయంతో ఎక్కడికెళ్ళాలో కూడా మర్చిపోయాను" అని. ఆయన నవ్వుతూ "నన్నడుగుతావేంటయ్యా ఎక్కడికెళ్లాలని, నీలోనే ఒకడున్నాడుగా వాడినే అడుగు, చెప్పడం కాదు, దగ్గరుండి తీసుకెళ్తాడు" అన్నాడు. నాకేమి అర్ధం కాక బిత్తిరిపోయి చూడడంతో, ఆయనే మళ్ళీ "కళ్ళు మూసుకొని, నీ అంతరాత్మని అడుగు, చెప్తాడు, నీ ప్రపంచంలో అతనివ్వలేని సమాధానం లేదు, అతన్నే నమ్ము" అన్నాడు. సరే అని కళ్ళు మూసుకొన్న నాకు "కొద్ది సేపటి తర్వాత నా పుట్టుక ముందు నుంచీ నా ప్రయాణం మొదలైందని, నా చిన్నప్పటి నుండి జరిగిన ప్రతీది కళ్ళకద్దినట్టు కనపడింది, ఒక గొంతు నాతొ మాట్లాడుతోంది, ఎవరో అడగాల్సిన పని లేదు, పెద్దాయన చెప్పిన అంతరాత్మ ఈయనేనేమో. కొండంత ధైర్యం నా సొంతం ఇప్పుడు, అంతటి చీకట్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతోంది నా దారి. పెద్దాయనకి కృతజ్ఞతలు చెపుదామని కళ్ళు తెరిచా, కాని ఆయన అదృశ్యం. మళ్ళీ ఎదో సంకోచం మనసులో, కళ్ళు మూసుకుని అడిగేసా అంతరాత్మని, ఎవరు ఆ పెద్దాయనా అని, అప్పుడు అంతరాత్మ " అది నేనే, నువ్వు చిక్కుల్లో పడ్డప్పుడు వస్తూ ఉంటా, నువ్వే గుర్తించలేదు ఎప్పుడూ నన్ను" అన్నాడు. దానికి నేను, మరి నా అంతరాత్మ అన్నప్పుడూ, అచ్చం నాలానే ఉండాలిగా, మరి ముసలాడిలా ఉన్నావేంటి?. "పిచ్చోడా, నీ దేహం నాకు సొంతం, నేను నీ దేహానికి కాదు, ఇప్పుడు నువ్వు, తరవాత ఇంకో దేహం, అలా ప్రయాణమే నా కర్తవ్యం". అని నవ్వుతూ నా కంటికి పట్టిన పోరని తీసేసాడు ఆ పెద్దాయన. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది నా గమ్యం, అది ఎక్కడో లేదు, నా నుండి నా వరకు నేను చేసే ప్రయాణమే ఈ జీవితం. నన్ను నేను గెలవడమే నా గమ్యం.