How The Song "ఎంత మాయాగల్లదీ బట్టా" Explains About Evolution Of Both Clothes & Human At The Same Time

Yentha Maaya Song Lyrical Meaning
Updated on
How The Song "ఎంత మాయాగల్లదీ బట్టా" Explains About  Evolution Of Both Clothes &  Human At The Same Time

Contributed by Sairam Nedunuri

మల్లేశం చిత్రంలో "చింతకింది మల్లేశం" గారి జీవితాన్ని ఎంత అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రీకరించారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ చిత్రం మొదలులో వచ్చే ఈ "ఎంత మాయా" పాటని "Peddinti Ashok Kumar" గారు అద్భుతంగా రాశారు. ఈయన ఈ చిత్రానికి, దర్శకుడు "Raj Rachakonda" గారితో కలిసి Screenplay కూడా రాశారు.

ఈ పాటలోని సాహిత్యంలో, హైందవ పురాణాలలో మనీషి జీవితం, జీవనం, దేహం గురించి చెప్పిన అంశాలను ప్రస్తావించారు.
సాహిత్యంలోని భావం, మనిషికీ, చేనేత వస్త్రాలకీ, రెండిటికీ వర్తించేటట్టు ఉంటుంది. ఈ రెండు కోణాల నుంచి, ఈ పాట భావాన్ని ఈ Article లో వివరించడం జరిగింది.

ఎంత మాయాగల్లదీ బట్టా
నవ నాడులనుగొని
పడుగు పేకలు వరుసగా చుట్టా

పడుగు, పేకా = పొడవు, వెడల్పు/Length, Breadth
నాడి = నరము, ప్రాణ శక్తి ప్రవహించే మార్గము

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రాలకు ఉండాల్సిన మడతలు, అవసరమైన చోట ఉండే కుట్లని మనం ఇక్కడ నాడులుగా అర్ధం చేసుకోవచ్చు.
వస్త్రాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి కానీ, నిజానికి దారం పోగులను పొడవు, వెడల్పులలో ఒక వరుస క్రమంలో అమర్చి, అవసరమైన చోట మడతలు, కుట్లు వేస్తేనే వస్త్రం తయారవుతుంది. కానీ చూసే కళ్ళకి మాత్రం, వస్త్రం తయారుచేయడం వెనుక ఉన్న అసలు శ్రమ, విధానం పెద్దగా కనిపించదు. అందుకే మనం ధరించే వస్త్రాన్ని మాయగా వర్ణించారు.

మనిషికి వర్తించే భావం:
మనిషి శరీరంలో వివిధ నాడులు ఉంటాయని యోగ శాస్త్రం చెప్తోంది. వివిధ అవయవాలు, నాడులు అన్నీ పొడవు వెడల్పులలో ఒక వరుసలో అమరితేనే ఎన్నో మాయలతో కూడిన ఈ మానవ శరీరం తయారౌతుంది అని చెప్పారు రచయిత.

పంచభూతము లోంచి విధి తానెంచగా నూలుండ చేసి
గర్భమను మగ్గమూ మీద బ్రహ్మ నేసెను నవామాసము

నూలు = దారం
ఉండ = గుండ్రంగా ఉండేది, lump
విధి = కాలం, Fate
పంచభూతాలు = గాలి, నీరు, అగ్ని, పృథ్వి, ఆకాశం.
నేసెను = To Weave
మగ్గము = వస్త్రం నేసే పరికరం
నవ మాసము = తొమ్మిది నెలలు

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రం చేయడానికి ఉపయోగించే దారం ఈ పంచభూతాల నుంచే వస్తుంది. ఏ దారం ఏ వస్త్రంలోకి వెళ్తుందో విధే నిర్ణయిస్తుంది. ఈ విశ్వంలో పుట్టే జీవ రాశులను మలిచేది బ్రహ్మ అంటారు. ఈ సృష్టిని మలిచేది బ్రహ్మ అయినపుడు, వస్త్రాన్ని గర్భం లాంటి మగ్గం మీద నవమాసాలు ఎన్నో శ్రమలకి ఓర్చి నేసే వారు కూడా బ్రహ్మతో సమానమే అని ఎంతో అద్భుతంగా పోల్చారు.

మనిషికి వర్తించే భావం:
మనిషి పుట్టుక విధి లిఖితం అంటారు. పంచభూతాలతో నిండిన ఈ మానవ శరీరం, తల్లి గర్భంలో మొదటగా ఒక ఉండ లాగ మొదలయ్యి, తొమ్మిది నెలలు అయ్యే సరికి పూర్తి శరీరంగా మారుతుందని మనిషి పుట్టుకకు వర్తించేటట్టు వర్ణించారు రచయిత.

ఆరారు మూరలు ఏడు గీరలు
మూర మూరకు మారు రంగులు
ఎరుపు నలుపు నీలి తెలుపు పసిడి కుంకుమ రంగులద్దుక

మూర = చేయి అంత పొడవు/Arm's length, నిడివి/Duration
గీర = చక్రం/Cycle

వస్త్రాలకు వర్తించే భావం:
దారాల వరుసలలో ప్రతి ఆరు మూరలని పేరుస్తూ
మళ్ళీ ఏడు గీరలుగా చూడతారని వస్త్రాన్ని నేసే పద్ధతిని వివరించారు. అలాగే, ఒక్కొక్క మూరకి వస్త్రానికి కావలసిన వివిధ రంగులని అద్దుతారు.

మనిషికి వర్తించే భావం:
ప్రతి మనిషి జీవితం లో ఆరు దశలు ఉంటాయని అంటారు. తల్లి గర్భం లో ఉండే దశ, పసి వయసు దశ (ఇంకా మాటలు, నడక రాని వయసు), బాల్య దశ, యవ్వన దశ, వయోజన దశ (adulthood), వృద్ధాప్య దశ.
ఇలాంటి దశలు ఉన్న జన్మలు మనిషికి ఏడు ఉంటాయని అంటారు.
కాబట్టి, "ఆరు మూరలని" మనిషి జీవితంలో ఆరు దశలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దశలో మనిషి స్వభావం లో వచ్చే మార్పులని "మూర మూరకి మారు రంగులు" అనే వాక్యంతో వర్ణించారు. అలాంటి ఏడు జన్మలను, "ఏడు గీరల"తో వర్ణించారు.

లేడీ కరి మండూక మకరాలు
పన్నెండు దళముల అద్దకముతో కమల పూవులు

లేడి = జింక/Deer
కరి = ఏనుగు/Elephant
మండూకం = కప్ప/Frog
మకరం = మొసలి/ Crocodile
దళం = పువ్వు రెక్కలు, మొక్క ఆకులు
కమల పువ్వు = Lotus

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రం సిద్ధం అయ్యాక ఆ వస్త్రం మీద వివిధ బొమ్మలు వేస్తారు. అందులో జింక, ఏనుగు, కమల పువ్వులు మొదలైనవి ఉంటాయి.

మనిషికి వర్తించే భావం:
Evolution Theory ప్రకారం, మనిషి కంటే ముందు ఈ భూమి మీద Amphibians, reptiles ఎక్కువ ఉండేవి అంటారు. ఆ తరువాత కేవలం భూమి మీద బ్రతికే జంతువులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కువ సంఖ్యలో మనుషులు వచ్చారు. యోగ శాస్త్రం ప్రకారం మనిషి గుండె దగ్గర "అనాహత చక్రం" 12 petals తో ఉండే కమల పువ్వు లాగ ఉంటుందని అంటారు.
కాబట్టి పైన సాహిత్యంలో, మానవుల పుట్టుక క్రమం చెప్పడానికి, కప్ప లాంటి amphibian ని, మొసలి లాంటి reptiles ని, జింక, ఏనుగు లాంటి జంతువులని ప్రస్తావించి, చివరికి మానవ జన్మ వచ్చిందని వర్ణించడానికి మానవులలో ఉండే 12 దళముల కమలపువ్వుని రచయిత ప్రస్తావించి ఉంటారు.

బట్ట చూపుకు మంద ముండును
పోగు పోగున రంధ్రాముండును
ధ్యానమున నానేసి ఉతికిన బట్టలో బ్రహ్మాండముండును

పోగు = దారం
మందం = Thick, rough
నానేసి = తడిపి

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రాన్ని చూసినప్పుడు మందంగా ఉంటుంది కానీ, బాగా పరిశీలిస్తే దారాల మధ్యలో రంధ్రాలు ఉంటాయి. అంటే మనకి కనిపించేది మాత్రమే నిజం కాదని చెప్పారు రచయిత. మనుషులు వస్త్రం లేకుండా ఉండలేరు. కాబట్టి వస్త్రాన్ని జాగ్రత్తగా ఉతికి, జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఈ సృష్టి నడవడం లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు రచయిత.

మనిషికి వర్తించే భావం:
మనుషులు తమ దేహ రూపంలో (Physical Appearance) పైకి మందంగా, మొరటుగా కనిపిస్తారు కానీ, లోతుగా పరిశీలిస్తే సున్నితమైన దారంకి ఉండే స్వభావం కలిగి ఉంటారు. వస్త్రాన్ని జాగ్రత్తగా నానేసి ఉతికినట్టు, మనుషులు కూడా ఎవరికీ వారు తమని తాము పరిశీలించుకుంటే ఈ విశ్వం/బ్రహ్మాండం మొత్తం తమలోనే ఉన్నాయని గ్రహించగలుగుతారు అని వర్ణించారు రచయిత.

సూర్య చంద్రులు అంచునందుండు
జీవుడు దేవుడుగా బట్టలోనే మారుతానుండు

అంచు = Edge
జీవుడు = Living Entity/Soul

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రానికి అంచులో
సూర్యుడు, చంద్రుడు ఆకారం లో బొమ్మలు ముద్రిస్తారు. అలాగే వస్త్రాలను వేసుకున్న మనిషి తను బ్రతికే పద్ధతిని బట్టి కేవలం సాధారణ మనిషి గానూ బ్రతకొచ్చు లేక నలుగురితో గౌరవం పొందుతూ, తన జీవితాన్ని సార్ధకం చేసుకుని, దేవుడిలా ఉండొచ్చు అనే అర్థం వచ్చేలా ఉంది సాహిత్యం.

మనిషికి వర్తించే భావం:
అందరి జీవితాలు కలగలిసిన ఈ సృష్టిలో రోజులు అనేవి కాలాన్ని సూచించే గుర్తులు. ప్రతి రోజుకి రెండు అంచులు. అవి పగలు, రాత్రి. ఒక అంచు దగ్గర సూర్యుడు, ఇంకొక అంచు దగ్గర చంద్రుడు ఉంటారు. కాబట్టి ఈ సృష్టిలో ఉండే అంచులలో సూర్యుడు, చంద్రుడు ఉంటారని అద్భుతంగా వర్ణించారు రచయిత. మానవులు ఈ దేహ రూపం (physical body) లో తమ నడవడిక, ప్రవర్తన, స్వభావం బట్టి కేవలం సాధారణ మనిషిగా మిగిలి పోవచ్చు, లేక ఆ దేవుడిలో లీనం కూడా అవచ్చు అనే అర్థం వచ్చే లాగ, ఈ దేహం అనే వస్త్రం లోనే జీవుడు దేవుడుగా మారడానికి వీలు ఉందని వర్ణించారు.

మాయి మాయాగల్లదీ బట్టా
మాయలను తెలిసి
మాయకుండా మడుతగా పెట్టా

మాయి = మరక, మలినం, దుమ్ము

వస్త్రాలకు వర్తించే భావం:
వస్త్రానికి మలినం, మరకలు అంటుకునే ఆస్కారం ఉంటుంది. అలాగే ఎంతో మాయతో కూడుకున్నది కూడా. ఆ మాయలని గ్రహించి, మరకలను కడిగే మార్గాలని తెలుసుకుని, జాగ్రత్తగా శుభ్రపరచి మడతపెట్టుకోవాలని చెప్తున్నారు రచయిత.

మనిషికి వర్తించే భావం:
మనిషి జీవితం, దేహం కూడా వస్త్రంలాగే మలినం, మాయా కలిగినది కాబట్టి, ఎవరికి వారు తమను తాము పరిశీలించుకుని, వాళ్ళ జీవితాలని జాగ్రత్తగా మలుచుకోవచ్చని చెప్పారు రచయిత.

బట్ట మర్మం తెలిసి బ్రతికితే బ్రహ్మయోగం కళ్ళ ముందు
కాదు లేదని బ్రహ్మల బ్రతికితే కాలి పిడికెడు బూడిదగును

మర్మం = Inner Meaning

వస్త్రాలకు వర్తించే భావం:
ప్రతి వస్త్రానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం తెలుసుకునే మనం ఆ వస్త్రాన్ని ఎలా ఉతకాలి, శుభ్రం చేయాలి అని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ వస్త్రం స్వభావం తెలియకుండా మనం ప్రవర్తిస్తే, వస్త్రం పనికిరాకుండా పోయే ప్రమాదముందని చెప్పారు రచయిత.

మనిషికి వర్తించే భావం:
మానవులు వస్త్రంగా కలిగిన వాళ్ళ దేహాన్ని, జీవితాన్ని పరిశీలించుకుని, మర్మాన్ని గ్రహించి ప్రవర్తిస్తే బ్రహ్మయోగం అనే అత్యున్నత స్థాయిని చేరుకోగలరు. అలా కాకుండా బ్రహ్మలలో బ్రతికితే ఉపయోగం ఉండదు అనే అర్థం వచ్చేటట్టు చెప్పారు రచయిత.

ఇటువంటి అత్యున్నత సాహిత్యం అందించిన "Peddinti Ashok Kumar" గారికి, అద్భుతమైన సంగీతం అందించిన "Mark K Robin" గారికి, ఇలాంటి అద్భుతమైన చిత్రాలని మనకి అందించిన "Raj Rachakonda" గారికి, అద్భుతంగా నటించిన Priyadarshi, Ananya Nagalla, Jhansi, Ananda Chakrapani గార్లకీ మరియు మిగతా చిత్ర బృందం అందరికీ మన అందరి తరఫునా ధన్యవాదాలు, అభినందనలు.

నేను వేతికినంతలో, నాకు అర్థమైనంతలో, పాటకి భావం చెప్పే ప్రయత్నం చేశాను. తప్పులుంటే క్షమించాలని మనవి.

https://youtu.be/YeMX5VlndsI

మొత్తం పాట:

ఎంత మాయా గల్లదీ బట్టా
నవ నాడులనుగొని
పడుగు పేకలు వరుసగా చుట్టా

పంచభూతము లోంచి విధి తానెంచగా నూలుండ చేసి
గర్భమను మగ్గమూ మీద బ్రహ్మ నేసెను నవామాసము

ఎంత మాయా గల్లదీ బట్టా
నవ నాడులనుగొని
పడుగు పేకలు వరసగా చుట్టా

ఆరారు మూరలు ఏడు గీరలు
మూర మూరకు మారు రంగులు
ఆరారు మూరలు ఏడు గీరలు
మూర మూరకు మారు రంగులు
ఎరుపు నలుపు నీలి తెలుపు పసిడి కుంకుమ రంగులద్దుక
లేడీ కరి మండూక మకరాలు
పన్నెండు దళముల అద్దకముతో కమల పూవులు

బట్ట చూపుకు మంద ముండును
పోగు పోగున రంధ్రాముండును
బట్ట చూపుకు మంద ముండును
పోగు పోగున రంధ్రా ముండును
ధ్యానమున నానేసి ఉతికిన బట్టలో బ్రహ్మాండముండును
సూర్య చంద్రులు అంచునందుండు
జీవుడు దేవుడుగా బట్టలోనే మారుతానుండు

మాయి మాయాగల్లదీ బట్టా
మాయలను తెలిసి
మాయకుండా మడుతగా పెట్టా

బట్ట మర్మం తెలిసి బ్రతికితే బ్రహ్మయోగం కళ్ళ ముందు
కాదు లేదని బ్రహ్మల బ్రతికితే కాలి పిడికెడు బూడిదగును

మాయి మాయాగల్లదీ బట్టా
మాయలను తెలిసి
మాయకుండా మడుతగా పెట్టా